మెదక్

మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 21: తక్కువ అక్షరాస్యత ఉన్న మెదక్ జిల్లాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి విద్యాపరంగా అభివృద్ధికై అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, అటవి శాఖ మంత్రి జోగు రామన్న, శాసన సభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి విద్యా వ్యవస్థ తీరుతెన్నులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మానవ వనరుల అభివృద్ధి సూచికలలో దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా నిధులు వెచ్చించని కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనం సిద్ధించలేదన్నారు. మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా బంగారు తెలంగాణ సాధనకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో పోటీతత్వంతో కూడిన విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు శాఖ పరంగా ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన వౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యాపరంగా జిల్లాలో ఉన్న లోటు పాట్లు సరిదిద్దనిదే ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం చేకూర్చినప్పుడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించగలరని, విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు, అద్యాపకులు పాటుపడాలని కోరారు. అక్షరాస్యతలో మెదక్ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రాధాన్యనిచ్చి 11 మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ బాలబాలికల కోసం 8, ఎస్టీ బాల బాలికల కోసం 8 గురుకుల పాఠశాలలతో పాటు 3డిగ్రీ కళాశాలలను మంజూరు చేసిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే వీటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి సౌకర్యం, బోధన బోధనేతర సిబ్బంది, వౌలిక సౌకర్యాలపై వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశమై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాకు మంజూరైన కిచెన్ షెడ్స్ నిర్మాణాలను ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాపరంగా జిల్లాకు కొత్తరూపు సంతరించేందుకు సుమారు 288కోట్ల రూపాయలు తక్షణమే అవసరమున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెంటనే స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదనలు పంపాలన్నారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను త్వరలోనే క్రమబద్దీకరిస్తామని, మిగిలిన ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. అన్ని వౌలిక సౌకర్యాలతో జూనియర్ కళాశాలలను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 7 జూనియర్ కళాశాలల భవనాలకు రూ.2కోట్ల 50లక్షలు మంజూరు చేసుకోగా ఎక్కడా కూడా పనులు జరగడం లేదని, వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. మోడల్ స్కూల్స్‌కు మంజూరు చేసిన ఆర్‌ఓ ఫ్లాంట్ల ఏర్పాటుకై వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. గత ప్రభుత్వాలు విద్యాపరమైన సిబ్బంది, భవన నిర్మాణాలు, ఇతర వౌలిక సౌకర్యాల ఏర్పాటుపై సరయైన శ్రద్ధ చూపలేదని, జిల్లా సమీక్షా సమావేశాలలో వివిధ శాఖలతో పాటు విద్యాశాఖపై కూడా తరచూ సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలల్లో బోధనా సిబ్బంది లేరని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, కాంట్రాక్టు పద్దతిలో ఖాళీల భర్తీకై తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐఓను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలలకు ప్రహారీ గోడల నిర్మాణాలకు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు తమ అభివృద్ధి నిదులను సమకూర్చాలని మంత్రి కోరారు. అంతే కాకుండా ఉపాధి హామి నిధులను కూడా ఈ విషయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఈ యేడాది నుండి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నందున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థుల కళాశాలల్లో చేర్పించాలని సూచించారు. ఎక్కడా లేని రీతిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియేట్ ఉచిత విద్య విధానం ప్రవేశపెట్టిందని, ఈ విషయంలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా అన్ని జూనియర్ కళాశాలల్లో క్రీడా సామాగ్రి, ఫర్నిచర్, ఆర్‌ఓ ఫాంట్లు, బయోమెట్రిక్ ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభానికి పౌరశాఖ ద్వారా త్వరలో జివో రానున్నందున ముందుస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పండుగ వాతావరణంలో స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని మంత్రి ఆర్‌ఐఓను ఆదేశించారు. పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల విద్యా విధానంపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు ప్రోఫెసర్ జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేని నివాళులు అర్పించారు. సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, డిగ్రీ కళాశాల విద్యా కమీషనర్ వాణిప్రసాద్, జూయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, మదర్‌రెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపాల్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.