మెదక్

అంతటా వర్షం..సర్వత్రా హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, సెప్టెంబర్ 17: ఆలస్యంగా వరుణుడు కరుణించాడు..రైతన్న మురుస్తున్నాడు...చెట్టు, చేమలు, పశుపక్షాదులు ఎగిరి గంతెస్తున్నాయి...ప్రకృతి పరవశిస్తుంది...గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వాగులు, వంకలు, కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. హల్దీ వాగుపై నిర్మించిన బొల్లారం మత్తడివ పొంగిపొర్లుతుండగా..మహబూబ్‌నహర్ కాలువ నిండుగా పారుతుంది. వర్షంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు భూగర్భజలాలు పెరిగి తాగునీటి కష్టాలు తీరుతున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషపడుతున్నారు. గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తున్న విషయం తెల్సిందే. రెండు రోజులుగా కురిసిన వర్షంతో జలకళ సంతరించుకుంది. వెల్దుర్తి మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా హల్దీవాగు పారడంతో బొల్లారం మత్తడి నిండు కుండలామారి పొంగిపొర్లుతుంది. మరోవైపు మహబూబ్‌నహర్ కాలువ నిండు ప్రవహిస్తుంది. దీంతో కాలువ ద్వారా మండలంలోని పలు చెర్వుల్లో నీరుచేరుతుంది. ఒకటి, రెండు రోజుల్లో ఇదేవిధంగా కాలువ నీరొస్తే అలుగులు పారనున్నాయి. బొల్లారం మత్తడి నుండి ముత్తాయిపల్లి వరకు మహబూబ్‌నహర్ కాలువ నిండుగా పారుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. గత మూడేళ్లుగా జలకళకు నోచుకోని పసుపులేరుసైతం ఉరకలేస్తుంది. ఆశించిన స్థాయిలో నీరు కిందికి పారుతున్నాయి. ఈసారి నాటేసిన పంటలకు ఇక ఢోకాలేదన్న భరోసాతో ఉన్నారు. ఘన్‌పూర్ ఆనకట్టకింద గల మహబూబ్‌నహర్ కాలువ ఆయకట్టు రైతులకు రబీ సీజన్ పంటలు పండినట్లేనని చెప్పవచ్చు. వేలాది రూపాయలు పెట్టుబడులుపెట్టిన రైతులకు ఇబ్బందులు లేకుండా పంటచేతికందే అవకాశం ఉంది.
కొల్చారం: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఘణపురం ఆనకట్ట పరవల్లు తొక్కుతుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి రబ్బీ సీజన్‌లో అయినా వరినాట్లు వేసుకోవచ్చని రైతులు అనుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా వర్షాలు సకాలంలో కురియకపోవడంతో అన్నదాతలు ఉన్న కొద్దిపొలాన్ని నాటు వేసినప్పటికీ అవి ఎండిపోయే దశలో వర్షం కురియడంతో వేసిన పంటలైన చేతికి రాకపోయతా అని రైతులు అనుకుంటున్నారు.

‘విమోచన’పై నిరసన వెల్లువ

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంలో అంతర్యమేమిటని, అధికారికంగా నిర్వహించాలని బిజెపి, టిడిపి, ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి, టిడిపి కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, పట్టణంలోని కల్వకుంట రోడ్‌లో ఎబివిపి రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోవడంలో మతపక్షపాత ఓటు రాజకీయం కెసిఆర్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాగా ఎబివిపి నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లి జాతీయ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఎబివిపి నాయకులను అడ్డగించడంతో తప్పించుకొని కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. చాకచక్యంతో పోలీసులు అందరిని అరెస్టు చేసి మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మెదక్: శనివారం రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి నాయకులు మెదక్ ఖిల్లాపై, మున్సిపల్, ఎంపిడివో కార్యాలయం, రాందాస్ చౌరస్తాలో జాతీయ జెండాను రాంచరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎగురవేశారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన బిజెపి నాయకులను మెదక్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ డిగ్రీ కళాశాలలో బిజేవైఎం నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలను శనివారం రోజు బిజెపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పోలీసులకు స్వీట్లు పంపిణీ చేసి మోడీ జన్మదినాన్ని చాటుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని అరెస్టయిన బిజెపి నాయకులు పోలీస్‌స్టేషన్‌లోనే ప్రధానమంత్రి మోడీ జన్మదినం చేసుకోవడం ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది
తుపాకులు కాదు..పటిష్ట చట్టం కావాలి
* డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు
మెదక్, సెప్టెంబర్ 17: అటవీశాఖ అధికారులకు తుపాకులు ఇచ్చేదానికన్నా అడవులను అభివృద్ధి చేయడానికి శాసనసభలో పటిష్టమైన చట్టాలను రూపొందిస్తే సరిపోతుందని మెదక్ డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాల పునర్ విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండువేల పైన ఉద్యోగులను రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించిందన్నారు. వీందరి నియామకాలు స్థానికులకే వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఫారెస్ట్ బ్లాక్‌లపై క్షుణంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. 200 హెక్టార్ల చొప్పున ట్రెంచ్‌లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 79 ఫారెస్ట్ బ్లాక్‌లలో ట్రెంచ్‌లు ఏర్పాటు చేసే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. హైదరాబాద్ చుట్టు ట్రెంచ్‌లపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అడవులు జిల్లాలో 33 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 9.5 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. జిల్లాలో 96.299 హెక్టార్ల అడవులు విస్తరించి ఉన్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 15 రేంజ్ ఆఫీసర్ల స్థానాలు పెరిగాయన్నారు. అదే విధంగా 15 డిప్యూటి రేంజ్ ఆఫీసర్లు కూడా పెరిగినట్లు ఆయన తెలిపారు. 38 సెక్షన్ ఆఫీసర్లు, 111 బీట్ ఆఫీసర్లు, 97 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు పెరిగినట్లు తెలిపారు. వైల్డ్‌లైఫ్ పోచారం, మంజీర సోషల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో కలిసిపోయాయని తెలిపారు. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు వరంగల్, కరీంనగర్ నుండి మెదక్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పునర్ విభజనలో భాగంగా మెదక్ మూడు జిల్లాలుగా ఏర్పడటంతో అటవి ప్రాంతాన్ని ఏర్పడటం కెటాయించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాకు 51,588.5 హెక్టార్ల అడవికి కెటాయించినట్లు తెలిపారు. సిద్దిపేటకు 25,652.9 హెక్టార్లు, సంగారెడ్డికి 25,593 హెక్టార్ల అడవులను విభజించినట్లు తెలిపారు. మొత్తం లక్ష 2833 హెక్టార్ల అడవులను మూడు జిల్లాలకు విభజించినట్లు తెలిపారు. ఈ మూడు జిల్లాలపైన డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ కన్జర్‌వేటర్, ఫ్లయింగ్‌స్వాడ్, రేంజ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. వీటన్నింటినికి జిల్లాల వారిగా టెక్నికల్ ఆఫీసర్లు అవసరమని ఆయన తెలిపారు.

2019లో అధికారం మాదే
* తెరాస అవినీతి, అక్రమాలపై నిలదీస్తాం
* కమీషన్ల కోసమే మీ బతుకు పోరాటం
* కాంగ్రెస్ హయంలోని పనులకే మళ్లీ శంఖుస్థాపనలు
* కాంగ్రెస్‌ను విస్మరిస్తే సహించేది లేదు
* మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 17: రాబోయే 2019లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, ప్రజలను మభ్యపెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న తెరాస అంతు చూస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) హెచ్చరించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమీషన్ల కోసమే మీ బతుకు పోరాటం తప్పా రాష్ట్ర ప్రజల బతుకు కోసం కాదని తెరాసపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయంలో ప్రారంభించిన పనులకే మళ్లీ కొబ్బరికాయలు కొట్టి శంఖుస్థాపనలు చేస్తున్నారు తప్పా కొత్తగా ఏమి లేదన్నారు. సిఎం కెసిఆర్ గారడి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు స్వచ్చమైన పాలన అందించాలని డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాదని, ప్రాజెక్టులకు వ్యతిరేకమైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేదే కాదన్నారు. రీడిజైన్ పేరుతో భూ నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 125యేళ్ల చరిత్ర ఉందని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కానీ నిన్న, మొన్న వచ్చిన సిఎం కెసిఆర్, మంత్రులు కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజాం రజకార్ల చేర నుండి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని, ఈ రోజు అన్ని కుల మతాలు స్వేచ్చగా బతుకుతున్నాయంటే స్వర్గీయ వల్లబాయ్ పటేల్, నేహ్రు కృషి ఫలితమేనని, రజకార్ల నుండి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, నాయకులు శ్రావణ్‌కుమార్, జెడ్పీటిసిలు అంజయ్య, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

13 టిఎంసిలకు చేరిన సింగూర్
* అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
* జంటనగరాల గొంతు తడపనున్న మంజీర
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, సెప్టెంబర్ 17: రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల చరిత్రలో ఎన్నడు లేనివిధంగా పూర్తిగా ఎండిపోయిన సింగూర్ ప్రాజెక్టు తన పూర్వవైభవానికి సగానికిపైగా వరదనీరును నింపుకుంటుంది. శనివారం సాయంత్రానికి 13 టిఎంసిల నీటి నిల్వ చేరుకోగా ఎగువ నుంచి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆదివారం తెల్లవారే సరికి 15 టిఎంసిలకు నీటి నిల్వ చేరుకుటుందని ప్రాజెక్టు అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. మంజీర నదికి ఎగువన కర్నాటకలోని బీదర్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలోని న్యాల్‌కల్, మనూర్, ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి, జహీరాబాద్, కోహీర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వాగుల ద్వారా వరద నీరు సమకూరుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈ నెల 21వ తేదీ నుంచి తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుండటంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండుకుండలా తొణకిసలాడే అవకాశం ఉంది. దిగువన మంజీర బ్యారేజ్, ఘన్‌పూర్ ఆనకట్టలకు నీటి కొరత తీరడం ఖాయమని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో నీరు నిండితే ఘన్‌పూర్ ఆయకట్టకు రబీకి కూడా సాగునీటిని అందిస్తారన్న నమ్మకం ధాన్యం రైతుల్లో అదనపు ధైర్యాన్ని నింపుతోంది. గత వేసవికి ముందుగానే సింగూర్ ప్రాజెక్టు నుంచి జంటనగారలకు సరఫరా చేసే మంజీర నీటిని ప్రభుత్వం నిలిపివేసింది. కృష్ణా, గోదావరి జలాలకంటే మంజీర నీటికే నగరవాసులు మోజు పడతారు. అలాంటి మంజీర నీరు మరో మారు సరఫరా అవుతుందన్న ఆశలను హైదరాబాద్ వాసుల్లో కల్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 20 వేల క్యూసెక్కుల చొప్పున వరద నీరు రెండు మూడు రోజులు వచ్చి చేరితే ప్రాజెక్టు గేట్లను ఎత్తినా ఆశ్చర్యపోనక్కర లేదు. కాగా లీకేజిల రూపంలో 117 క్యూసెక్కుల చొప్పున ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు వెళ్లిపోతుంది. పైనుంచి వరద ప్రభావం ఎక్కువ మొత్తంలో ఉండటంతో లీకేజి నీటిని అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. మరోసాగునీటి ప్రాజెక్టు అయిన నల్లవాగులోకి నీరు చేరుకుంటూనే ఉంది. పెద్ద చెరువులైన మల్కాపూర్, మెలిగిరిపేట, అన్నసాగర్ తదితర చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరుతుంది. ఖరీఫ్ ఆరంభంలో అంతంత మాత్రంగానే వర్షాలు కురియగా చెరువుల్లోకి ఆశించిన నీరు చేరలేకపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు సమకూరడంతో కనీసం భూగర్భ జలమట్టమైనా పెరుగుతుందని అన్ని వర్గాలు సంతృప్తి చెందుతున్నాయి.

నాడు ఉద్యమించి నేడు విస్మరించడం తగదు
* ఎందుకు వెనక్కి తగ్గారో ప్రజలకు జవాబు చెప్పాలి?
* కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి
* పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపారని నాడు ఉద్యమించి అధికారంలోకి రాగానే విస్మరించడం తగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి సాయుద, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజకార్ల నుండి తెలంగాణకు విముక్తి కలిగిన రోజును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల బాగుకోరి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేలా సహకరిస్తామన్నారు. వచ్చే యేడాదికన్న ప్రభుత్వం మనస్సు మార్చుకొని విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి, డాక్టర్ శ్రావణ్‌కుమార్, జెడ్పీటిసిలు ప్రభాకర్‌రెడ్డి, అంజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శంకర్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దళితులపై వివక్ష కొనసాగుతోంది
మెదక్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలోని దళితులపై ఈ రోజు వరకు వివక్షత కొనసాగుతుందని శనివారం నాడు మెదక్‌లో జరిగిన తెలంగాణ ఎంఆర్‌పిఎస్ జిల్లా సమావేశంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు వెల్లడించారు. జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టినట్లు ఆ సమావేశం పేర్కొంది. ఈ సమావేశానికి చింతల రాములు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎంఆర్‌పియస్ వర్కింగ్ ప్రసిడెంట్ గడ్డ యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి రాజులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం 23 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మూడవ వర్గ తెలంగాణ ఎంఆర్‌పిఎస్ నాయకులు వాపోయారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన తీర్మానాలలో భాగంగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టలేక వర్గీకరణ జరగక మాదిగలకు, ఉప కులాలకు ఫలాలు అందడం లేదని ఆ సమావేశం వాపోయింది. దేశ రాజదాని నడిబొడ్డులో టీ ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మూడు రోజులు కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని పార్టీల నాయకులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. వచ్చే సీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టడమే ప్రధానంగా పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లి బిజేపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేస్తామని 3వ తెలంగాణ ఎంఆర్‌పిఎస్ జిల్లా సమావేశం పేర్కొంది. ఈ కార్యక్రమంలో టి ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు చింతల రాములు పాల్గొన్నారు.
గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

జహీరాబాద్, సెప్టెంబర్ 17: రెండు రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు శవమై పిల్లర్ గుంతల్లో తేలారు. ఈ సంఘటన జహీరాబాద్ మండలంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే...జహీరాబాద్ మండలంలోని అల్లీపూర్ పంచాయతీ ఫయాజ్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్ కుమారుడు అన్సార్ (5), ఎండి.ఇర్ఫాన్ కుమారుడు ఇషాన్ (6) రెండు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటి వెళ్లి అదృశ్యమయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు, బంధువులు, సంబదీకుల వద్ద గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోడపత్రికలు విడుదల చేశారు. అయనా ఎంతకీ వారి ఆచూకీ లభించకపోవడంతో ఆటోకు లౌడ్‌స్పీకర్ అమర్చి పట్టణంతోపాటు చుట్టుపక్కల వీధుల్లో సైతం అనౌన్స్‌మెంట్ చేసినా ఫలితం లేకపోవడంతో ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ సందర్భంలో అల్లీపూర్ పంచాయతీ పరిధిలోని ఫయాజ్‌నగర్‌కు సమీపంలోని క్రిష్టియన్ కాలనీలో ఇంటి నిర్మాణంకోసం పిల్లర్ గుంతలు తీశారు. వర్షం కారణంగా నిర్మాణం పనులు నిలిచిపోయాయి. పిల్లర్ గుంతల్లో నీరునిండి పారుతుండడంతో చిన్నారులు వాటిని గుర్తించలేక కలిసికట్టుగా అటుగా వెళ్లి అందుల్లో పడి ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. వర్షం కురుస్తుండడంతో ఎవరు కూడా ఈ చిన్నారులు గుంతలో పడిన విషయాన్ని గమనించలేక పోయారు. ఇదిలాఉండగా గుంతల్లో వర్షం నిండిపోవడం, ఇంకా వర్షం పడుతుండడంతో ఇంటి నిర్మాణం పనులుకూడా ప్రారంభం కాలేదు. దీంతో చిన్నారుల మృతదేహాలు నీటిపై తేలియాడేంతవరకు ఆచూకీ లభించలేదు. పిల్లర్ గుంతల్లో పడి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టంకు పంపించారు. అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలావుండగా, ప్రభుత్వాసుపత్రి పోస్టుమార్టం వద్ద చిన్నారుల మృతదేహాలను చూసిన మాజీ మంత్రి ఎండి.్ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.