జాతీయ వార్తలు

ఉప్పొంగిన కర్నాటక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదనంగా 14.75 టీఎంసీ కావేరీ జలాలు కేటాయిస్తూ సుప్రీం తీర్పు

పదిహేనేళ్లపాటు అమలు సీఎం సిద్దరామయ్య హర్షం తమిళనాడు అసంతృప్తి
జలాలపై ఏ రాష్ట్రానికీ యాజమాన్య హక్కు లేదన్న అత్యున్నత న్యాయస్థానం

కావేరీ నీళ్లకొరకు
చావోరేవో తెగింపు జగడమె పెంచెన్
చివరికి ఈ న్యాయము
ఎవరికి నీళ్లిచ్చె కళ్లెవరివి కార్చెన్!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కర్నాటకకు మరిన్ని కావేరీ జలాలు దక్కాయి. గతంలో కేటాయించిన మొత్తానికి అదనంగా మరో 14.75 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీఎఫ్‌టీ) నీటిని వాడుకోవచ్చునని కర్నాటకకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దశాబ్దాలుగా సాగిన కావేరీ జల వివాదంపై తుదితీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. తమిళనాడుకు 177.25 టీఎంసీఎఫ్‌టీల నీటిని ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం కర్నాటకను ఆదేశించింది. బిలిగుండ్లు అంతర్రాష్ట్ర జలాశయం నుంచి ఈ నీటిని విడుదల చేయాలని సూచించింది. 2007లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం పొందవలసిన 192 టీఎంసీల నీటిలో 14.75 టీఎంసీల మేరకు తమిళనాడు ఇప్పుడు కోల్పోవలసి వస్తుంది. అయితే కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో అదనంగా 10 టీఎంసీఎఫ్‌టీలను తమిళనాడు వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కర్నాటక 270 టీఎంసీఎఫ్‌టీల నీటిని పొందుతుండగా ఇప్పుడు అదనంగా 14.75 టీఎంసీఎఫ్‌టీలతో కలపి 284.75 టీఎంసీఎఫ్‌టీలను పొందుతుంది. ఈ వివాదంలో భాగస్వాములైన కేరళ, పుదుచ్చేరీలకు గతంలో ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులనే సుప్రీం ఖరారు చేసింది. తాజా కేటాయింపులు పదిహేనేళ్లపాటు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కాగా కావేరీ జలాలపై ఏ రాష్ట్రానికీ యాజమాన్య హక్కు (ఓనర్‌షిప్) లేదని స్పష్టం చేసింది. నిజానికి కావేరీ జలాల లభ్యత 740 టీఎంసీలుగా ట్రిబ్యునల్ పేర్కొంది. అందులో తమిళనాడుకు 419 టీఎంసీలు కేటాయించగా 277 టీఎంసీలు విడుదల చేశారు. మిగతా 192 టీఎంసీల నీటి విడుదలపై వివాదం చోటుచేసుకుంది. ఇప్పుడు దానిని తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం కావేరీ జల వివాదంపై తీర్పును గత సెప్టెంబర్ 20న రిజర్వ్ చేసింది. కాగా ఆ తీర్పును శుక్రవారం ప్రకటించింది.
కావేరీ జలాల పంపిణీపై 2007లో ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును సవాలు చేస్తూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. కాగా తుదితీర్పులోని ముఖ్యాంశాలను చదివి వినిపించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
బెంగళూరు దాహార్తి తీర్చడానికే..
కాగా కావేరీ జలాల్లో కర్నాటక వాటా పెంచడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. బెంగళూరులో నీటిఎద్దడిని పరిగణలోకి తీసుకుని అదనపు జలాలు కేటాయించినట్లు పేర్కొంది. నగరంలో పది టీఎంసీల భూగర్భ జలాలు, 4.75 టీఎంసీల మంచినీటి అవసరం ఉందన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
కాగా కావేరీ జలవివాదం విచారణ సుదీర్ఘకాలం కొనసాగగా విచారణ సందర్భంగా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వానికి సూచించింది. అయితే తన ఆదేశాలను అమలుచేయడం లేదంటూ 2016 సెప్టెంబర్ 30న ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తమిళనాడుకు నీటి విడుదలపై సుప్రీంకోర్టు జారీ చేసిన మూడు ఆదేశాలు, కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై ఇచ్చిన ఆదేశాలను మరోసారి పరిశీలించాలంటూ కర్నాటక ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తమిళనాడుకు నీటి విడుదలపై 2016 సెప్టెంబర్ 20, 27, 30 తేదీల్లో జారీ చేసిన ఆదేశాలపై కర్నాటక పునఃసమీక్ష కోరింది. కాగా ట్రిబ్యునల్ కేటాయింపులకన్నా ఎక్కువ నీటిని కేరళ వినియోగిస్తోందని గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ అప్పీళ్లను స్వీకరించిన సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ పరిధి, పరిమితులు, అధికారం, విస్తృతి, న్యాయపరిథిని నిర్ణయించే అధికారం తనకు ఉందని అదే ఏడాది డిసెంబర్ 9న స్పష్టం చేసింది. కాగా ట్రిబ్యునల్ అవార్డుపై అప్పీళ్లను విచారించే అధికారం లేదన్న కేంద్రప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
త్వరలో శాసనసభ ఎన్నికల జరగనున్న కర్నాటకలో కావేరీ వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ముఖ్యమంత్రి సిద్దరామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్దిచేకూరుస్తుందని విశే్లషకులు భావిస్తున్నారు. కాగా సుప్రీంతీర్పుపై తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పక్షాలు నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేశాయి.