జాతీయ వార్తలు

మోదీ-షా ద్వయాన్ని అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశ ఐక్యత ప్రమాదంలో పడిందని, బీజేపీ ప్రభుత్వం విభజించి పాలించు విధానం అమలుచేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కేంద్రంలో తిరిగి మోదీ-షా ద్వయం అధికారంలోకి రాకుండా తమ ప్రయత్నాలు చేస్తామన్న కేజ్రీవాల్ దాని కోసం ఏర్పడే కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తామని గురువారం ఇక్కడ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆమ్‌ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడే లౌకిక కూటమికి ఆప్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా సాధించే దిశగానే ఆప్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఢిల్లీకి రాష్ట్ర హోదా సాధించేందుకు మేం పోరాటం కొనసాగిస్తాం. ఈ విషయంలో వెనకడుగువేయబోం’అని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రనే మార్చేస్తాయని ఆయన అన్నారు. ‘ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, జాతి పరిరక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలు’అని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. భారత చరిత్ర పది లేదా ఇరవై ఏళ్లది కాదని, నాలుగువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని అలాగే సుంపన్నమైన ఘన చరిత్ర భారత్ సొంతమని ఆప్ అధినేత పేర్కొన్నారు. ‘ భిన్నత్వంలో ఏకత్వం మనది. అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలతో వైవిధ్యంతో కూడిన దేశం’అని ఆయన స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం, సిక్కు ఎవరైనా ముందు భారతీయులేనని ఆయన అన్నారు. వేల సంవత్సరాలుగా దేశంపై అనేక దాడులు జరిగినా భారత్ తట్టుకుని నిలబడ్డానికి కారణం అందరూ ఐక్యతంగా ఉండడమేనని ఆయన తెలిపారు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు కలిసి మెలసి ఉండడం వల్లే దేశానికి ఏమీ కాలేదని ఆయన పునరుద్ఘాటించారు. దేశ ఐక్యతకు ఇప్పుడు పెను ముప్పు ఏర్పడిందని కేజ్రీవాల్ హెచ్చరించారు. ‘దేశ సంస్కృతిపై దాడి జరుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఐక్యమత్యంగా ఉండకపోతే దేశం ముక్కచెక్కలవుతుంది. మతాలు, కులాలు, ప్రాంతాల పేరుతో విడిపోతాం’అని ఢిల్లీ సీఎం హెచ్చరించారు. బీజేపీ మేనిఫెస్టోపై ఆయన విరుచుకుపడ్డారు. బౌద్ధులు, సిక్కులు, హిందువులు తప్ప ఏ ఒక్క చొరబాటునూ అనుమతించబోమని బీజేపీ చీఫ్ అమిత్‌షా ప్రమాదకరమైన ట్వీట్ చేశారని కేజ్రీవాల్ అన్నారు. అంటే ఆ మూడు వర్గాలే తప్ప దేశంలో మరెవరికీ స్థానం ఉండదన్న రీతిలో షా వ్యవహారం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘ఇది జరిగేదేనా? ఈ మూడు మతాలు కలిస్తే 20 లేదా 25 కోట్ల మంది ఉంటారు. మిగతా వారి సంగతేమిటి?. అసలు మీ ఉద్దేశం ఏమిటని అమిత్‌షాను నేను అడుగుతున్నాను’అని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు. బౌద్ధులు, సిక్కులు, హిందువుల తప్పించి మిగతా వారిందరినీ దేశం నుంచి పంపేస్తారా?అని ఆయన నిలదీశారు. ‘పసిఫిక్ మహా సముద్రంలో పడేస్తారా? లేక మూకుమ్మడిగా చంపేస్తారా?’అని బీజేపీ అధినేతను ప్రశ్నించారు. బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోందని, దాని కోసం పాకిస్తాన్ అజెండాను భుజాన వేసుకుందని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ భారత్‌ను ఐకమత్యంగా ఉంచేందుకు మేం అజెండాను రూపొందిస్తున్నారు. ఈ దేశాన్ని బలహీనపడనీయం. అందర్నీ ఒకే తాటిపై ఉండేలా కృషి చేస్తాం’అని ఆప్ కన్వీనర్ స్పష్టం చేశారు. మోదీ-షా ద్వయం మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలన్నదే ఆప్ ప్రధాన అజెండా అని కేజ్రీవాల్ ప్రకటించారు. మోదీ-షా ద్వయానికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందా?, పలు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అన్నది ముఖ్యం కాదని మోదీ-షా ద్వయంను అడ్డుకోవడమే ఆప్ లక్ష్యమని ఆయన అన్నారు.
చిత్రం... గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న
ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతర నేతలు