జాతీయ వార్తలు

300 దాటేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు మూడు వందల కంటే ఎక్కువ సీట్లు వస్తాయి.. ఎవరెన్ని ఫ్రంట్లు ఏర్పాటు చేసుకున్నా కేంద్రంలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మంగళవారం కోల్‌కతాలో నిర్వహించిన రోడ్ షోపై టీఎంసీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్, టీఎంసీ కలిసి పని చేస్తున్నాయని.. ప్రతిపక్షాలు ఎన్ని ఫ్రంట్లు ఏర్పాటు చేసుకున్నా తమకు భయం లేదు.. వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుందని అమిత్ షా వ్యంగ్య బాణాలు విసిరారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కొంతమంది నేతలు చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా.. ఎవరెన్ని ఫ్రంట్లు ఏర్పాటు చేసుకున్నా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షం నాయకుడిని ఎన్నుకునేందుకు ఫెడరల్ ఫ్రంట్ లేదా మరో ఫ్రంట్ ఏర్పడి సమావేశాలు నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒకటై నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన రోడ్ షో సందర్భంగా టీఎంసీ చేసిన దాడినుంచి తాను బతికి బట్టకట్టటానికి సీఆర్‌పీఎఫ్ కారణమని అమిత్ షా చెప్పారు. వారు లేకుంటే తాను చనిపోయేవాడినని అన్నారు. అదృష్టం కొద్దీ బైటపడ్డాను.. సీఆర్‌పీఎఫ్ సకాలంలో వచ్చి కాపాడిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిజాయితీ ఉంటే మంగళవారం నాటి సంఘటనలపై తటస్థ సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేవలం పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేయటం లేదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది.. కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి.. ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నది కాబట్టేనని అమిత్ షా ఆరోపించారు. కోల్‌కత్తాలో జరిగిన హింసాత్మక సంఘటన్లో బీజేపీకి చెందిన మోటర్ సైకిల్, జీప్ కాలిపోయాయి.. మా వాహనాలను మేమే తగులబెట్టుకుంటామా? అని అమిత్ షా ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్టప్రతి పాలన పెట్టాలని తాము డిమాండ్ చేయటం లేదు.. ఎందుకంటే ఈ నెల 23 తరువాత ప్రజలే టీఎంసీ ప్రభుత్వాన్ని దించివేస్తారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మమతా బెనర్జీ తనను తాను దేవతలా భావించుకోవద్దని అమిత్ షా హితవు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ దాదాపు 23 సీట్లు గెలుచుకుంటుందని అమిత్ షా ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి తమను విమర్శించటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నదని ఆయన అన్నారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని టీఎంసీ కార్యకర్తలే ధ్వంసం చేశారని అమిత్ షా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ అథోగతి పాలయిందని ఆయన విమర్శించారు.
చిత్రం...బుధవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అమిత్ షా