జాతీయ వార్తలు

ఇస్రో మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 22: వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళుతూ విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోదసీ పరిశోధనలో మరోసారి మన శాస్తవ్రేత్తలు సత్తా చాటారు. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్షంలో వరుస విజయాలు సాధిస్తున్న ఇస్రో మరో రికార్డు సాధించింది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మరోసారి విజయబావుట ఎగరవేయడంతో మనదేశం శాస్తస్రాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసింది. 615కిలోల బరువుగల రీశాట్-2బి ఉపగ్రహాన్ని నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 46 ప్రయోగం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం ఉదయం 4.30గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 25గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత బుధవారం ఉదయం 5:30గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎరుపు, నారింజ రంగులతో నిప్పులు చిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగిరిన అనంతరం శాస్తవ్రేత్తల్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి పీఎస్‌ఎల్‌వీ మరో విజయాన్ని నమోదు చేస్తూ రీశాట్-బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్తవ్రేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
రూపొందించిన మన దేశానికి చెందిన రీశాట్-2బి ఉపగ్రహం 15.30నిమిషాలకు భూమికి 557కిలో మీటరు ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ తన నాలుగు దశలను సునాయసనంగా పూర్తిచేసుకుని చివరిలో ఉపగ్రహాన్ని నిర్ధేశించిన సమయానికి విజయవంతంగా చేర్చింది. ఈ ఉపగ్రహం దేశరక్షణ రంగానికి కీలకంగా మారనుంది. సరిహద్దులో శత్రువుల కదలికలను సులువుగా గుర్తించేందుకు వీలుంటుంది. అంతేగాక వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సహాయపడుతోంది. ఐదేళ్లపాటు దీని సేవలు దేశానికి అందనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన మూడు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇది నాలుగో ఉపగ్రహం కావడం విశేషం. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ రాకెట్ నాలుగు దశలు పూర్తిచేసుకొని ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చినంతరం పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. అక్కడ నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ రీశాట్-2బి ఉపగ్రహ ప్రయోగం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఈ ఏడాది ఇస్రోకు ఇది హ్యాట్రిక్ విజయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ ద్వారా వివిధ సేవలకు చెందిన 353 ఉపగ్రహాలు ప్రయోగించామని, ఇందులో 47 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవన్నారు. ఈ ఏడాది మరో కీలక ప్రయోగాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
రాకెట్ పయనం సాగింది ఇలా
ప్రయోగ సమయంలో 290టన్నుల బరువు44.4మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ భూమి నుంచి నింగికి ఎగిరి అనంతరం తన నాలుగు దశలను సునాయసనంగా పూర్తిచేసుకుని ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. మొదటదశ 139టన్నుల ఘన ఇంధన సాయంతో సెకనకు 1595కి.మీ వేగంతో 1.50నిమిషాలకు 51కి.మీ ఎత్తుకు చేరింది. అక్కడ నుంచి రెండవదశ 41టన్నుల ద్రవ ఇంధనంతో 1.51నిమిషాలకు ప్రారంభమై సెకనుకు 4324కిలోమీటర్ల వేగంతో 188కిలోమీటర్ల ఎత్తుకు చేరి 4.22నిమిషాలకు పూర్తిచేసిన అనంతరం మూడవదశ 4.23నిమిషాలకు 7.65టన్నుల ఘన ఇంధనంతో ప్రారంభమై సెకనుకు 6943కిలోమీటర్ల వేగంతో 438కిలోమీటర్ల ఎత్తుకు 9.23నిమిషాలకు పూర్తయింది. 1.6టన్నుల ద్రవ ఇంధనం ఉన్న నాలుగవ దశ 9.24నిమిషాలకు ప్రారంభమై సెనకను 7577కి.మీ వేగంతో 558కిలోమీటర్ల ఎత్తులో 14.42నిమిషాలకు నాలుగవ దశను పూర్తిచేసింది. నాలుగవ దశ పూర్తిచేసిన అనంతరం 15.30నిమిషాలకు 615కిలోల బరువు కలిగిన రీశాట్-2బి ఉపగ్రహాన్ని భూమికి 557కి.మీ ఎత్తులోని సూర్వనువర్తన ధృవ కక్ష్యలో 37డిగ్రీల అంక్షాంశంలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందించనుంది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వ ప్రయోగం కాగా ఈ ఏడాది షార్ నుంచి మూడవ ప్రయోగం కావడం విశేషం.
చిత్రం...నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ46 రాకెట్