జాతీయ వార్తలు

ముహూర్తం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు 351 సీట్లు సంపాదించిపెట్టిన నరేంద్రమోదీ ఈనెల 29 లేదా 30వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. మొదట 29వ తేదీ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న మోదీ మరుసటి రోజు జరిపే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాల్ లేదా ముందు మైదానంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. తొలుత నరేంద్ర మోదీ ఒక్కరే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత రెండు, మూడు రోజులకు ఇతర మంత్రుల నియామకం చేపడతారని అంటున్నారు. సీనియర్ నాయకులకు సముచిత ప్రాధాన్యత ఇస్తూనే యువతకు ఈసారి పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు. కొందరు సీనియర్ మంత్రులను ఇంటికి పంపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 18 సీట్లిచ్చిన పశ్చిమ బెంగాల్‌కు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో మంచి ప్రాధాన్యత లభిస్తుందని అంటున్నారు. లోక్‌సభకు ఎనిమిదోసారి ఎన్నికైన సంతోష్ గంగ్వార్, మేనకా గాంధీ, వీరిద్దరిలో ఒకరికి లోక్‌సభ స్పీకర్ పదవి లభించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఎంపీల సభ్యత్వ ప్రమాణ కార్యక్రమం కోసం 17వ లోక్‌సభ జూన్ 5 నుంచి 11 తేదీ వరకు జరగవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
విదేశీ నేతలు రాక!
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానాలు పంపించారని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించటం లేదు. నరేంద్ర మోదీ 2014లో రాష్టప్రతి భవన్‌లోని ముందు మైదానంలో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి సార్క్ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు రెండోసారి అత్యధిక మెజారిటీ లభించగానే ప్రపంచంలోని అన్ని చిన్నాపెద్ద దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు పెద్ద ఎత్తున అభినందన సందేశాలు పంపారు. నరేంద్ర మోదీ దీనిని దృష్టిలో పెట్టుకునే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యులను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిసింది. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆహ్వానిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ‘మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతే విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించే కార్యక్రమం ప్రారంభం అవుతుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చెబుతున్నారు.
కేబినెట్‌లోకి అమిత్ షా?
ఇదిలా ఉంటే గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దాదాపు ఆరు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంత్రివర్గంలో చేరే అంశంపై పార్టీలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందని తెలిసింది. షాను మంత్రివర్గంలో చేర్చుకుని హోం శాఖను కేటాయించాలని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షా కేబినెట్‌లో చేరితే బీజేపీ అభివృద్ధి, విస్తరణ కష్టమవుతుందని కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమిత్ షా అంతటి సమర్ధులైన నాయకులెవ్వరూ లేనందున కొంత కాలం ఆయననే అధ్యక్షుడిగా కొనసాగించటమే మంచిదని మరి కొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. అమిత్ షాను మంత్రివర్గంలో చేర్చుకుని నాలుగు ముఖ్యమైన శాఖల్లో ఒక శాఖ అప్పగించే అంశంపై తుది నిర్ణయం నరేంద్ర మోదీ తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, వీరేంద్ర సింగ్, రాంవిలాస్ పాశ్వాన్, జైప్రకాశ్ ప్రకాశ్ నడ్డా, హర్‌సిమ్రత్‌జీత్ కౌర్, అనంతగీతే, సంజయ్ రావత్, అనుప్రియ పటేల్, ప్రకాశ్ జావడేకర్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, సుప్రియ బాబుల్, ఎస్‌ఎస్ అహ్లువాలియా, జువర్ ఓరాం, కిరణ్ రజీజూ, రాందాస్ అథాలే, వరుణ్‌గాంధీ, హర్షవర్దన్, విజయ్‌గోయల్, మీనాక్షి లేఖి, రాజవర్దన్ సింగ్ రాథోడ్‌కు మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ నుంచి సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నారు. లోక్‌సభకు ఎనిమిది సార్లు గెలిచిన సంతోష్ గాంగ్వార్, మేనకా గాంధీ, వీరిద్దలో ఒకరు లోక్‌సభ స్పీకర్ పదవి చేపట్టవచ్చు. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ ఈసారి కేంద్ర మంత్రివర్గంలో యువతకు పెద్ద పీట వేయవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మోదీకి అద్వానీ, జోషీ ఆశీస్సులు
నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉపప్రధాన మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి నివాసాలకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మోదీ ఇద్దరు సీనియర్ నాయకులకు పాదాభివందనం చేశారు. మోదీ ఈనెల 28న వారణాసి వెళ్లి ఓటర్లకు కృతజతలు తెలియజేయనున్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు రోడ్ షో నిర్వహిస్తారని అంటున్నారు. వారణాసి ప్రజలను కలుసుకున్న అనంతరం ఆయన మర్నాడు అంటే ఈనెల 29 తేదీ అహ్మదాబాద్ వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు.