జాతీయ వార్తలు

షీలా దీక్షిత్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ షీలాదీక్షిత్ శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు కన్నుమూశారు. షీలాదీక్షిత్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభృతులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పేరెన్నికగన్న 81 సంవత్సరాల కాంగ్రెస్ వృద్ధ నాయకురాలైన షీలాదీక్షిత్ లోగడ మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. పదిహేను సంవత్సరాల పాటు ఢిల్లీ సీఎం పదవిని అధిష్టించడమే కాకుండా, ఆ తర్వాత కేరళ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ ఆమె ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. ఇలాఉండగా శనివారం ఉదయం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఫొర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తీసుకుని వెళ్ళారు. ఫొర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ అశోక్ సేథ్ సారధ్యంలోని వైద్యుల బృందం ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. దీంతో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, రెండోసారి 3.55 గంటలకు గుండె నొప్పి రావడంతో ఆమె తుది శ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. షీలాదీక్షిత్ భౌతికకాయాన్ని నిజాముద్దీన్ ఈస్ట్ నివాసంలో ఉంచనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆమె సేవలు ఎనె్నన్నో..
1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలో జన్మించిన షీలాదీక్షిత్ చిన్నతనం నుంచే దేశ భక్తి కలిగి, ఏ పని అప్పగించినా అకుంఠిత దీక్షతో పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె 1998-2013 సంవత్సరం వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. అనంతరం కేరళ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. గతంలో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికయ్యారు. 1984 సంవత్సరంలో ఆమె లోక్‌సభకు తొలి సారి ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. దివంగత రాజీవ్ గాంధీకి ఆమె సన్నిహితురాలిగా ఉండేవారు. అంతేకాకుండా రాజీవ్ మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించారు.
ప్రముఖుల సంతాపాలు..
షీలాదీక్షిత్ ఆకస్మిక మరణం పట్లరాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. షీలాదీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీని ఎన్నో విధాలుగా అభివృద్ధి పరిచారని ఆయన కొనియాడారు. షీలాదీక్షిత్ ఆకస్మిక మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దీక్షిత్ మంచి పరిపాలనాదక్షురాలని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె మృతికి సంతాపం తెలుపుతూ దేశంలో చెప్పుకోదగ్గ నేతల్లో ఆమె ఒకరని, మంచి పరిపాలకురాలని, ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
తట్టుకోలేకపోయా: రాహుల్
షీలాదీక్షిత్ మరణ వార్తను విని తట్టుకోలేకపోయానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. షీలాదీక్షిత్ కాంగ్రెస్ పుత్రిక అని రాహుల్ పేర్కొన్నారు. ఆమె మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు నష్టమని ఆయన బాధపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమె మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె మరణం ఢిల్లీకి పెద్ద నష్టమని పేర్కొన్నారు. ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మహన్ సింగ్ ఆమె ఆకస్మిక మరణం పట్ల బాధను వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిత్తశుద్ధి, అంకితమైన భావంతో పని చేసే ఓ గొప్ప నాయకురాలిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని మన్మోహన్‌సింగ్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్రం... షీలా దీక్షిత్ భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ