జాతీయ వార్తలు

రేణిగుంటలో విమానాల రాకపోకలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 18: స్పైస్ జెట్ విమానం ప్రమాదానికి గురైన సంఘటనతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు ఆదివారం కూడా రద్దయ్యాయి. శనివారం రాత్రి స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ అయి యు టర్న్ తీసుకునే సమయంలో రన్ వే నుంచి సుమారు 120 మీటర్లు మట్టిలోకి వెళ్లడంతో విమానం టైర్లు బురదలో కూరుకుపోయాయి. దీంతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ అధికారులు రేణిగుంట విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. బురదలో కూరుకుపోయిన విమానచక్రాలను బయటకు తీసేందుకు చెన్నై నుండి ప్రత్యేక పరికరాలను రప్పించి విమానాన్ని రన్‌వే పైకి తెచ్చేందుకు పనులు మొదలుపెట్టారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రూ జెట్ విమానానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు విమానాశ్రయం లోపల ప్రయాణికులు పడిగాపులు కాసి ఉదయం తిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను ఏవియేషన్ అధికారులు రద్దు చేశారు. రాత్రి వెళ్లాల్సిన ట్రూ జెట్ విమానానికి ఆదివారం సాయంత్రం విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో హైదరాబాద్‌కు విమానం బయలుదేరి వెళ్లింది. ఇదిలావుండగా బురదలో కూరుకుపోయిన స్పైస్ జెట్ విమానాన్ని రన్‌వే పైకి తెచ్చేవరకు విమానాల రాకపోకలకు అనుమతులు ఇవ్వబోమని ఏవియేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో యుద్ధప్రాతిపదికన విమానాన్ని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

చిత్రం.. రేణిగుంట విమానాశ్రయంలో బురదలో కూరుకుపోయిన స్పైస్‌జెట్ విమానాన్ని
బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నిపుణులు