జాతీయ వార్తలు

జయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: వరుస అంతరిక్ష ప్రయోగాలతో విజయపథంలో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించి వినూత్న రికార్డు సృష్టించింది. ఒక రాకెట్ ద్వారా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయోగాత్మక ప్రయోగంలో విజయం సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒకే రాకెట్ ద్వారా 8 ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి పంపి శాస్తవ్రేత్తలు తమ సత్తాచాటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 35 మరోసారి విజయబావుటా ఎగరవేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయోగించిన స్కాట్‌శాట్-1 ఉపగ్రహంతో పాటు మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉపగ్రహాలు, అమెరికా, కెనడా, అల్జీరియా దేశాలకు చెందిన మొత్తం 8 ఉపగ్రహాలను పిస్‌ఎల్‌వి వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. ఈ ప్రయోగం పయనం 2:15 గంటలపాటు జరిగింది. దీంతో భారత్ ఎక్కువ ఉపగ్రహాలు ఒకే రాకెట్ ద్వారా వేరువేరు కక్ష్యల్లోకి ప్రయోగించి ప్రపంచ దేశాల్లో దేశాల్లో మొదటి స్థానం సంపాదించడమే కాకుండా ఇస్రో శాస్తవ్రేత్తలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని శనివారం ఉదయం 8:42 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 48:30 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత సోమవారం ఉదయం 9:12 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వరుసగా 36వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 35 8 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
పిఎస్‌ఎల్‌వి-సి 35 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని మొదట 17:40 నిమిషాలకు భూమికి 730 కి.మీ ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఇంజిన్‌ను ఆఫ్‌చేసి రాకెట్‌ను మరలా కొంత కిందకు తీసుకొచ్చారు. ఇందుకు 1:22 గంటలు సమయం పట్టింది. మరలా ఇంజిన్‌ను ఆన్‌చేసి 21 నిమిషాలు మండించారు. మరలా రెండోసారి ఇంజిన్‌ను ఆఫ్‌చేసి 22 సెకన్లు మండించి 11:23 గంటలకు రెండోసారి రీస్ట్రాట్‌చేసి తరువాత డుయుల్ లాంచ్ ఆడాప్టర్ ఇంజిన్‌ను నుంచి విడిపోయేలా చేశారు. అనంతరం 11:25 గంటల నుండి మరో ఏడు ఉపగ్రహాలు ఒకదాని తరువాత ఒకటి సెకన్ల వ్యవధిలోనే 689 కి.మీ ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు అమెరికా వంటి ఆగ్రదేశాలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టలేదు.
మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినంతరం పిఎస్‌ఎల్‌వి-సి 35 విజయాన్ని అధికారికంగా ప్రకటించి హర్షం వ్యక్తం చేసి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకున్నారు.
ఎంసిసి నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ ఒకే రాకెట్ ద్వారా 8 ఉపగ్రహాలు పంపి విజయం సాధించిన కొత్త రికార్డు ఇస్రోకు దక్కిందన్నారు. ఈ విజయం శాస్తవ్రేత్తల సమష్టికృషి అన్నారు. భవిష్యత్‌లో ఒకే రాకెట్ ద్వారా మరిన్ని ఉపగ్రహాలు వేరువేరు కక్ష్యల్లోకి పంపేందుకు ఇది తొలిమెట్టులాంటిదన్నారు. స్కాట్‌శాట్-1 ఉపగ్రహంతో సముద్రాల్లో సంభవించే ఫెనుతుపాన్‌లు, భీకర గాలులు, సునామి హెచ్చరికలను ముందుగాను తెలుసుకోవచ్చన్నారు. ఇది ఐదేళ్లపాటు సేవలు అందించనున్నట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువు 44.4 మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ తన నాలుగు దశలను సునాయసంగా పూర్తిచేసుకొని భూమికి 730కిలో మీటర్ల దూరంలో మన దేశ స్కాట్‌శాట్ ఉపగ్రహాన్ని 17:40 నిమిషాలకు కక్ష్యలో చేర్చింది.
రాకెట్ దశల వారీగా విడిపోయింది ఇలా..
రాకెట్ భూ భాగం నుంచి నింగిలోకి ఎగిరిన అనంతరం అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. కౌంట్‌డౌన్ పూర్తయిన అనంతరం రాకెట్ భూమి నుండి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు కదిలింది. తన మొదటి దశ 1:52నిమిషాలకు 65కి.మీ ఎత్తుకు చేర్చి తొలి దశ మోటారు రాకెట్ నుంచి విడిపోయింది. రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 4:24నిమిషాలకు 222కి.మీ ఎత్తుకు చేరినంతరం రెండో దశ మోటారు విడిపోయింది. అక్కడ నుంచి మూడో దశ 9:47నిమిషాలకు 580కి.మీ ఎత్తుకు చేరినంతరం నాలుగో దశ ప్రారంభమై 17:40నిమిషాలకు730 మీటర్ల ఎత్తుకు రాకెట్ స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని రోదసీలో విడిచిపెట్టింది. అక్కడ నాలుగో దశలో ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఇంధనంతో మండించి రీస్టాట్ చేశారు. అనంతరం రాకెట్‌ను మరలా 49కి.మీ కిందకు తీసుకొచ్చి రెండోసారి ఇంజిన్‌ను ఆఫ్‌చేసి మరలా మండించారు. ఇందుకు 1:22గంటల సమయం తీసుకొన్నారు. అనంతరం రాకెట్‌లోని నాలుగో దశలో ఉన్న డ్యూయుల్ లాంచ్ ఆడాప్టర్ విడిపోయింది. 11:25.13నిమిషాలకు ఆల్‌శాట్-1ఎన్ ఉపగ్రహం విడిపోయింది. 11:25.22నిమిషాలకు ఎన్‌ఎల్‌ఎస్-19 విడిపోయింది. 11:26కు ప్రథమశాట్, 11:26.52నిమిషాలకు పైశాట్, 11:27నిమిషాలకు ఆల్‌శాట్-1బి, 11:27.18నిమిషాలకు ఆల్‌శాట్-2బి, 11:27.33నిమిషాలకు పాత్‌ఫైన్డర్ ఉపగ్రహం రాకెట్ విడిపోయి కక్ష్యలోకి చేరాయి. ఉదయం 9:12గంటలకు ప్రారంభమైన ప్రయోగం 11:27గంటల వరకు కొనసాగింది. మొత్తం 2:15గంటల పాటు ఇస్రో వినూత్నంగా పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్‌ను ప్రయోగించి విజయం సాధించింది.

చిత్రం.. ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ
కక్ష్యవైపు దూసుకుపోతున్న పిఎస్‌ఎల్‌వి-సి 35