జాతీయ వార్తలు

సరిలేని అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: రాజకీయ వ్యూహరచనలోనే కాదు, అత్యంత సంక్లిష్టమైన భద్రతాపరమైన సవాళ్లను వ్యూహాత్మక రీతిలో ముఖాముఖి ఢీకొనడంలోనూ అమిత్ షా మరోసారి తనదైన పట్టును కనబరిచారు. అత్యంత జఠిలమైన హిందూ-ముస్లిం మనోభావాలతో కూడిన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన నేపథ్యంలో దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదంటే అందుకు అత్యంత వ్యూహాత్మక రీతిలో షా కదిపిన పావులే దోహదం చేశాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి ఎలాంటి తొట్రుపాటు లేని రీతిలో రక్షణ ఏర్పాట్లు జరిగాయని, సుప్రీం తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చినా ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటన జరగలేదని అధికారులు తెలిపారు. తీర్పు వెలువడడానికి కొన్ని గంటల ముందు నుంచి దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టిన షా, తీర్పు వచ్చిన అనంతరం పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ అప్రమత్తం ప్రకటించారు. శనివారం ఎన్నో కీలక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వాటన్నింటినీ రద్దు చేసుకుని అమిత్ షా దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ ఏర్పాట్లపైనే దృష్టి సారించారని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వున్నా కూడా అది ఎట్టిపరిస్థితుల్లోనూ మత సంఘర్షణలకు దారితీయొద్దన్న పట్టుదలతోనే కొన్ని రోజుల ముందు నుంచి అమిత్ షా చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా అయోధ్య వివాదంతో ముడివడివున్న రాష్ట్రాలపైనే ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నిఘా, నియంత్రణ, అప్రమత్తం విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావు ఉండకూడదని ప్రభుత్వాలకు, అధికారులకు అమిత్ షా స్పష్టం చేసినట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అలాగే, అల్లర్లు జరిగేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా, అందుకు సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు తక్షణ ప్రాతిపదికన కేంద్రం తోడ్పాటును అందిస్తుందని కూడా అన్ని రాష్ట్రాలకు ఆయన స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఇలా ప్రతి విషయంపైనా దృష్టి పెట్టి, పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు అనుకున్న ఫలితానే్న ఇచ్చాయని, దేశంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని అధికారులు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, అలాగే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం ఎప్పటికప్పుడు అమిత్ షా మాట్లాడుతూ వచ్చారని అధికారులు తెలిపారు. అలాగే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌తో సహా ఎందరో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన భద్రతాపరమైన సమీక్షలు జరిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని వారిని ఆయన ఆదేశించారు. అలాగే, మరింత అప్రమత్తం పాటించాలని, అలాగే అన్ని సునిశిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని రాష్ట్రాలను ముందుగానే ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం సాగడం వల్లే అయోధ్య ఘట్టం ఎలాంటి అలజడికి ఆస్కారం లేకుండా శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ముగిసిందని అధికారులు వ్యక్తం చేశారు.