జాతీయ వార్తలు

క్షణానికో మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతూ రసకందాయంలో పడుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన శివసేనతో ఎన్సీపీ, కాంగ్రెస్ జత కడతాయన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ దిశగా పలువురు నాయకులు ప్రకటనలు కూడా గుప్పించారు. అయితే, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కలవడం సర్వత్రా ఆసక్తిని పెంచింది. రైతాంగ సమస్యలను వివరించడానికే తాను ప్రధానిని కలసినట్టు పవార్ చెబుతున్నప్పటికీ, మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో కలిసే అంశం చర్చకు వచ్చి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో ఎన్సీపీ కలిస్తే మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుంది. అయితే, బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేయగా, కాంగ్రెస్, ఎన్సీపీ కలసి మిత్రపక్షాలుగా బరిలో నిలిచాయి. బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఖాయంగా కనిపించింది. కానీ సమాన వాటా అంటూ ముఖ్యమంత్రి పదవిని కూడా తమకు రెండున్నర సంవత్సరాల కాలానికి పంచాలని శివసేన డిమాండ్ చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవి పదవి తప్ప, మిగతా అన్ని డిమాండ్లపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ స్పష్టం చేసినప్పటికీ శివసేన తన మొండిపట్టును వీడలేదు. తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో శివసేనకు మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, 17 మంది శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడానికి ససేమిరా అనడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ తాజా పరిణామం చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీతో పవార్ భేటీ కావడం సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతాంగ సమస్యల పేరుతో రాజకీయ చర్చలు జరిపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవార్‌తో కాంగ్రెస్ చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీని ఎన్సీపీ అధినేత పవార్ కలుసుకున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన శరద్ పవార్‌ను కలసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహమ్మద్ పటేల్, మరికొందరు నేతలు పవార్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితం తెలియకపోయినా పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉందని కాంగ్రెస్, ఎన్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ ఎలాంటి షరతులు విధిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తుకు 17 మంది శివసేన ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎటువైపు మొగ్గుచూపుతుందని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ దూరమవుతుంది. మరోవైపు శివసేనలోని మరో వర్గం కూడా వ్యతిరేకిస్తుంది. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి రేపుతోంది.
త్వరలోనే సర్కారు!
మహారాష్టల్రో ఎన్సీపీతో కలసి త్వరలోనే సర్కారును ఏర్పాటు చేస్తామని శివసేన నాయకుడు సంజయ్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఎన్సీపీ డిమాండ్ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. సుదీర్ఘ చర్చల తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. షరతులు, ఇతరత్రా అంశాలపై ఏమీ చెప్పలేకపోయినా, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని శరద్ పవార్ కలవడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా ఎప్పుడైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

*చిత్రం...ఢిల్లీలో బుధవారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, ఇతర నేతలు