జాతీయ వార్తలు

అన్యాయాలపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. సోనియా గాంధీ శనివారం రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారత్ బచావో ర్యాలీ (్భరత్‌ను రక్షించండి)లో ప్రసంగించారు. కాంగ్రెస్ తన ఆఖరు శ్వాస వరకు దేశం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతుందని ప్రకటించారు. దేశంలోని అంధేరీ నగరీ, చౌపట్ రాజా (చీకటి రాజ్యం, గందరగోళ రాజు) పరిస్థితి నెలకొన్నదంటూ ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ ఎక్కడ ఉందని దేశ ప్రజలు అడుగుతున్నారని ఆమె చెప్పారు. భారత దేశం ఆత్మకు క్షోభ కలిగిస్తున్న మూడు ఇస్లామిక్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు
భారత పౌరసత్వం కల్పించేందుకు చేసిన చట్టాన్ని మొత్తం దేశం ఎదుర్కొంటుందని సోనియా గాంధీ చెప్పారు. అన్యాయాన్ని భరించటం అతి పెద్ద నేరని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలందరూ నడుం బిగించవలసిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉద్ఘాటించారు. దేశాన్ని రక్షించుకునేందుకు అందరం కష్టపడి పని చేయవలసి ఉంటుందని ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ర్యాలీకి హాజరైన ప్రజలకు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు పార్లమెంటు, రాజ్యాంగం, ప్రభుత్వ సంస్థల మనుగడ గురించి ఎంత మాత్రం పట్టింపు లేదని సోనియా దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షా నిజమైన సమస్యలను దాచిపెట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టటం తప్ప మరో పని చేయటం లేదని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ అధినాయకులు ఒక వైపు ప్రతి రోజు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తారు, మరోవైపు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారని సోనియా గాంధీ దెప్పి పొడిచారు. పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా దేశ ప్రజలను మతం ఆధారంగా విభజించేందుకు సిద్ధమైన మోదీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం దేశం ఆత్మను ముక్కలు చేసిందని ఆమె పదే పదే విరుచుకుపడ్డారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు ఆమె మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం అనునిత్యం చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని కాంగ్రెస్ అధినేత్రి ధ్వజమెత్తారు. స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలొడ్డి తెచ్చిన స్వాతంత్య్రాన్ని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని సోనియా నిప్పులు చెరిగారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. నవరత్నాలను ఎందుకు విక్రయిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారని ఆమె మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకునేందుకు భయపడే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం సృష్టించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు విమర్శించారు. దేశంలో ఎక్కడ చూసినా రైతుల కష్టాలు కనబడుతున్నాయని, వీటిని ఎవరు పరిష్కరిస్తామని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశాన్ని రక్షించుకునేందుకు తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు దీర్ఘకాలిక యుద్ధానికి తాము సిద్ధమేనని సోనియా గాంధీ ప్రకటించారు. దేశం పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా తయారైంది దీనిని ఎదుర్కొనేందుకు అటోఇటో తేల్చుకోవలసిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు. రైతుల దీనావస్థ, కష్టాలు తనకు బాధ కలిగిస్తున్నాయని సోనియా గాంధీ చెప్పారు. ‘పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల ధనం ఎందుకు బయటకు రాలేదు? అది ఎవరి వద్ద ఉంది? దీనిపై దర్యాప్తు జరపవలసిన అవసరం ఉన్నదని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్న కాంగ్రెస్ అధినేత్రి ‘మంచి రోజులంటే ఇవేనా?’అని నిలదీశారు.
*చిత్రం... ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో శనివారం జరిగిన భారత్ బచావో ర్యాలీలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ