జాతీయ వార్తలు

యుపి సిఎం అఖిలేష్ సన్నిహితుడిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 22: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన కలహాలు ఆ పార్టీ పాలిట ముసలంగా మారుతున్నాయి. పార్టీ చీఫ్ ములాయం సోదరుడు శివపాయాదవ్, కుమారుడు అఖిలేష్‌ల మధ్య పెరుగుతున్న అంతరం ముదిరి పాకాన పడింది. అఖిలేష్‌ను సిఎం పదవి నుంచి తప్పుకోవాలని తండ్రి, పార్టీ అధ్యక్షపదవి నుంచి తప్పుకోవాలని తండ్రిని కొడుకు డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవల్లో భాగంగానే శివపాల్‌ను యుపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే, శివపాల్ నుంచి ముఖ్యమైన శాఖలన్నింటినీ అఖిలేష్ తొలగించారు. ఇప్పుడు అఖిలేష్ సన్నిహిత ఎమ్మెల్సీపై ములాయం వేటు వేశారు. ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ సింగ్‌ను ఆరేళ్లపాటు పార్టీనుంచి బహిష్కరిస్తూ శివపాల్ నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించడంతో పాటు వెంటనే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఉదయ్‌వీర్‌సింగ్ ఇటీవల పార్టీ అధినేత ములాయంకు లేఖ రాయడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయ్‌వీర్ క్రిమశిక్షణను ఉల్లంఘించారని అందువల్ల అతన్ని పార్టీనుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాలని తీర్మానాన్ని ఆమోదించారు. ‘శివపాల్ యాదవ్, అతని కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. సిఎం అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారు’ అని ఉదయ్‌వీర్ సింగ్ ములాయంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అఖిలేష్‌తో కలసి చదువుకున్న ఉదయ్‌వీర్ అఖిలేష్‌కు గల అత్యంత సన్నిహితుల్లో ఒకరు. పార్టీ అధినేతకు రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలపై తాను విచారించడం లేదని ఉదయ్‌వీర్ సింగ్ చెప్పారు. ములాయం తన రెండోభార్య మాటలు వింటూ అఖిలేష్‌ను రాజకీయంగా దెబ్బ తీస్తున్నారని, ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం అఖిలేష్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని కూడా లేఖలో విమర్శించారు. ‘నేతాజీ పార్టీ సంరక్షకుడు. ఆయన నాకు, అఖిలేష్‌కు న్యాయం చేస్తారన్న విశ్వాసం ఉంది’ అని ఉదయ్‌వీర్ అన్నారు. తనకు బహిష్కరణ లేఖ అందిన తరువాత తాను తన వాదన వినిపిస్తానని ఆయన అన్నారు. శివపాల్, అఖిలేష్‌ల మధ్య ముదిరిన వివాదం పరిపాలనపైనా ప్రభావం చూపుతోంది.
శివపాల్‌కు సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను తొలగించి రాహుల్ భట్నాగర్‌ను అఖిలేష్ నియమించుకున్నారు. ములాయం లక్నోలో పార్టీ మహాసభలు నిర్వహిస్తుంటే అఖిలేష్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలో అధిష్ఠానం స్థాయిలో తలెగ్గిన ఈ గొడవలు కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

చిత్రాలు..బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ సింగ్

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి యుపి అధ్యక్షుడు శివపాల్ యాదవ్