జాతీయ వార్తలు

వీధికెక్కిన సమాజ్‌వాదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 24: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతఃకలహాలు మరింత రచ్చకెక్కాయి. సోమవారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మధ్య వేదికపైనే వాగ్యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి అఖిలేష్ పార్టీని చీల్చడానికి కుట్ర పన్నారని, కొత్త పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బాబాయి శివపాల్ యాదవ్ ఆరోపించడం, ఆ ఆరోపణలు అఖిలేష్ ఖండించడం వంటి పరిణామాలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. అధినేత ములాయం సింగ్ యాదవ్ తన ప్రసంగంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ను, తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను గట్టిగా వెనకేసుకొచ్చారు. అమర్ సింగ్ తనకు ఎంతో సహకరించారని,
అతను లేకుంటే తాను జైలులో ఉండేవాడినని, అతను తనకు సోదరుడిలాంటి వారని అన్నారు. పార్టీకోసం శివపాల్ చేసిన కృషిని తాను మరచిపోలేనని, అతను ప్రజానాయకుడని ప్రశంసించారు. అయితే ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవే కొనసాగుతారని, అతను పార్టీలోనే ఉంటారని ములాయం స్పష్టం చేశారు. అంతకు ముందు అఖిలేష్ సిఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. వేదికపై ఉన్న నాయకుల పరస్పర విమర్శలు, నిందారోపణలతో గందరగోళం నెలకొని సమావేశం అర్ధాంతరంగానే ముగిసిపోయింది. తరువాత ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు సభాస్థలిలో, బయట పరస్పరం ఘర్షణ పడ్డారు. పరస్పరం కొట్టుకుంటున్న ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.
తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టు వచ్చిన ఊహాగానాలకు అఖిలేష్ తెరదించారు. కొత్త పార్టీని స్థాపించే సమస్యే లేదని పేర్కొన్న ఆయన అధినేత ములాయం సింగ్ కోరితే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతానని అన్నారు. అఖిలేష్ యాదవ్ వేదికపై ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేతాజీ (ములాయం) ఎవరిని నిజాయితీపరుడిగా, యోగ్యుడిగా భావిస్తే అతనికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టనివ్వండి’ అని అఖిలేష్ అన్నారు. ‘నేనెందుకు కొత్త పార్టీని స్థాపించాలి?’ అని ఆయన గద్గద స్వరంతో ప్రశ్నించారు. ఇనే్నళ్లుగా తాను ప్రజాసంక్షేమం కోసం బాగా కష్టపడ్డానని చెప్పారు. ‘నా తండ్రి నాకు గురువు’ అని ఆయన అన్నారు. అనేక మంది తమ కుటుంబాన్ని చీల్చడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నారని అఖిలేష్ ఆరోపించారు. ఎలాంటి తప్పులనయినా ఎలా వ్యతిరేకించాలనేది తనకు తానుగా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. తన రథ యాత్ర కొనసాగుతుందని, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కూడా జరుగుతుందని అఖిలేష్ చెప్పారు. వ్యవస్థాపక దినోత్సవానికి అఖిలేష్ గైర్హాజరు అవుతారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. సమాజ్‌వాది పెన్షన్ యోజనతో తాను ప్రజలకు దగ్గర అయ్యానని ఆయన చెప్పారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి అమర్ సింగే కారణమని అఖిలేష్ పరోక్షంగా ధ్వజమెత్తారు. అక్టోబర్‌లో కొన్ని భారీ మార్పులు జరుగుతాయని ఆయన ముందే చెప్పారని అఖిలేష్ అన్నారు.
అయితే తరువాత ప్రసంగించిన ములాయం సింగ్ యాదవ్ అమర్‌సింగ్‌ను, శివపాల్ యాదవ్‌ను గట్టిగా సమర్థించారు. పార్టీ కష్టకాలంలో ఉందని, అందువల్ల పార్టీ సభ్యులు తమలో తాము పోట్లాడుకోవద్దని ఆయన హితవు పలికారు. ఒక సందర్భంలో తండ్రీకొడుకులిద్దరు సమావేశంలో ఒకరిపై ఒకరు అరచుకున్నారు. ‘అమర్, శివపాల్‌ల వ్యతిరేక చర్యలను నేను సహించబోను’ అని ములాయం తన కుమారుడిని పరోక్షంగా మందలించారు. కొంతమంది మంత్రులు భజనపరులుగా తయారయ్యారని ఆయన మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, శివపాల్ యాదవ్ తొలిసారిగా బహిరంగంగా అఖిలేష్‌పై ధ్వజమెత్తారు. అఖిలేష్ కొత్త పార్టీని స్థాపించి, మరికొన్ని పార్టీలతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తనకు చెప్పారని ఆయన ఆరోపించారు. అఖిలేష్ తనకు ఇలా చెప్పినట్టు తాను గంగాజలంపై ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ పాలనా బాధ్యతలను తిరిగి చేపట్టాలని ఆయన ములాయం సింగ్‌ను కోరారు.

చిత్రం.. లక్నో పార్టీ ఆఫీసు వద్ద అఖిలేష్ మద్దతుదారుల హడావుడి