జాతీయ వార్తలు

దశ సూత్రాలతో దిశ మారుద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు పది పాయింట్ల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. విపత్తుల నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఆసియా దేశాల మంత్రుల మూడు రోజుల సదస్సును ఆయన గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. గత ఇరవై ఏళ్లలో ఆసియా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా మార్చుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రేరకాలుగా మారాయని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి అన్ని సమస్యలకు పరిష్కారం కాలేదని, గత ఇరవై సంవత్సరాల్లో ఆసియా ఫసిఫిక్ దేశాల్లో ఎనిమిది లక్షల యాభై వేల మంది ప్రజలు విపత్తుల మూలంగా మరణించారని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. విపత్తుల మూలంగా ఎక్కువమంది మరణించే పది దేశాల్లో ఏడు దేశాలు ఆసియా ఫసిఫిక్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. భూకంపంలో కూలిపోయిన భవనాల నిర్మాణం పనులను స్థానిక ప్రజలకు అప్పగించటం వలన పనులు త్వరగా జరుగుతాయి, డబ్బు కూడా ఆదా అవుతుందని మోదీ సూచించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు దాదాపు 30 ఆసియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా వ్యవస్థలు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు.
విపత్తుల మూలంగా సంభవించే నష్టాన్ని తగ్గించుకునేందుకు పది పాయింట్ల అజెండాను పాటించాలని ఆయన సూచించారు.
1. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల్లో విపత్తు నివారణ నిర్వహణ తప్పనిసరిగా ఉండాలి. విమానాశ్రయాలు, రోడ్లు, కాలువలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వంతెనలు తదితర అన్ని నిర్మాణాలను ఒక నిర్దిష్టమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలి.
2. ప్రమాద నష్టపరిహారం చెల్లింపు వ్యవస్థ పరిధిలోకి అందరినీ తీసుకురావాలి. పేద ప్రజల నుండి చిన్న మధ్యతరహా పరిశ్రమలు, బహుళజాతి సంస్థలు, రాష్ట్రాల వరకు అన్నింటిని ప్రమాద నష్ట పరిహారం వ్యవస్థ పరిధిలోకి తీసుకురావటం ద్వారా భద్రత కల్పించాలని మోదీ ప్రతిపాదించారు. అందరికి బీమా కల్పించటం ద్వారా భద్రతను పెంచవచ్చు. ఈ సందర్భంగా జనధన పథకం, సురక్ష బీమా పథకాలను ఉదహరించారు.
3. విపత్తుల నివారణా యంత్రాంగంలో మహిళల భాగస్వామ్యాన్ని బాగా ప్రోత్సహించాలి.
4. విపత్తు జరిగే ప్రాంతాలను ముందుగా గుర్తించాలి. ఆక్కడ అన్ని ముందుజాగ్రలు తీసుకోవాలి.
5. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నివారణకు సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించుకోవాలి.
6. విపత్తు అంశాలపై అధ్యయనం, పరిశోధనలు చేసి నివారణోపాయాలను కనుగొనేందుకు విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయాలి.
7. సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు కల్పిస్తున్న అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవటం ద్వారా విపత్తు నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ లక్ష్య సాధనకోసం అవసరమైన యాప్స్‌లను రూపొందించాలి.
8. విపత్తులను ఎదుర్కొనేందుకు స్థానికంగానే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇతర ప్రాంతాలు, దేశాలు, వ్యక్తులపై ఆధారపడకుండా చూసుకోవాలి.
9. గతంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నుండి నేర్చుకున్న గుణపాఠాలతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
10. విపత్తులకు అంతర్జాతీయ స్పందన సకాలంలో వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రాంతాలకు అంత్జాతీయ స్థాయిలో లభించే సహాయ, పునరావాస సహాయాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకునేందుకు, వాడుకునేందుకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఐక్య రాజ్యసమితి దీనికోసం ఒక ప్రత్యేక లోగో, బ్రాండింగ్‌ను రూపొందించాలని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.

చిత్రం.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన పెయంటింగ్ పోటీల్లో ఓ విద్యార్థి గీసిన చిత్రాలను ఆసక్తిగా తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ