జాతీయ వార్తలు

రజతోత్సవ వేడుకల్లోనూ రచ్చకెక్కిన విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 5: సమాజ్‌వాది పార్టీ రజతోత్సవ వేడుకల సాక్షిగా ఆ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ లక్నోలోని సువిశాలమైన జనేశ్వర్ మిశ్రా పార్కులో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ పార్టీ అభిమానులు, నేతల సమక్షంలోనే మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించుకున్నారు. పార్టీ అధ్యక్ష హోదాలో తొలుత శివపాల్ యాదవ్ మాట్లాడగా, తర్వాత అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. శివపాల్ యాదవ్ మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని, తనను ఎన్నిసార్లు అవమానించినా, మంత్రి పదవినుంచి తొలగించినా బాధపడనని, పార్టీకోసం అవసరమైతే రక్తం ధారపోస్తానని అన్నారు. అయితే నేతాజీ (ములాయం) విషయంలో మాత్రం ఆయనను ఎవరైనా ఎదిరిస్తే సహించేది లేదన్నారు. కొంతమందికి ఎలాంటి త్యాగాలు చేయకుండానే అధికారం వారసత్వంగా సంక్రమిస్తుందని, అయితే మరికొందరికి మాత్రం ఎన్ని త్యాగాలు చేసినా వారికి తగిన గుర్తింపు ఉండదని పరోక్షంగా అఖిలేష్‌నుద్దేశించి అన్నారు. దొడ్డిదారిన పార్టీలోకి చొరబడిన కొందరు పార్టీలో విభేదాల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. మనమంతా రామ్ మనోహర్ లోహియా అనుచరులమని, ఆయన సిద్ధాంతాలను పాటించాలని హితవు చెప్పారు.
ఆ తర్వాత మాట్లాడిన అఖిలేష్ తన బాబాయి తనపై చేసిన విమర్శలకు అదే రీతిలో సమాధానం చెప్పారు. కొంతమంది మాట వింటారు కానీ మొత్తం సర్వనాశనమైన తర్వాత మాత్రమే వింటారంటూ బాబాయిని దెప్పి పొడిచారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదంటూనే అయితే ఎవరైనా తనంతట తానుగా పరీక్షలకు ముందుకు వస్తే తాను సిద్ధమేనని అన్నారు. తనకు కత్తిని బహూకరించడాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు నాకు కత్తిని బహూకరించారు. దాన్ని తిప్పకుండా ఉండను’ అని కూడా అన్నారు.
ఈ రజతోత్సవ వేడుకలకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో పాటుగా ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్, మాజీ ప్రధాని, జెడి(ఎస్) నేత హెచ్‌డి దేవెగౌడ, జెడి (యు) నేత శరద్ యాదవ్, ఐఎన్‌ఎల్‌డి నేత అభయ్ చౌతాలా, రాంజెత్మలానీ తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల ప్రారంభంలో లాలూప్రసాద్ యాదవ్ అఖిలేష్, శివపాల్ యాదవ్ చేతులు పట్టుకుని వారిద్దరూ కలిసే ఉన్నారని చెప్పడానికి ప్రయత్నించగా, అఖిలేష్ దానికి ప్రతిగా బాబాయ్ శివపాల్ యాదవ్ ఆశీస్సులు తీసుకున్నారు. వేదికపై కూడా ఈ ముగ్గురూ కార్యక్రమం గురించి చర్చించుకోవడం కనిపించింది.
యుపిలోనూ అడ్డుకుంటాం: లాలూ
బిహార్‌లో లాగానే ఉత్తరప్రదేశ్‌లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి తమ మద్దతు ఉంటుందన్నారు. ఎస్పీని బలోపేతం చేయడానికి తామంతా ఇక్కడికి వచ్చామని కూడా లాలూ చెప్పారు. కాగా, సమాజ్‌వాది పార్టీతో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాల గురించి మాజీ ప్రధాని దేవెగౌడను విలేఖరులు ప్రశ్నించగా, యుపిలో తమ పార్టీ లేదని, అయితే యుపి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలో కూటమి ఏర్పాటు గురించి ఆలోచిస్తామని చెప్పారు. సమాజ్‌వాది పార్టీ ఆహ్వానంపై పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికే తాను ఇక్కడికి వచ్చానని దేవెగౌడ చెప్పారు. కాగా, సమాజ్‌వాది పార్టీతో తమకు పాత సంబంధాలున్నందున ఆ పార్టీ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చానని జెడి (యు) నేత శరద్ యాదవ్ చెప్పారు. పొత్తుల గురించి ఇప్పుడు ఎలాంటి చర్చలు జరగలేదని, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ పెద్ద పార్టీ అని, ములాయం సింగే దాని గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

చిత్రం.. లక్నోలో శనివారం జరిగిన సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవ వేడుకల్లో వేదికపై కత్తులు దూస్తున్న
అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్... నడుమ ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్