జాతీయ వార్తలు

నోట్లు..పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: నల్లధనాన్ని వెలికితీయటంతో పాటు నకిలీ కరెన్సీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశంలో చిల్లర తగాదాలు మొదలయ్యాయ. బ్యాంకుల వద్ద గంటల తరబడి బారులుతీరి నిల్చున్నా, నగదు మార్పిడి కావటం లేదు. ఇందుకు బ్యాంకు అధికారులు రకరకాలుగా సాకులు చెబుతున్నారు. ఇక ఏటిఎంకు వెళితే అది ‘ఎనీ టైం మూతే’. వ్యక్తిగత ఖాతాల నుంచి రోజుకి రెండున్నర వేలు, నగదు మార్పిడి అయితే నాలుగున్నర వేలకు పరిమితిని పెంచినా, చిల్లర కష్టాలు దూరం కావటం లేదు. కొన్ని బ్యాంకుల్లో నాలుగున్నర వేలకు రెండు 2వేల కొత్త నోట్లను ఇవ్వటంతో దానికీ చిల్లర దొరకక జనం బేజారవుతున్నారు. జనం వద్ద ఆశించిన స్థాయలో డబ్బు లేకపోవటంతో మార్కెట్‌లో అన్ని రకాల వ్యాపారాలు కుదేలయ్యాయి. ఈ నిర్ణయం అక్రమార్కులను ఎంతవరకు కట్టడి చేస్తుందో తెలియదు కానీ.. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు మాత్రం పైసాకు విలవిల్లాడుతున్నారు. బడా వ్యాపార వేత్తలు, బ్లాక్‌మనీని కట్టలు కట్టలుగా దాచుకున్న బడాబాబులు మాత్రం ‘అనంత కోటి ఉపాయాలు’ జన్నట్లు కూల్‌గా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకుంటున్నారు. ఎటొచ్చీ మధ్యతరగతి, పేద ప్రజలకే ఇబ్బందులన్నీ. ఈ మొత్తం వ్యవహారంపై హైదరాబాద్‌లోని వివిధ వర్గాల స్పందన ఇలా ఉంది:
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం భేష్
ప్రధాని మోదీ పనితీరుకు ఇది నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలంటే ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు అవసరం. విచ్చల విడిగా నకిలీ కరెన్సీ దేశంలో చెలామణి అవుతుండడం, నల్లధనమున్న సంఘ విద్రోహ శక్తులకు, పన్ను ఎగవేతదారులకు ఇదొక షాక్ ట్రీట్‌మెంట్. లావాదేవీలన్నీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కొనసాగిస్తే ఇబ్బందులుండవు.
- ఎ.సాయికిరణ్, ఎంబిఏ విద్యార్థి
2వేల నోటుతో ప్రయోజనమేమిటో?

పెద్దనోట్ల రద్దు దేశ ప్రయోజనాల కోసమైతే సరే. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా చిల్లర అందుబాటులో ఉంచితే సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది కాదు. రెండు వేల నోటుతో బజారుకెళ్లి మూడు వందలు కొనుగోలు చేస్తే చిల్లర ఇవ్వడానికి షాపు యజమాని నిరాకరిస్తున్నాడు. అలాంటపుడు 2వేల నోటును కొత్తగా తెచ్చి ప్రయోజనం ఏమిటీ? చిల్లర కొరతతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేయాలన్నా అష్టకష్టాలు తప్పటం లేదు.
- రాధిక రెడ్డి, గృహిణి
వ్యాపారం సగానికి తగ్గిపోయంది

రోజువారీ ఇంట్లో సరుకులకు అవసరమైన డబ్బును ఏటిఎంల ద్వారా తీసుకునే వాళ్లం. ఇపుడు ఏటిఎంల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి రావటానికి కేంద్రమే కారణం. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తప్పేమీ కాదు. అయతే ముందుగా ప్రజలకు అవసరమైన చిల్లరను అందుబాటులోకి తెచ్చి ఉండాల్సింది. చిల్లర కారణంగా సగానికి పైగా వ్యాపారం తగ్గిపోయింది.
- మహ్మద్ మహాబూబ్, కూరగాయల వ్యాపారి, ఫస్ట్‌లాన్సర్
వందనోట్లను అందుబాటులో ఉంచాలి

వెయ్యి, 500నోట్లు పేదల వద్ద ఎక్కువగా ఉండవు. అలాగని ఉన్న డబ్బంతా ఇంట్లో పెట్టుకోరు. ఉన్న ఒకటి, రెండు నోట్లను మార్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సామాన్యుల కష్టాలను గుర్తించి, ముందుగానే కావల్సిన సంఖ్యలో వంద నోట్లను అందుబాటులోకి తెచ్చి, పెద్ద నోట్లను రద్దు చేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండేది కాదు.
- మహమూద్ బిన్ నాసర్,
వెహికిల్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు, మాసాబ్‌ట్యాంక్
ద్విచక్రవాహనదారులతోనే గొడవ

పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోయించుకునేందుకు కార్లలో వచ్చేవారు ఏకంగా వెయ్యి, 500 ఇచ్చి, ఆ మొత్తానికి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. కానీ ద్విచక్ర వాహనదారులే 500, వెయ్యి ఇచ్చి వంద, రెండు వందల ఇంధనం పోసుకుంటే మేమెక్కడ చిల్లర ఇవ్వగలం. అయినా 500 నోటిస్తే 300 పెట్రోల్ పోసి రూ. 200 తిరిగి చెల్లిస్తున్నాం. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత వ్యాపారం బాగా తగ్గిపోయింది.
- శ్రీకాంత్, పెట్రోల్ బంక్, ఉద్యోగి, లక్డీకాపూల్
నిర్ణయం.. హర్షణీయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం హర్షణీయం. నల్లకుబేరులను, దేశాన్ని అస్థిర పరుస్తున్న అసాంఘిక శక్తుల కట్టడికి అకస్మాత్తుగా పెద్దనోట్ల రద్దు సరైందే. అయితే దేశంలో చెలామణీలో ఉన్న పెద్దనోట్ల స్థానంలో కనీసం సగమైన ఐదు వందలు, వందనోట్లు ఇతర చిల్లరను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులుండేవి కాదు.
- ఎం.ప్రవీణ్‌కుమార్, వ్యాపారి
పెట్రోల్ కూడా పోయటం లేదు

కొద్దిరోజుల క్రితంవరకు ఎంతో జాగ్రత్తగా దాచుకున్న వెయ్యి, 500 నోటుతో కనీసం బంక్‌లలో పెట్రోల్ కూడా పోయటం లేదు. ప్రభుత్వం పెద్దనోట్లును రద్దు చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్‌లలో కొత్త నోటు రెండు వేల రూపాయాలతో వెళ్లినా, చిల్లర లేదని చెబుతున్నారు.
- కె.చంటిబాబు, కేబుల్ ఆపరేటర్, లంగర్‌హౌజ్
దేశం బాగుపడాలంటే..

నోట్ల రద్దు చేయడం సహసోపేతమైన నిర్ణయమే. బ్యాంక్ అధికారుల ఇచ్చిన రెండు వేల రూపాయాల నోట్లతో వెళ్లితే దుకాణాలలో చిల్లర సరుకులకు ఇబ్బందికరంగా మారింది. అయితే బ్యాంక్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ వంద రూపాయల నోట్లిస్తే బాగుంటుండేది. దేశం బాగుపడాలంటే మరికొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదు.
- గోవర్థన్‌రావు, బిజెపి నాయకుడు, లంగర్‌హౌజ్
నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు..
నల్లధనం బయటికి తేవడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేయడంతో అక్రమార్కులు, నల్లకుబేరుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పెద్ద నోట్లు రద్దుతో ప్రజలకు కొంత ఇబ్బంది అయిన ఫరవాలేదు. మరికొన్ని రోజులైతే ఈ చిల్లర గొడవ సద్దుమణిగిపోతుంది. అందరూ ఇబ్బందులు పడకుండా ఉన్నదాంట్లో సరిపెట్టుకోవాలి.
- ఉమేశ్, మెకానిక్, గుడిమల్కాపూర్
అమ్మకాలు బాగా తగ్గాయి

పెద్ద నోట్లు రద్దు కావటంతో అమ్మకాలు బాగా తగ్గాయి. వినియోగదారులు సరిగా రావడం లేదు. వచ్చిన వారు రెండు వేల రూపాయల నోట్లు తీసుకవస్తున్నారు. దానికి చిల్లర లేకపోవటంతో కూరగాయాలను అమ్మలేకపోతున్నాం. ప్రభుత్వం మరింత చిల్లర ఇస్తే బాగుంటుంది.
- నవీన్, రైతు, మెయినాబాద్
అమ్మలేకపోతున్నాం

చిల్లర లేకపోవటంతో రోజుకి కనీసం వంద, రెండు వందల విలువైన ఆకు కూరలు కూడా అమ్మలేకపోతున్నాం. కొద్దిరోజులుగా పెద్దనోట్లు చెల్లుబాటు కాకపోవటంతో ఎంతో బాధ పడుతున్నాం. అందరికీ కావల్సిన చిల్లర అందుబాటులో ఉంచితే బాగుండేది.
- మల్లమ్మ, ఆకుకూరల వ్యాపారి
ఇల్లు గడవడం కష్టమైపోతోంది

జామకాయలు అమ్ముకుని జీవిస్తున్నా. కొద్ది రోజులుగా చిల్లర లేకపోవటంతో అమ్మకాల్లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. వస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జామకాయలు కొనేవారు రెండు వేల రూపాయల నోటు తీసుకొస్తే చిల్లర నేనెక్కడ తెస్తా?
- ఖలీల్, తోపుడు బండి వ్యాపారి, మెహిదీపట్నం
కూలీ కెళితే పాత నోటే ఇస్తున్నారు

కూలి పనులకు వెళ్లితే పాత 500నోటు ఇస్తున్నారు. దాంతో రోజు పప్పులు, ఉప్పులు కొనే కొట్టుకు వెళితే వాళ్లు తీసుకోవడం లేదు. ప్రతి రోజు కూలీ చేస్తేనే తమ బతుకులు నడుస్తాయ. మరి కూలి చేశాక వచ్చిన డబ్బులు చెల్లకపోతే ఎట్లా బతకాలి?
- మొగులప్ప, రోజువారీ కూలీ