జాతీయ వార్తలు

మంత్రి వాహనంలో రూ. 91లక్షల నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 18: ఉస్మానాబాద్ జిల్లాలో గురువారం తనిఖీలో పట్టుబడిన పాత 500, వెయ్యి రూపాయల నోట్లలో ఉన్న రూ. 91 లక్షల రూపాయల నగదు తనదేనని మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ అంగీకరించారు. తన రోజువారీ వ్యాపార అవసరాలకు పని కొస్తుందనే ఉద్దేశంతో ఆ నగదును తన దగ్గరే ఉంచుకున్నానని, అయితే ఎనిమిదో తేదీ ఈ నోట్లను హటాత్తుగా రద్దు చేయడం జరిగిందని దేశ్‌ముఖ్ ఓ ప్రైవేట్ న్యూస్ చానల్‌కు చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పారు. మంత్రికి చెందిన సోలాపూర్‌లోని స్వచ్ఛంద సంస్థ లోక్‌మంగళ్ గ్రూపునకు చెందిన ఓ వాహనంలో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఉమ్రాగా పట్టణం వద్ద జిల్లా ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ జరిపిన రొటీన్ తనిఖీల్లో ఈ నగదును కనుగోనడం జరిగిందని ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నర్నవారే సైతం గురువారం రాత్రి ధ్రువీకరించారు. వాహనాన్ని వెంటనే సీజ్ చేసిన పోలీసులు నగదును స్థానిక జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరిగింది.
ఆ డబ్బు లోక్‌మంగళ్ బ్యాంక్‌కు చెందినదని, గ్రూపునకు చెందిన చక్కెర ఫ్యాక్టరీ వర్కర్ల జీతాలు చెల్లించడం కోసం ఆ సొమ్ము తీసుకువెళ్తున్నట్లు తొలుత లోక్‌మంగళ్ గ్రూపు ఉద్యోగి ఒకరు చెప్పడం జరిగింది. అయితే 24 గంటలు తిరక్కముందే మంత్రి ఆ సొమ్ము తనదేనని, అది చట్ట వ్యతిరేకమైంది కానీ, ఎన్నికల్లో ఓటర్లకు పంచడం కోసం తీసుకెళ్తున్నదో కానీ కాదని చెప్పడం గమనార్హం. అయితే దేశ్‌ముఖ్‌ను మంత్రివర్గంనుంచి తక్షణం తొలగించాలని ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, ఎన్‌సిపిలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఆరు నెలలుగా బిజెపి నేతల బ్యాంక్ లావాదేవీలన్నిటిపైనా ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయనున్న విషయం కొంతమంది బిజెపి నేతలు, పారిశ్రామికవేత్తలకు ముందే లీక్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. కాగా, బిజెపి నేతల ఇళ్లలో నల్లధనం భారీగా ఉందని ఎన్‌సిపి రాష్ట్ర ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ఆదాయం పన్ను శాఖ బిజెపి నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించాలని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రి దేశ్‌ముఖ్‌ను తక్షణం బర్తరఫ్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న నగదు కొరత దృష్ట్యా ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులు, ఆదాయం పన్ను శాఖ అధికారులను కోరినట్లు జిల్లా అధికారులు చెప్పారు. లోక్‌మంగళ్ గ్రూపు గనుక రద్దయిన పెద్ద నోట్లను తన వద్ద భారీగా ఉంచుకోవడంపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని పక్షంలో ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోక తప్పదని కూడా వారు చెప్పారు.