జాతీయ వార్తలు

స్తంభించిన పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కావేరీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన వివాదాస్పద గొడవల మూలంగా లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల గొడవ మూలంగా లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడగా రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి పెద్ద నోట్ల రద్దుపై ధ్వజమెత్తారు. దీని కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించటంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె, అన్నా డిఎంకె, ఆం ఆద్మీ పార్టీల గందరగోళం సృష్టించాయి. ఆ సమయంలోనే మాట్లాడిన కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నోట్ల రద్దు వ్యవహారంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై చర్చ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు. అయితే వాయిదా తీర్మానం ప్రకారం చర్చించాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టవలసిందేనని విపక్షాలు పట్టుపట్టారు. పోడియం చుట్టూ చేరిన ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ గందరగోళంలో పడిపోయింది. మీకు చర్చ జరగటం ఇష్టం లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ విమర్శించినా పట్టించుకోకుండా నినాదాలు ఇచ్చారు. దీంతో ఆమె సభను 12గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ఇదే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ అధికార పత్రాలను ప్రతిపాదింపచేసిన అనంతరం కొద్దిసేపు జీరో అవర్ నిర్వహించిన తరువాత సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం పోడియం వద్దకు వచ్చి గొడవ చేసింది. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటంతో స్పీకర్ లోక్‌సభను సోమవారం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
రాజ్యసభలోనూ ఇదే వరుస
రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే అన్నా డిఎంకె సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేయటంతో గందరగోళం ఏర్పడింది. అధికార పక్ష సభ్యులు ముందు వరుస వద్దకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ నిన్న చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. ఎంఏ ఖాన్ పోడియం వద్దకు వచ్చి ఉపాధ్యక్షుడు పిజె కురియన్‌తో వాదనకు దిగారు. ఇంతలో మరికొందరు కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రధాని మోదీ సభకు వచ్చి నోట్ల రద్దుపై చర్చకు సమాధానం ఇవ్వాలని పట్టుపట్టారు. ఉరీ సైనిక శిబిరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారికంటే ఎక్కువ మంది కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి మరణించారంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బాధకు కలిగించాయని బిజెపి సభ్యులు అన్నారు. ఆజాద్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేయటంతో సభ స్తంభించిపోయింది. ప్రతిపక్ష సభ్యులు గొడవ చేస్తే అర్థం చేసుకోవచ్చని, అధికార పక్ష సభ్యులు గొడవ చేయటం ఏమిటని కురియన్ ప్రశ్నించారు. సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ ప్రధాని సభకు రావాల్సిందేనని పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీరిలా మాట్లాడితే ఎలా అని చైర్మన్ హమీద్ ఆన్సారీ ప్రశ్నించారు. దీనితో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ ప్రారంభించటంతో ఆయన సభను అర గంట వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూ గొడవ చేశారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రైవేట్ మెంబర్ బిల్లును చర్చకు చేపట్టేందుకు ప్రయత్నించారు. ఆనంద్ శర్మ లేచి ప్రధాని సభకు రావలసిందేనని పట్టుపట్టారు. ఈ దశలో కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటంతో గందరగోళం నెలకొంది. పలువురు ప్రతిపక్ష సభ్యులు ఈ గందరగోళం మధ్యనే తమ బిల్లును సభలో ప్రతిపాదించారు.
జెడియు నాయకుడు శరద్ యాదవ్ లేచి అధికార పక్ష సభ్యులు ఎందుకు గొడవ చేస్తున్నారని నిలదీశారు. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. ఈ దశలో కురియన్ సభను సోమవారం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రాలు.. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. సభలో గందరగోళం... రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్