జాతీయ వార్తలు

ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు తమ ఆందోళనను మంగళవారం నుంచి ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఓవైపు పార్లమెంటు ఆవరణలో ధర్నా కార్యక్రమం, మరోవైపు రాజధాని వీధుల్లో మమత నేతృత్వంలో నిరసన ప్రదర్శనలతో పాటు, ఉభయ సభల్లో మొదటి రోజు నుంచి కొనసాగుతున్న ఆందోళనలను మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విపక్షాలన్నీ కలిసి ధర్నా చేపట్టనున్నాయి. కాంగ్రెస్, బిఎస్‌పి, వామపక్షాలు, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, జెడియు, ఆర్‌జెడి తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా ధర్నాకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మంగళవారం ధర్నాలో పాలొంటారు. రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ కార్యాలయంలో సోమవారం అన్ని విపక్షాల సీనియర్ నేతలు సమావేశమై నోట్ల రద్దకు సంబంధించి ప్రభుత్వ మొండి వైఖరిపై అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున పార్లమెంటు ఉభయ సభల్లో తమ నిరసనను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించారు. పెద్ద నోట్లను రద్దు చేయటం వలన సామాన్య
జనం ఎన్నో ఇక్కట్ల పాలవుతున్నా ఎన్‌డిఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని తీరుకు నిరసనగా దేశ రాజధాని వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ‘ప్రధానమంత్రి ఇతర పార్టీలను బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ప్రధాని ప్రధానిలాగానే వ్యవహరించాలి. ఇక్కడ అహంభావం అంశం కాదు. నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు అందుకు తగినన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని ఉండాల్సింది. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందరం కలిసి సమస్యను పరిష్కరించుకుందాం’’ అని మమత మోదీకి హతవు చెప్పారు. తనను జైల్లో పెట్టినా తన నిరసనను ఆపేది లేదని స్పష్టం చేశారు. ‘ప్రధాని నిర్ణయం వెనుక ఏదో రహస్య అజెండా ఉంది. అదేమిటో ప్రజల ముందుకు రావాలి. నవంబర్ 23, 24 తేదీలో ఢిల్లీలో ఉంటాను. 29న లక్నో, తరువాత పంజాబ్, బీహార్‌కూ వెళ్తాను అని ఆమె వివరించారు. రూ.2000 నోటుపై బెంగాల్ టైగర్‌ను ముద్రించకపోవటంపైనా ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ నోటుపై మహాత్మాగాంధీ, జాతీయ వారసత్వ సంపద అయిన ఏనుగును ముద్రించిన సర్కారు, జాతీయ జంతువైన పులిని ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. గతంలో ఉన్న నోట్లలో ఈ మూడు చిత్రాలు ఉండేవని అన్నారు.
జనం చస్తుంటే మోదీ నవ్వుతున్నారు: రాహుల్
నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఏటిఎంల దగ్గర సామాన్య ప్రజలు చనిపోతుంటే, ప్రధాని మోదీ వాళ్లను చూసి నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని పలు ఎటిఎం సెంటర్లను రాహుల్ సోమవారం ఉదయం పార్లమెంటుకు వెళ్లేముందు సందర్శించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా పలువురు ఆర్థిక వేత్తలు పెద్ద నోట్ల ఉపసంహరణలో శాస్ర్తియత లేదని ఆభిప్రాయపడ్డారని రాహుల్ పేర్కొన్నారు. విజయ్‌మాల్యా, లలిత్‌మోదీ లాంటి బడా నల్లకుబేరులను అప్పణంగా వదిలేసి సామాన్యులను కనాకష్టం పాలు చేస్తున్నారని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు.
పులిమీద స్వారీ చేస్తున్నారు: నితీష్
నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పులిమీద స్వారీ చేస్తున్నారని, జెడియూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. పాట్నాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రధాని నిర్ణయంపై ప్రజల్లో సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పటికీ, ఆయన మిత్రపక్షాల్లోనే విభేదాలు తెచ్చేట్లు ఉందన్నారు. ప్రధాని నిర్ణయాన్ని ముందునుంచీ నితీష్ సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. బినామీలకు చెక్‌పెట్టేందుకు ప్రధాని తీసుకునే నిర్ణయాన్నీ తాను స్వాగతిస్తానని నితీష్ చెప్పారు. ప్రజలకు ఏవైనా కష్టాలు ఎదురైతే, కేంద్రాన్ని అడిగేందుకు వెనుకాడేది లేదని కూడా నితీష్ స్పష్టం చేశారు.