జాతీయ వార్తలు

ప్రధాని వచ్చినా..సభ సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజ్యసభకు వచ్చినా ప్రతిపక్షం మాత్రం పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న చర్చను ముందుకు సాగించేందుకు అనుమతించలేదు. నల్లధనానికి ప్రతిపక్షం మద్దతు ఇస్తోందంటూ చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పేంతవరకు సభలో చర్చను సాగనివ్వమంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి గొడవ చేశారు. నరేంద్ర మోదీ సభలో ఉన్నారు కాబట్టి చర్చను ముందుకు సాగించాలన్న అధికార పక్షం డిమాండ్‌ను ప్రతిపక్షం తోసిపుచ్చింది. రాజ్యసభలో గొడవ జరుగుతున్నంత సేపు నరేంద్ర మోదీ సభలో వౌనంగా కూర్చున్నారు.
రాజ్యసభ గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన తరువాత జీరో అవర్‌లో మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కత్తా విమానాశ్రయంలో ప్రమాదకర పరిస్థితుల్లో దిగటంపై చర్చ జరిగింది. పనె్నండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యారు. సభా అధ్యక్షుడు హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రతిపక్షం దీనికి అంగీకరించలేదు. గులాం నబీ ఆజాద్ లేచి పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. నరేంద్ర మోదీ ఈ అంశంపై బైట మాట్లాడుతున్నారు తప్ప సభలో మాట్లాడటం లేదని ఆరోపించారు. టిఎంసి సభ్యుడు డెరిక్ ఓబ్రేన్, జెడి(యు) నాయకుడు శరద్ యాదవ్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుపై చర్చ ఏమైందని ప్రశ్నించారు. ప్రతిపక్షం కోరితే పెద్దనోట్ల చర్చను కొనసాగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ప్రధాని సభలో ఉన్నారు కాబట్టి ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి బదులు చర్చను కొనసాగించాలని వారు సూచించారు. ఇదివరకే ప్రారంభమైన చర్చను ముందుకు సాగిస్తానంటూ బిజెడి సభ్యుడు సింగ్ దేవ్‌కు హమీద్ అన్సారీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే అధికార పక్షం తమను ఇరకాటంలో పడవేసిందనేది గ్రహించిన ప్రతిపక్షం, చర్చను సాగనివ్వకుండా తమను అవమానించిన ప్రధాన మంత్రి మొదట క్షమాపణలు చెప్పాలంటూ గొడవ చేశాయి. ప్రతిపక్షం ఇస్తున్న నినాదాలకు అధికారపక్షం కూడా నినాదాలతో బదులివ్వగలదని వెంకయ్య నాయుడు హెచ్చరించారు. పెద్దనోట్ల వ్యవహారంపై ఒకరోజంతా చర్చ జరిపిన ప్రతిపక్షం ఆ తరువాత ఎందుకు మనసు మార్చుకున్నదని ఆయన నిలదీశారు. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్. టిఎంసి తదితర పార్టీల సభ్యులు నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. దీనితో హమీద్ అన్సారీ సభను పదిహేను నిమిషాలపాటు వాయిదా వేశారు. రాజ్యసభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో గందరగోళం నెలకొన్నది.
కంగుతిన్న ప్రతిపక్షం
నరేంద్ర మోదీ రెండోసారి సభకు రాకపోవచ్చునని భావించిన ప్రతిపక్ష సభ్యులు రెండు గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు తక్కువ మంది హాజరయ్యారు. ప్రధాని సభలో ఉన్నందున చర్చను కొనసాగించాలని వెంకయ్య నాయుడు ఉపాధ్యక్షుడు కురియన్‌కు సూచించారు. కురియన్ చర్చను కొనసాగించేందుకు సిద్ధంకావటంతో ప్రతిపక్షం ఇరకాటంలో పడిపోయింది. చర్చ జరిగితే రాజకీయంగా దెబ్బతింటామని గ్రహించిన ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలిచ్చారు. ప్రధాని సభలో ఉంటే చర్చ జరుపుతామన్న ప్రతిపక్షం అసలు స్వరూపం ఇప్పుడు బైటపడుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విమర్శించారు. కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, కెవిపి రామచందర్‌రావుతోపాటు పలువురు ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వం, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీనితో కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

చిత్రం..గురువారం రాజ్యసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. పోడియంను చుట్టుముట్టి సభను స్తంభింపజేస్తున్న విపక్షాలు