జాతీయ వార్తలు

జయ పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 4: తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ప్రకటించిన కొద్దిసేపటికే అమ్మకు గుండెపోటు వచ్చిందని, ఐసియుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేయటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జాతీయ స్థాయిలో కేంద్ర హోం, ఆరోగ్య మంత్రులు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. సీనియర్ కేంద్ర మంత్రులిద్దరూ తమిళనాడు బాట పట్టారు. జయ ఆరోగ్యం విషమించటంతో తమిళనాడు మంత్రివర్గం సీనియర్ మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఆసుపత్రిలోనే అత్యవసరంగా భేటీ అయింది. అపోలో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున తరలి వచ్చిన అన్నాడి ఎంకె కార్యకర్తలను అదుపు చేయటం కోసం భారీగా పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఒక దశలో ఆసుపత్రి లోపలికి దూసుకుపోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. రాష్టప్రతి సహా జాతీయ నాయకులంతా జయ త్వరగా కోలుకోవాలని సందేశం ఇచ్చారు. గత రెండు మాసాలుగా అపోలోలో చికిత్స పొందుతున్న జయలలిత సాధారణ వార్డులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలోనే ఇంటికి వెళ్లవచ్చని వైద్యులు సూచించినట్లు అన్నాడిఎంకె పార్టీ ప్రతినిధి ఆదివారం ఉదయం ప్రకటించారు. అమ్మను ఎయిమ్స్ వైద్యులు ఉదయం పరీక్షించి శుభవార్త చెప్పారని, ఆమె అధికారులకు పాలనాపరమైన సూచనలు కూడా చేస్తున్నారని పార్టీ ప్రతినిధి వెల్లడించారు. ఈ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని ఆమెను ఐసియుకి తరలించి కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులతో వైద్య చికిత్సను అందిస్తున్నట్లుగా అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుబ్బయ్య విశ్వనాథన్ అధికారికంగా ప్రకటన వెలువరించారు. ఆ క్షణం నుంచి పరిణామాలు ఒకదాని వెంట ఒకటిగా వేగంగా మారుతూ వచ్చాయి. మహారాష్టల్రో ఉన్న తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన అపోలోకు ప్రత్యేక విమానంలో తరలివచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గవర్నర్‌కు ఫోన్ చేసి జయ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మరోవైపు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. అంతర్జాతీయ వైద్య నిపుణులను అపోలో వైద్యులు సంప్రదించారు. జయకు మొదటినుంచి వైద్యాన్ని అందిస్తున్న బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ బీలెను కూడా అపోలో యాజమాన్యం సంప్రదించింది. మొత్తం ఎనిమిది మంది వైద్యుల బృందం జయకు ఐసియులో చికిత్సను అందిస్తోంది. ఎయిమ్స్ వైద్య బృందం కూడా న్యూఢిల్లీ నుంచి చెన్నైకి బయలు దేరింది.
జయలలితకు గుండెపోటు వార్తపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రభృతులు జయ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నట్లుగా తమ ట్విట్టర్ ఖాతాల్లో సందేశమిచ్చారు.
బలగాల మోహరింపు
పురచ్చితలైవి అమ్మ జయలలిత ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే రాష్టమ్రంతటా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. చెన్నై, దాని పరిసర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా అపోలోకు తరలివచ్చారు. వాళ్లను నియంత్రించటానికి పోలీసు బలగాలతోపాటు పారామిలటరీ దళాలను మోహరించారు. అపోలో చుట్టుపక్కలనున్న హోటళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఒక దశలో కార్యకర్తలు ఆసుపత్రిలోకి చొచ్చుకుపోవటానికి ప్రయత్నించటంతో లాఠీచార్జి తప్పలేదు. దీంతో అపోలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో జయ అభిమానులు పలుచోట్ల రోడ్లపై బైఠాయించి ధర్నాలకు దిగారు. రాష్టమ్రంతటా అత్యవసర పరిస్థితి వాతావరణం ఏర్పడటంతో తమిళనాడు సీనియర్ మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో తమిళనాడు కేబినెట్ అపోలో ప్రాంగణంలోనే అత్యవసరంగా భేటీ అయి పరిస్థితిని సమీక్షించింది. అవసరమైతే అదనపు బలగాలను పంపించాల్సిందిగా కేంద్రానికి లాంఛనంగా విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్టమ్రంతటా విద్యాసంస్థల బంద్‌ను ప్రకటించింది.
సెప్టెంబర్ 22న అతిసారం, జ్వరంతో బాధపడుతూ జయలలిత అపోలోలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా చికిత్స పొందుతున్న జయ పూర్తిగా కోలుకున్నారని, ఏ రోజైనా ఆమె ఇంటికి వెళ్లిపోవచ్చని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కానీ, ఆదివారం ఒక్కసారిగా ఆమె పరిస్థితి విషమించటంతో ఆమె కోలుకోవాలంటూ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.