జాతీయ వార్తలు

అన్నాడిఎంకె సారథ్యం ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: దశాబ్దాల పాటు అన్నాడిఎంకెకు తిరుగులేని అధినేత్రిగా కొనసాగిన జయలలిత ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి తదుపరి సారధి ఎవరన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. జయలలిత స్థాయిలో పార్టీని ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నేతలు పార్టీలో ఉన్నారా.. ఉంటే ప్రస్తుతం వారికున్న స్ధానం ఏమిటన్నదీ చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, జనబాహుళ్యంలో గత రెండు రోజులుగా నలుగుతున్న చర్చ అధికార పార్టీకి తదుపరి అధినేత ఎవరన్నది? దీర్ఘకాలంగా జయకు సన్నిహితురాలిగా కొనసాగడమే కాకుండా ఆమె అంత్యక్రియలూ నిర్వహించిన శశికళకు ఈ అవకాశం దక్కుతుందా అన్నది సమాధానం లేని ప్రశ్నగానే కనిపిస్తోంది. తమిళనాడులో ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ అన్నాడిఎంకె అంటే అమ్మ జయలలితేనన్న భావన బలంగా నాటుకు పోయింది. ఆమె మాటే వేదంగా, ఆదేశమే పరమావధిగా ఇనే్నళ్లూ పార్టీలో కొనసాగింది. అలాంటి అధినేత్రే సర్వస్వంగా ఉండటం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ దశలోనూ ఎదుగక పోవడమే ఈ జటిల పరిస్థితికి కారణమని చెబుతున్నారు. అంతే కాదు, తన తర్వాత స్థానం వీరిదే అంటూ ఎవరినీ జయ తన హయాంలో పెంచి పోషించలేదు. శశికళ సన్నిహితురాలిగా కొనసాగారే తప్ప జయ తర్వాతి స్థానం ఆమెదేనన్న భావనకు ఏ కోశానా ఎవరికీ కలుగలేదు. ఇప్పుడు శశికళ పేరు ప్రధానంగా వినిపిస్తున్నా..పార్టీ సారధ్యం ఆమెకే దక్కుతుందా అన్నది సమాధానం లేని ప్రశే్న! ఒకవేళ ఎవరు వచ్చినా జయ తరహాలో పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని, పట్టును కొనసాగించే అవకాశమే లేదన్నది ఎంతైనా వాస్తవం. పార్టీ తదుపరి నాయకత్వంతో పాటు ఇతరత్రా అనేక అంశాలను చర్చించడానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దాదాపు రెండు గంటల పాటు శశికళతో సమావేశమయ్యారు. శశికళే అధికార కేంద్రంగా కనిపిస్తున్నా..వాస్తవంగా ఆమెకు ఉన్న నాయకత్వ పటిమ ఏమిటి.. జయ తరహాలో పార్టీని ముందుకు నడిపించగలరా అన్నది స్పష్టం కావడం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి సహజంగానే శశికళకు దక్కాలని, ఇందులో ఎలాంటి సందేహాలకు ఆస్కారం ఉండకూడదని ఆమె సన్నిహితులు చెబుతున్నప్పటికీ..పార్టీ వర్గాల్లోనూ, ఇతరుల్లోనూ ఇందుకు భిన్నమైన వాదనే వినిపిస్తోంది. శశికళకు పార్టీ సారధ్యం అప్పగించాలని కోరే వారికంటే కూడా ఆ ఆలోచననే వ్యతిరేకించే వారి సంఖ్య పార్టీలో పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా జయలలితకు శశికళే తోడు, నీడగా ఉన్నారని, ఆమె బాధనూ, ఆనందాన్ని పంచుకున్నారని, సహాయకురాలిగా, సోదరిగా, మార్గదర్శిగా అన్నింటికీ మించి అత్యంత విశ్వసనీయ సన్నిహితురాలిగా శశికళ కొనసాగారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి చేపట్టారు కాబట్టి అన్నాడిఎంకె సారధ్యం శశికళకు దక్కడమన్నది ఎంతైనా న్యాయమంటున్నారు. పార్టీ చరిత్రను లోతుగా పరిశీలిస్తే జయ విధేయులెవరూ శశికళను అన్నాడిఎంకె సారధిగా అంగీకరించేది లేదని వాదిస్తున్న సీనియర్ల సంఖ్య తక్కువేమీ కాదు. గతంలో రెండు సార్లు పార్టీ నుంచి శశికళను జయ బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ ఏ పదవినైనా చేపట్టే సామర్ధ్యం కలిగిన వారికి కొదవ లేదని..అయినా పార్టీ కొత్తసారధి ఎంపిక అంత తేలిగ్గా జరిగేది కాదది, చర్చోపచర్చల అనంతరమే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందంటున్నారు. మొత్తం మీద పార్టీ సారధి ఇక శశికళేనన్న ప్రచారం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. ఎవరు ఈ పదవిని చేపట్టినా.. వారి అసలు సత్తా ఎన్నికల్లోనే తేలుతుందని, అమ్మ స్థాయి సామర్ధ్యాన్ని ఎవరి నుంచీ ఆశించలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పాతతరానికి చెందిన ఎస్ రామచంద్రన్ సహా అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే వీరిలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా లేక శశికళే చక్రం తిప్పుతారా అన్నది అంతుబట్టడం లేదు. అమ్మ వారసత్వం అధికార పార్టీలో ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా అలుముకుంటోంది.

చిత్రాలు..జయలలిత, శశికళ