జాతీయ వార్తలు

గుట్టలుగా నోట్ల కట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/తిరుపతి, డిసెంబర్ 8: ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారం చెన్నైలో టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసి సుమారు 120 కోట్ల రూపాయల విలువైన పాత, కొత్త నోట్లు, బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక స్టార్ హోటల్ రూమ్ సహా ఈ ముఠాకు చెందిన ఎనిమిది ప్రాంతాలపై అధికారులు దాడులు జరిపారు. పారిశ్రామికవేత్తలు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, వారి ఏజంట్ ప్రేమ్‌రెడ్డిలకు చెందిన ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు ఐటి అధికారి ఒకరు చెప్పారు. శేఖర్ రెడ్డి తిరుమల, తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడే కాకుండా అధికార అన్నా డిఎంకె పార్టీ నేత కూడా. అధికారులు స్వాధీనం చేసుకున్న 90 కోట్ల నగదులో 80 కోట్లు రద్దయిన పాత వెయ్యి, 500 రూపాయల నోట్లు కాగా, పది కోట్లు కొత్తగా ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోట్లు. 30 కోట్ల రూపాయల విలువైన 100 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రేమ్‌రెడ్డి బంగారు కడ్డీలకు పాత నోట్లను మార్పిడి చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం మిగతా ఇద్దరి నివాసాలపై దాడులు చేశారు. నగరంలోని టి.నగర్‌లో ఉన్న శేఖర్ రెడ్డికి చెందిన ఇంట్లో 6 కోట్ల విలువైన కొత్త 2వేల రూపాయల నోట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. తేనాంపేటలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లోని ఒక రూమ్‌లో సోదా జరిపి సుమారు 70 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. తమ అనుచరులకోసం శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఈ రూమ్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది.
దాడుల సందర్భంగా లభించిన సమాచారం, ఆధారాల సాయంతో ఆదాయం పన్ను అధికారులు నగరంలోని కొన్ని బంగారం నగలషాపుల్లో సైతం ఎంక్వయిరీలు చేశారు. ఓవైపు బ్యాంకులనుంచి నగదు విత్‌డ్రాలపై పరిమితులు ఉండగా, మరోవైపు నగదు విత్‌డ్రాల కోసం జనం ఎటిఎంలు, బ్యాంకుల ముందు క్యూలలో గంటలకొద్దీ నిలబడుతూ ఉంటే, పది కోట్ల రూపాయల విలువైన కొత్త 2 వేల రూపాయల నోట్లు వీళ్లకు ఎలా వచ్చాయనేదానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఐటి అధికారులు చెప్పారు. బహుశా కొంతమంది బ్యాంకు అధికారులకు కూడా ఈ రాకెట్‌తో సంబంధాలుండి ఉంటాయని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. శేఖర్ రెడ్డికి తమిళనాడులో పలువురు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నట్లుతెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇటీవల తిరుమల వచ్చినప్పుడు సైతం శేఖర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. గత కొనే్నళ్లుగా ఆయన రాష్టవ్య్రాప్తంగా మైనింగ్, ఇసుక తవ్వకం వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన రాష్ట్రంలో వెయ్యి కోట్లకు పైగా విలువైన కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్రం..టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి