జాతీయ వార్తలు

అసలు ఆలోచించారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో కరెన్సీ కొరత హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ధోరణిపై సుప్రీం కోర్టు నిప్పులు చెరిగింది. ఏ ఉద్దేశంతో కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేశారు? అసలు దీనికో ప్రాతిపదిక అంటూ ఉందా? ఎంత కాలంలో సమస్య పరిష్కారం అవుతుందని భావించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అంతే కాదు..పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకున్నదే తడవుగా చేసేశారా లేక సమస్య తీవ్రతను ఊహించి బుర్రపెట్టి ఆలోచించే తీసుకున్నారా అంటూ అంటూ నిలదీసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం యావత్ భారతాన్నీ కుదిపేసిందని, ప్రజలు పడుతున్న కష్టాల్ని తీర్చేందుకు అన్ని చర్యల్ని ప్రభుత్వం తీసుకుని తీరాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 500, 1000 నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా వారాలతరబడి కోటానుకోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం విచారణకు చేపట్టిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘పెద్ద నోట్లను ఉన్నపళంగా రద్దు చేయాలన్న నిర్ణయానికి ముందు ప్రభుత్వం ఏఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది..పాత కరెన్సీని ఎప్పటిలోగా కొత్త కరెన్సీతో భర్తీ చేయగలనని భావించింది..సామాన్యుడికి దీని వల్ల ఎదురయ్యే కష్ట, నష్టాల్ని తీర్చేందుకు ఎలాంటి చర్యల్ని ప్రతిపాదించింది..’అంటూ ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వారానికి కనీసం 24 వేలు ఉపసంహరించుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ చెప్పినప్పటికీ ఎందుకు పరిమితులు విధిస్తున్నారని ప్రశ్నించింది. వారానికి 24 వేలు కూడా ఇవ్వలేరా? అని సూటిగా అంటూ నిలదీసింది. అలాగే కొన్ని కటినమైన నిబంధనలతో జిల్లా సహకార బ్యాంకులను రద్దయిన పెద్ద నోట్లను అంగీకరంచడానికి ఎందుకు అనుమతించకూడదో చెప్పాలని కోరింది. కేంద్రం తరఫున హాజరయిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి పలు ప్రశ్నలు సంధించింది. కొత్త కరెన్సీ లేకపోవడం వల్లో లేక క్యూల్లో నిలబడో అనేక మంది మరణించారంటూ వచ్చిన కధనాలను రోగత్గీ తిరస్కరించడంతో సుప్రీం ధర్మాసనం మరింతగా మండిపడింది. ‘అసలు ఈ విధానాన్ని రూపొందించే ముందు దాని వల్ల తలెత్తే సమస్యలపై దృష్టి పెట్టారా’అని ప్రశ్నించింది. ముఖ్యంగా ఎంత మేరకు కరెన్సీని ముద్రించాలో, అసలు సమస్యను ఎలా ఎదుర్కోవాలో’అలోచించారా అని రోహత్గీని అడిగింది. ఇంత భారీ పరిమాణంలో కరెన్సీని రద్దు చేసినప్పుడు ఎంత కాల వ్యవధిలోగా ఈ సమస్యను పరిష్కరించగలుగుతామన్న ఆలోచనైనా ప్రభుత్వానికి ఉందా అంటూ నిప్పులు చెరిగింది. దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యంతో నోట్ల రద్దు కొనసాగించినప్పటికీ, ప్రజలు తక్షణం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే తమ ఆందోళన అంతా అని వ్యాఖ్యానించింది. జిల్లా సహకార బ్యాంకులకు సంబంధించిన అంశంపైన, అలాగే ఆర్‌బిఐ నిర్ణయించిన వారానికి 24 వేల రూపాయల నగదు విత్‌డ్రాలను అనుమతించాలన్న ఆర్‌బిఐ ఆదేశాలను బ్యాంకులు ఎందుకు పాటించడం లేదో ఈ నెల 14న తమకు తెలియజేయాలని బెంచ్ అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. కాగా, నోట్ల రద్దు కోసం నవంబర్ 8న నోటిఫికేషన్ ఏ చట్టం కింద జారీ చేశారో ఆ చట్టానే్న సవాలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయపరమైన ప్రశ్నావళిని రూపొందించాలని బెంచ్ ఆదేశించింది. అంతేకాకుండా అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించాలా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్‌లు కూడా ఉన్న బెంచ్ రోహత్గిని కోరింది. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ కోర్టుల్లో జరుగుతున్న విచారణలను నిలిపివేయాలని, వాటినన్నిటినీ విచారించడానికి ఒక హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కేంద్రం పిటిషన్‌పై ఈ నెల 14న తమ నిర్ణయం ప్రకటిస్తామని బెంచ్ తెలిపింది. కాగా, విచారణ సందర్భంగా లాయర్లు గట్టిగా ఒకరిపై ఒకరు అరచుకోవడం పట్ల బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.