జాతీయ వార్తలు

అవినీతికి వాళ్లే దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అవినీతిపరులకు విపక్షాల్లోని చాలామంది నేతలు దన్నుగా నిలుస్తోన్న విషయం పెద్ద నోట్ల రద్దుతో వెల్లడైందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందని ఆరోపిస్తూ, శీతాకాల సమావేశాలను స్తంభింపజేసిన ప్రతిపక్షాలను చీల్చి చెండాడారు. రాజకీయ స్వార్థం కోసం 1971లో ప్రధాని ఇందిర నోట్ల రద్దు ప్రతిపాదనను తిరస్కరించారని ఆక్షేపించారు. అప్పటి ఆర్థిక మంత్రి వైబి చవాన్ చేసిన ప్రతిపాదనను ఇందిర తిరస్కరిస్తూ, కాంగ్రెస్ ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారంటూ మోదీ ఒక పుస్తకాన్ని ఉటంకించారు. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోకుండా దేశాన్ని దెబ్బ తీశారని మోదీ దుయ్యబట్టారు. దేశంలో పెద్దఎత్తున పన్ను ఎగవేత, అక్రమాస్తుల సంపాదన జరుగుతోందని, దీన్ని అరికట్టాల్సి ఉందని 1991లో మన్మోహన్ హెచ్చరించటం మరిచారా? అని కాంగ్రెస్‌ను నిలదీశారు. కాంగ్రెస్‌కు పార్టీ ముఖ్యంతప్ప దేశం కాదని, భాజపాకు దేశం ముఖ్యంకాని పార్టీ కాదన్నారు. 1998లోనే బినామీ ఆస్తుల చట్టాన్ని చేసినా, దాన్ని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్‌ను నిలదీశారు. ఎన్డీయే సర్కారు త్వరలోనే ఆ చట్టాన్నీ ఆచరణలోకి తెస్తుందని ప్రకటించారు. బినామీ చట్టం అమలు చేసిన వెంటనే మళ్లీ ప్రతిపక్షం గొడవ చేస్తుందని ప్రధాని వ్యంగ్య బాణాలు వేశారు.
కమ్యూనిస్టులు పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని దుయ్యబట్టారు. వాంఛూ కమిటీ నివేదికపై కమ్యూనిస్టు సీనియర్ నేతలు అప్పటి పార్లమెంట్‌లో ఏం చెప్పారనేది ప్రస్తుత నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. నోట్ల రద్దు వెనుక అవినీతిని తుదముట్టించే పెద్ద పథకం ఉందని, ఆ నిర్ణయాలూ త్వరలోనే వెలుగులోకి వస్తాయని హెచ్చరించారు. 50 రోజుల వ్యవధి పూర్తికాగానే కరెన్సీ ఇబ్బందులు తగ్గుతాయని భరోసా ఇచ్చారు.
గతంలోనూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిష్ఠంభన తలెత్తిన సంఘటనలు ఉన్నాయన్నారు. అయితే, ‘అప్పట్లో కుంభకోణాలు, అవినీతిపై ప్రతిపక్షమంతా ఒక్కటై పోరాడేది. ఈసారి అందుకు భిన్నం. నోట్ల రద్దుపై అవినీతిపరులకు దన్నుగా నిలుస్తూ పార్లమెంట్‌ను విపక్షాలు స్తంభింపచేశాయి’ అని ఆరోపించారు. గతంలో అవినీతిపరులకు దొంగచాటుగా మద్దతిచ్చి ఉండొచ్చు. కానీ, ఈసారి బహిరంగంగా జరుగుతోందని విపక్షాలను దుమ్మెత్తిపోశారు. పాకిస్తాన్‌ను భారత సైన్యం ఎలా ఓడించిందని అప్పట్లో ప్రతిపక్షం సాక్ష్యం అడగలేదు. ఇప్పుడు మెరుపుదాడులకు సాక్ష్యాలు అడుగుతున్నాయి. ఇదీ తాజా రాజకీయం అని మోదీ ఎద్దేవా చేశారు. నల్లధనం, అవినీతిపై పోరాటానికి మద్దతిస్తున్న ఒడిశా, బీహార్ సిఎంలు నవీన్ పట్నాయక్, నితీష్‌కుమార్‌లను అభినందించారు. అవినీతిని నిర్మూలించేందుకు వారితో కలిసి మరిన్ని ధైర్యమైన నిర్ణయాల తీసుకుంటామన్నారు. నల్లధనం, అవినీతి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు. రిక్షావాడు తప్పు చేయడు. అన్నీ తెలిసిన వాడే తప్పుచేస్తాడని మోదీ చమత్కరిస్తూ, తెలిసి తప్పుచేసే వారిని డిజిటల్ వ్యవస్థలోకి లాక్కురావాల్సి ఉందన్నారు. డిజిటల్ టెక్నాలజీతో అవినీతిని అదుపు చేయవచ్చన్న ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీల టర్నోవర్ ఆధారంగా వ్యాపారస్తుల పాత రికార్డులు తవ్వి తీయొద్దని అధికారులకు, పాత రికార్డులు తిరగేయవద్దని కార్మిక శాఖకూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇక అధికారుల రాజ్యం ఉండదని మోదీ స్పష్టం చేస్తూ, అన్యాయాల నుంచి ప్రజలు, వ్యాపారస్తులకు డిజిటల్ వ్యవస్థ రక్షణ కల్పిస్తుందన్నారు. డిజిటల్ వ్యవస్థ అంటే నోట్ల సంఖ్యను తగ్గించటం కాదు, కొత్త జీవన విధానానికి పునాధి వేయటమని ప్రధాని మోదీ ఉద్భోదించారు.

చిత్రం..దేశంలోని రైతాంగ సమస్యలపై ప్రధాని మోదీతో సమావేశమైన కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలు