జాతీయ వార్తలు

పార్లమెంటు తీరుపై అద్వానీ ఆవేదనను అర్థం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 17: పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకు పోవడంతో శివసేన తన మిత్రపక్షమైన బిజెపిని తీవ్రంగా తప్పుబడుతూ, పార్టీకి పితామహుడైన ఎల్‌కె అద్వానీ ‘కన్నీళ్ల’ను పరిగణనలోకి తీసుకోవాలని, నోట్ల రద్దుపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీకి సలహా ఇచ్చింది. భారతీయ రాజకీయాల్లో అద్వానీ భీష్ముడిలాంటి వారని శివసేన అంటూ, దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఆయన అనేక ప్రశ్నలు లేవెత్తారని పేర్కొంది. ‘అద్వానీ కాంగ్రెస్ నాయకుడు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో ఆయన ముందు వరసలో ఉన్న విషయాన్ని కూడా ఎవరూ మరిచిపోకూడదు’ అని శివసేన పత్రిక ‘సామ్నా’ ఒక సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 2014 మేలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టే ముందు మెట్లపై మోకరిల్లి కన్నీళ్లు కార్చిన విషయాన్ని ఆ సంపాదకీయం గుర్తు చేసింది. అయితే గత రెండేళ్లలో పార్లమెంటు కార్యకలాపాల ‘తమాషా’ కారణంగా, పార్లమెంటు భవనం హృదయం క్షోభిస్తోందని ఆ సంపాదకీయం పేర్కొంది. ‘పార్లమెంటు అంటే ప్రజలకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను చర్చించడానికి ఉన్న వేదిక. అయితే ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తి గొడవ సృష్టిస్తే ప్రభుత్వం ఈ సమస్యలనుంచి పారిపోతోంది. ఇదీ ఇప్పుడున్న దృశ్యం’ అని శివసేన ఆ సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. వెయ్యి, రెండు వేలకోసం జనం క్యూలలో గంటల కొద్దీ నిలబడుతూ ఉంటే, సంపన్నుల ఇళ్లలో కోట్ల సంఖ్యలో పింక్ (2 వేల రూపాయల కొత్త) నోట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్‌బిఐ గవర్నర్‌ను పార్లమెంటుకు పిలిపించాలని ఆ సంపాదకీయం వ్యాఖ్యానించింది.

వైగోకు చేదు అనుభవం

చెన్నై, డిసెంబర్ 17: డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధిని పరామర్శించేందుకు కావేరి ఆస్పత్రికి వెళ్లిన డిఎండికె అధినేత వైగోకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రి వద్దకు వచ్చిన వైగోను అక్కడున్న డిఎంకె కార్యకర్తలు అడ్డుకొని ’వైగో గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వైగోవెంట ఉన్న డిఎండికె కార్యకర్తలకు, డిఎంకె కార్యకర్తలకు మధ్య వాగ్యుద్ధం మొదలుకావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో వైగో ఇరుపక్షాలకు సర్దిచెప్పి కరుణానిధిని పరామర్శించకుండానే వెనుదిరిగారు. శనివారం అన్నాడిఎంకె నేతలు ఎం తంబిదురై, డి విజయ్‌కుమార్‌లు కావేరి ఆస్పత్రికి వెళ్లి కరుణానిధి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి బాగానే ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, అన్నాడిఎంకె శ్రేణులు తమకు చెప్పారని, అది సంతోషకరమైన వార్త అని ఆ నేతలు విలేఖరులతో చెప్పారు. అన్నాడిఎంకె తరఫున, పార్టీ పగ్గాలు చేపట్టనున్న చిన్నమ్మ శశికళ తరఫున తాము ఇక్కడికి వచ్చినట్లు వారు చెప్పారు.

ఉన్న చట్టాలు చాలు
పార్టీలకు పన్ను మినహాయింపుపై సిబిడిటి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలను పరీక్షించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల్లోని నిబంధనలు పూర్తిగా సరిపోతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ పార్టీలకు కోట్ల కోద్దీ వస్తున్న విరాళాలపై కమిషన్ వేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన నేపథ్యంలో సిబిడిటి ఈ ప్రకటన విడుదల చేసింది. పార్టీలకు వచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను చట్టంలోని 13ఏ నిబంధన ప్రకారం పరిశీలన చేయవచ్చని స్పష్టం చేసింది. ‘‘రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాలను పరీశీలించేందుకు ఆదాయపు పన్ను చట్టంలోని ప్రస్తుత నిబంధనలు అన్ని అవకాశాలూ కల్పిస్తున్నాయి. కేవలం రిజిస్టర్ అయిన పార్టీలకు కొన్ని విరాళాలపై షరతులతో కూడిన పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాదు, అన్ని పార్టీలు తమకు అందుతున్న విరాళాలకు సంబంధించి అన్ని రకాల రికార్డులను కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. రూ.20వేలకు మించి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చిన వారి పేరు, అడ్రస్‌లను కచ్చితంగా రికార్డు చేయాల్సి ఉంటుంది.’’ అని సిబిడిటి పేర్కొంది.
అన్ని రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్‌తో తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఆడిటింగ్ చేయించాల్సి ఉంటుందని సిబిడిటి వివరించింది. తమకు అందిన విరాళాలకు సంబంధించిన నివేదికను రాజకీయ పార్టీలు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుందని సిబిడిటి స్పష్టం చేసింది.