జాతీయ వార్తలు

రైల్వే ఇక వ్యాపారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: రైల్వే బడ్జెట్‌లో ఇకమీదట జనాకర్షణ పథకాలకు తావుండదు. ప్రయాణానికి తగిన చార్జీలు ప్రయాణికులు చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. భారత రైల్వేల్లో సంస్కరణలు అనే అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఈ ప్రకటన చేశారు. 90ఏళ్ల తరువాత తొలిసారి జనరల్ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించనున్న జైట్లీ, రైల్వే వ్యవస్థలో పెను మార్పులకు సంకేతాలిచ్చారు. రైల్వే నుంచి సేవల విభాగాన్ని వేరు చేస్తామని పరోక్షంగా సూచించారు. ‘రైల్వే శాఖ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు అవసరమైన సేవలు బయటినుంచి తీసుకోవటం మంచిది’ అని ప్రతిపాదించారు. రైల్వేలో పలు సంస్కరణలు అమలు చేయనున్నట్టు చెబుతూ, కొత్త వ్యవస్థకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే పాలన మొదలైన రెండేళ్లలో జనాకర్షణ పథకాలకు తావు లేకుండా పోయిందని జైట్లీ అన్నారు. జనాకర్షణ పథకాలకు మోదీ వ్యతిరేకమని అంటూనే, ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ అనుగుణమైన పథకాలు రూపొందించుకుంటున్నామని అన్నారు. ‘రైల్వేలు పోటీ ప్రపంచంలో ఉన్నాయి. విమానయానంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ రంగాల నుంచి తీవ్ర పోటీ ఉన్న తరుణంలో రైల్వేలు సమర్థంగా పని చేయాలి. జనాకర్షణ పథకాలకు తావివ్వకూడదు’ అని జైట్లీ స్పష్టం చేశారు. నగదు కొరత ఉన్నా విమానయానం పెరుగుతోందని అంటూనే, రైల్వేలనూ ఆ స్థాయికి తేవాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ది చేయొచ్చని ప్రకటించారు. రైల్వే స్టేషన్లు వాణిజ్య కేంద్రాలు కావాలని, స్టేషన్లలో వౌలిక సదుపాయాలతోపాటు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రైల్వే ఆస్తుల నుంచి ఆదాయాన్ని సంపాదించాలని, వాటిని వాణిజ్యపరంగా తీర్చిదిద్దాలన్నారు. ‘క్రమశిక్షణారాహిత్యం, జనాకర్షణ పథకాలతోనే మనం వ్యవస్థలను చెడగొట్టుకున్నాం. ఇకమీదట ఇలా జరుగకూడదు’ అని జైట్లీ అభిప్రాయపడ్డారు. రైల్వే శాఖ సేవల సంస్థగా మారి వాణిజ్యపరంగా మంచి ఫలితాలు సాధించటం ద్వారా ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించాలన్నది మోదీ లక్ష్యమని అరుణ్ జైట్లీ తెలిపారు. రైల్వేలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రైల్వే లెక్కల వ్యవస్థ హెల్త్ కార్డు లాంటిది. ఇది వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలకూ అద్దంపట్టాలని ఆయన సూచించారు.

చిత్రం..రైల్వే ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్థిక గణాంక వివరాల పట్టికను విడుదల
చేస్తున్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు