జాతీయ వార్తలు

పరిశుభ్రతకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశంలోని ప్రజారోగ్య కేంద్రాల లోపల చుట్టుపక్కల అత్యుత్తమమైన పరిశుభ్రమైన వాతావరణం, ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే అలవాట్లను ప్రోత్సహించడానికి కేంద్రం గురువారం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్వచ్ఛ్, స్వాస్థ్ సర్వత్ర’గా పిలవబడే ఈ కార్యక్రమం కింద దేశంలోని 708 బహిరంగ మల విసర్జన రహిత బ్లాక్‌లలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కోదానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖతో కలిసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖలను కోరారని, ఈ కార్యక్రమం ప్రారంభం ఆ దిశగా ఓ ముందడుగని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా చెప్పారు. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించిన దేశంలోని 708 బ్లాక్‌లలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు కాయకల్ప ప్రమాణాలకు చేరుకోవడానికి వీలుగా అవి అత్యున్నత స్థాయి స్వచ్ఛత, పారిశుద్ధ్య ప్రమాణాలు సాధించడానికి వీలుగా వాటిని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నడ్డా చెప్పారు. అంతేకాదు కాయకల్ప అవార్డులు పొందిన పిహెచ్‌సిలున్న గ్రామ పంచాయతీలు నూరుశాతం బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తయారవడానికి తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ ఆ పంచాయతీలకు తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఆయా ప్రాంతాలు, ఆరోగ్య కేంద్రాలు అత్యున్నత స్థాయి పారిశుద్ధ్య ప్రమాణాలు సాధించడానికి ఈ ఆర్థిక సహాయం ఒక ప్రోత్సాహకంగా పని చేస్తుందని ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో కలిసి నడ్డా ‘స్వాస్థ్ బచ్చా స్వాస్థ్ భారత్’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం, పరిశుభ్రత ప్రాధాన్యతకు సంబంధించిన టిప్స్‌ను తెలియజేసే బొమ్మలు ఉంటాయి. పరిశుభ్రత సాధించడం అంటే వౌలిక సదుపాయాలు కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే కాదని, పరిశుభ్రత పట్ల జనం మనోభావాలు, అలవాట్లలో మార్పు తీసుకు రావడం ద్వారా దీన్ని సాధించవచ్చని జావడేకర్ అన్నారు.
సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 నాటికి భారత దేశాన్ని బహిరంగ మల విసర్జన దేశంగా మార్చడమనే లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటుగా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమనే రెండు లక్ష్యాలను సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇన్‌ఫెక్షన్ నియంత్రణసహా వివిధ ప్రమాణాల ఆధారంగా ప్రజారోగ్య కేంద్రాలకు అవార్డులు ఇవ్వడానికి గత ఏడాది మేలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాయకల్ప అవార్డు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

చిత్రం..‘స్వచ్ఛ్, స్వాస్థ్ సర్వత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, జెపి నడ్డా