జాతీయ వార్తలు

వెనక్కి తగ్గిన పెట్రో డీలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో సోమవారంనుంచి క్రెడిట్, డెబిట్ కార్డులపై లావాదేవీలు నిలిపి వేయాలన్న నిర్ణయాన్ని పెట్రో డీలర్లు వాయిదా వేసుకున్నారు. కార్డు చెల్లింపులపై ఒకశాతం అదనపు చార్జీ వసూలుకు నిరసనగా ఆదివారం అర్ధరాత్రినుంచే కార్డు లావాదేవీలను నిలిపివేస్తామని తొలుత హెచ్చరించిన డీలర్లు కేంద్ర ప్రభుత్వం జోక్యంతో అయిదు రోజుల పాటు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 13తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటించారు. అంతకుముందు రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన పెట్రోలియం డీలర్ల రాష్ట్ర స్థాయి సమావేశం తర్వాత ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు చార్జీలను పెట్రోలియం డీలర్లనుంచి వసూలు చేయాలన్న బ్యాంకుల నిర్ణయానికి నిరసనగా కార్డు లావాదేవీలను నిలిపివేస్తామని హెచ్చరించారు. పెట్రోలియం డీలర్లకు 2-3 శాతం మాత్రమే కమిషన్ వస్తుందని, అందులోనుంచి అదనపు చార్జీలను వసూలు చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. దీన్ని భరించడం తమ వల్ల కాదని, అందువల్ల క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించడం నిలిపివేయడం తప్ప తమకు మరోదారి లేదని ఆయన చెప్పారు. మీరు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు కదా అని అడగ్గా, క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించడం నిలిపివేయడం తప్ప తమకు వేరే దారి లేదని బన్సల్ చెప్పారు. తమ నిర్ణయాన్ని పెట్రోలియం, ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే పేటిఎం, భీమ్ యాప్‌ల ద్వారా చెల్లింపులను అంగీకరిస్తామని ఆయన చెప్పారు. పేటిఎంను అంగీకరించే పెట్రోలు బంకులు దేశంలో 28 వేల దాకా ఉన్నాయి. అయితే వాళ్లు కూడా అదనపు చార్జీలను విధించినట్లయితే వాటిని కూడా ఆపేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 13దాకా అదనపు చార్జీ వసూలు ఉండదని స్పష్టం చేయటంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.