జాతీయ వార్తలు

చర్చలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: విభజన చట్టం 10వ షెడ్యూల్‌లోని 107 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపకాలపై కేంద్రం వద్ద జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర సీనియర్ అధికారులతో హోంశాఖ అదనపుకార్యదర్శి జయదీప్ గోవింద్ జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అవిభాజిత రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పులు, నగదును జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ప్రాతిపదికనే 10 షెడ్యూలులోని ఇతర అన్ని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీ జరగాలని ఆంధ్ర వాదించగా, ఇది తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని తెలంగాణ స్పష్టం చేసింది. జయదీప్ గోవింద్ అధ్యక్షతన హోంశాఖలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీనియర్ అధికారులు బాలసుబ్రమణ్యం, ప్రేంచంద్ రెడ్డి, ఢిల్లీ ఏపి భవన్ కమిషనర్ సింఘాల్ , తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ కమిషనర్ అరవింద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు టెన్త్ షెడ్యూల్‌లోని అన్ని సంస్థలను రెండు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని కుటుంబ రావు వాదించగా, ఎస్పీ సింగ్ వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు తీర్పు కేవలం అవిభాజిత ఉన్నత విద్యా మండలి ఆస్తి అప్పుల పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని, సుప్రీంకోర్టు ఎక్కడ కూడా తమ తీర్పు టెన్త్ షెడ్యూల్‌లోని 107 సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేయలేదని వాదించారు. అందుకే మిగతా సంస్థల పంపకానికి ఈ పద్ధతిని అవలంభించలేమని వాదించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 75వ సెక్షన్ ప్రకారం వివిధ సంస్థలకు సంబంధించిన స్థిరాస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే అవి వారికే చెందుతాయని ఆయన చెప్పారు. నగదు పంపిణీ విషయంలోనే జనాభా ప్రాతిపదిక పద్ధతిని అవలంభించేందుకు వీలున్నదని సింగ్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యా మండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని సంస్థలకూ వర్తింపచేయాలని కోరినట్టు కుటుంబరావు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తెలంగాణలోని అన్ని సంస్థలు తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదించిందని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం (52:48) టెన్త్ షెడ్యూల్‌లోని ఆస్తులను విభజించాలని కేంద్రానికి విన్నవించినట్టు కుటుంబరావు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జయదీప్ గోవింద్ ఇరుపక్షాల వాదనలను లిఖిత పూర్వకంగా అందించాలని సూచించారన్నారు. టెన్త్ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాలు తమ వాదనలను పది రోజుల్లో లిఖిత పూర్వకంగా కేంద్రానికి అందచేయాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలు లిఖిత పూర్వకంగా ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసిన అనంతరం కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది.