జాతీయ వార్తలు

తప్పనిసరైతే మళ్లీ ‘సర్జికల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పరిస్థితి తీవ్రమైతే తదుపరి దాడులు అనివార్యంగా మారితే మరోసారి ఆధీనరేఖ ప్రాంతంలో లక్షిత దాడులు జరపడానికి తాము వెనకాడేది లేదని ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ పాక్‌ను హెచ్చరించారు. పరిస్థితులు విషమిస్తే భారత్ ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి లక్షిత దాడులు నిదర్శనమన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితే ఏర్పడితే ఈసారి మరింత తీవ్ర స్థాయిలోనే సర్జికల్ దాడులు చేస్తామని శుక్రవారం ఇక్కడ మీడియాకు చెప్పారు. ఆర్మీ చీఫ్‌గా తొలిసారిగా మీడియా భేటీలో మాట్లాడిన రావత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనలు తగ్గాయని పేర్కొన్నారు. అయితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తే మాత్రం సర్జికల్ దాడులు అనివార్యమే అవుతాయని తెగేసి చెప్పారు. భద్రతాదళాల మధ్య కొనసాగిన సమన్వయం కారణంగానే కాశ్మీర్‌లో పరిస్థితిని అదుపులోకి తేగలిగామని ఆయన వెల్లడించారు. లక్షిత దాడులను ఏ సందర్భంలో జరుపుతారన్న విషయాన్ని వెల్లడించిన ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందుకు దారితీసిన పరిస్థితులను అవగతం చేసుకోవల్సి ఉంటుందని తెలిపారు. ఈ తరహా చర్యలు తీసుకున్నా పొరుగుదేశం నుంచి సరైన ప్రతిస్పందన రాకపోతే ఉద్దేశపూర్వకంగానే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లోనే లక్షిత దాడులు తప్పనిసరి అవుతాయని బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. భద్రతాపరంగా భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ఆయన సరిహద్దుల్లో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, ఉగ్రవాద పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మీ ఇబ్బందులు నాకు చెప్పండి
సాయుధ దళాల్లో తాము పడుతున్న కష్టాలను సైనికులు సామాజిక మాద్యమాల్లో ఏకరవుపెడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ‘మీకు ఏమైనా ఇబ్బందులుంటే పై అధికారులను ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేయిండి. సోషల్ మీడియాలో కంటే ఇక్కడే సరైన పరిష్కారం దొరుకుతుంది’అని రావత్ శుక్రవారం స్పష్టం చేశారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు మంచి యంత్రాంగం ఉందని ఏమైనా ఇబ్బందులుంటే అంతర్గతంగా చర్చించుకోవచ్చని ఆయన అన్నారు.‘ర్యాంక్‌తో నిమిత్తం లేకుం డా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నా వద్ద దృష్టికి తీసుకురండి. సత్వరం స్పందించి వాటిని అధిగమించుదాం’ అని రావత్ విజ్ఞప్తి చేశారు. అంతేతప్ప సామాజిక మాద్యమాలకు ఎక్కడం సరైంది కాదని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ సిబ్బందికి ఈమేరకు పలు సూచనలు చేశారు. బిఎస్‌ఎఫ్ జవాన్ ఒకరు దళాల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో ఏకరువుపెట్టాడు. నాసిరకం ఆహారం అందిస్తున్నారని, సరైన సదుపాయాలు ఉండడం లేదని ఫేస్‌బుక్‌లో అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. బిఎస్‌ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఈనెల 8న సామాజిక మాద్యంలో పోస్టుచేసిన వీడియో ఆర్మీలో కలకలం రేపింది. ‘మేం ఏ ప్రభుత్వాన్నీ తప్పుపట్టడం లేదు. మాకు అవసరమైన అన్నింటినీ ప్రభుత్వం సమకూర్చుతోంది. ఆహార పదార్ధాల దగ్గర నుంచి సరుకులను సీనియర్ అధికారులు కొందరు అమ్మేసుకుంటున్నారు. దీంతో ఖాళీ కడుపులతోనే శిబిరాల్లో గడపాల్సి వస్తోంది’ అని తేజ్ బహదూర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
యాదవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ దీనిపై తీవ్రంగానే స్పందించారు. తక్షణం దీనిపై విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. భద్రతాదళాలకు చెందిన పలువురు తమ బాధలపై సోషల్ మీడియాకు ఎక్కడంపై కేంద్రం తీవ్రంగానే పరిగణించింది.