జాతీయ వార్తలు

ఎత్తుకు పైఎత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 17: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ వేగంగా మారిపోతున్నాయి. అధికార సమాజ్‌వాది పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొనటం, ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గాన్ని అసలైన సమాజ్‌వాదిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి, సైకిల్ గుర్తునూ ఆయనకే కేటాయించటంతో ప్రధాన పక్షాలైన బిజెపి, బిఎస్‌పీలు కొత్తగా తమ వ్యూహాన్ని రచించుకోవలసిన అవసరం ఏర్పడింది. ములాయం, అఖిలేశ్‌ల మధ్య అంతర్గత కుటుంబ సమస్యను సొమ్ము చేసుకోవటానికి రెండు పార్టీలూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క సమాజ్‌వాది బలహీన పడటంతో బిజెపిని ఎదుర్కొనే బలమైన పార్టీగా బిఎస్పీ మాత్రమే మిగిలింది. అటు బిజెపి మాత్రం అభివృద్ధి, శాంతిభద్రతల అంశాలను ప్రధానంగా ఎన్నికల అంశంగా మారుస్తూ ఎన్నికల బరిలోకి దూసుకెళ్తోంది.
రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో కనీసం 125 స్థానాల్లో ముస్లింలదే నిర్ణయాత్మకమైన పాత్ర. ఇంతకాలం సమాజ్‌వాది పార్టీకి బలమైన సంప్రదాయ ఓటుబ్యాంకుగా ముస్లింలు దాని అస్తిత్వాన్ని నిలబెడుతూ వస్తున్నారు. ఇప్పుడు కుటుంబ కలహంతో పార్టీ రెండుగా చీలినట్లే ముస్లిం ఓటుబ్యాంకు కూడా రెండుగా విడిపోతే, దానివల్ల బిజెపికే లాభమన్నది ఎన్నికల నిపుణుల అంచనా. ఒకవేళ బిజెపిని ఓడించాలని బలంగా ముస్లింలు ఏకమయ్యే పరిస్థితే ఉంటే- వాళ్లు అఖిలేశ్, కాంగ్రెస్ కూటమి వెంటే వెళ్తారు తప్ప బిఎస్‌పి వైపు వెళ్లరని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 97 స్థానాల్లో మాయావతి ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చినప్పటికీ, ఆమె పాత రికార్డులను చూస్తే ముస్లింలు బిఎస్‌పిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. గతంలో అధికారంలోకి రావటానికి బిజెపితో ఆమె పొత్తు పెట్టుకున్న అవకాశవాదం ముస్లిం ఓటర్లలో బిఎస్పీ పట్ల వ్యతిరేకతకు కారణమయింది. అయితే మైనార్టీ ఓటు బ్యాంకును దక్కించుకోవడానికి మాయావతి క్రమం తప్పకుండా ఎస్పీని, బిజెపితో ముడిపెడుతూ విమర్శలు చేస్తున్నారు.
బిజెపి మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి లేమి, అధికార దుర్వినియోగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తమ పార్టీని గెలిపిస్తే ఉత్తర ప్రదేశ్‌ను ఉత్తమప్రదేశ్‌గా మారుస్తామని కూడా హామీ ఇస్తోంది. అయితే అఖిలేశ్‌కు పార్టీని, దాని గుర్తు సైకిల్‌ను కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశం బిజెపి, బిఎస్పీలకు కొంతవరకు ప్రతికూలతనే సృష్టిస్తుందని ఎన్నికల నిపుణులు విశే్లషిస్తున్నారు. యువ ఓటర్లు అఖిలేశ్‌వైపు మొగ్గు చూపితే దాని ప్రభావం ఈ రెండు పార్టీల విజయావకాశాలపై పడుతుందని అంచనా.