జాతీయ వార్తలు

హోదా పేరిట చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కైలాష్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశానికి మధ్య చిచ్చుపెట్టటం వల్ల రెండు పార్టీలకు జరిగే నష్టం ఏమీ లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కుంటుపడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కొందరు నాయకులు ప్రత్యేక హోదా పేరుతో ఆంధ్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటం శోచనీయమన్నారు. ఆంధ్రభూమికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై విస్తృతంగా మనసువిప్పి మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
ప్రశ్న : రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేంద్రం ‘ప్రత్యేక దృష్టి’ పెట్టిందన్న పేరుతో ఏపికి కలుగుతున్న ప్రయోజనం ఏపాటిది ?
వెంకయ్య: పధ్నాలుగో ఆర్థికసంఘం ప్రత్యేకహోదా ఇవ్వకూడదని సూచించ లేదు.అయితే నిధుల కేటాయింపులో ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు మధ్య ఎలాంటి తేడా ఉండకూడదని స్పష్టం చేసింది. దీనివల్ల హోదా ఉంటే ఎక్కువ నిధులు, లేకపోతే తక్కువ నిధులు కేటాయించే పరిస్థితి పోయింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడు ఒడిషా, పశ్చిమ బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాలు సమర్థించాయి. అయితే తమకూ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినప్పడు కూడా తొమ్మిది రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలంటూ మెలిక పెట్టాయి. దీంతో ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం అసాధ్యమైంది. అందుకోసమే ప్రత్యామ్నాయం వెతికాం. ప్రత్యేక దృష్టి పేరుతో ప్రత్యేక ప్యాకేజీ సాధించాం. ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం సదరు రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు 90శాతం నిధులిస్తుంది, లేకపోతే 60శాతం నిధులిస్తుంది. ఏపిపై పెట్టిన ప్రత్యేక దృష్టి మూలంగా రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాలన్నింటికీ 90శాతం నిధులు వస్తాయి. కేవలం ప్రత్యేక హోదాను అమలు చేస్తే రాష్ట్రానికి సాలీనా రూ.3,500 కోట్ల ప్రయోజనం మాత్రమే కలిగేది. ప్రత్యేక దృష్టి వల్ల ఏపికి సాలీనా దాదాపు రూ.2.5లక్షల కోట్ల ప్రయోజనం కలుగుతోంది.

ప్రశ్న: విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారా?
వెంకయ్య: మూడు హామీలు మినహా అన్నింటినీ అమలు చేశాం. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్శిటీ, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు మాత్రమే అమలు కాలేదు. సెంట్రల్ వర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి కేటాయింపు కాలేదు. ప్రత్యేక రైల్వే జోన్ వ్యవహారం కొంత జటిలంగా ఉంది. అయితే ఒడిషాతో ఇటీవల జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇస్తే ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటవుతుంది. ఏపికి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించటమే కాదు అవి వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నాం. భవనాలు పూర్తి అయ్యేంతవరకు వేచి చూడకుండా అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించి ఫలితాలను ప్రజలకు అందజేశాం. ఐఐటి, ఐఐఎం వంటి పది ఉన్నత విద్యా పరిశోధనా సంస్థల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఏపికి 950 మెడికల్ సీట్లు కేటాయించాం. 8 జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. వౌలిక సదుపాయాలు, రోడ్లు, హైవేలు కేటాయించాం. ఇంధన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాం. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ, స్థాయి పెంపు, మరమ్మతులు, కొత్తటర్మినల్ భవనం ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాం. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, వాణిజ్యం, పరిశ్రమల స్థాపన, కమ్యూనికేషన్, ఐటి, రక్షణ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. వైద్యం, ఆరోగ్యం, పెట్రోలియం, సహజవాయువు ఓడరేవులు, పర్యటన రంగంలో కూడా వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. అనంతపురం లాంటి వెనకబడిన జిల్లాల్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటంలో ప్రధాన లక్ష్యం అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే. ప్రతి జిల్లాకు ఒక విద్యా సంస్థ లేదా పరిశోధనా సంస్థ లేదా పరిశ్రమను కేటాయించాము. వీటి నిర్మాణం పూర్తికాగానే ఏపి ఒక్కసారిగా మారిపోతోంది.
విభజన సమయంలో ఏపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నేను రాజ్యసభలో పదేళ్లు కావాలని పట్టుపట్టాను. మారిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధ్యం కావటం లేదు కాబట్టి ఏపికి వీలున్నంత ఎక్కువ సహాయం అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నా. మైదానప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వరు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ తదితర పర్వత ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చిన పర్వత ప్రాంతాలు అభివృద్ధి సాధించలేదు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకబాటు కూడా ప్రాతిపాదిక కాదు, ఇదే నిజమైతే ఒడిషాకు ఎప్పుడో ప్రత్యేక హోదా లభించి ఉండాల్సింది.

ప్రశ్న : మీరు ఇంత చేస్తున్నా మీపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

వెంకయ్య: ఈ ప్రశ్నకు నాపై ఆరోపణలు చేస్తున్నవారే జవాబిస్తే బాగుంటుంది. ఈ ఆరోపణల వెనక ఒక రాజకీయ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతోంది. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కడే ఉంటే ఆయనను ఈపాటికి రాజకీయంగా దెబ్బ తీయగలిగే వారు. ఆయన వెంట కేంద్రం ఉంది.నేనున్నా. ఆయనను రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే ఎన్‌డిఏ, టిడిపిల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రత్యేక హోదా డిమాండ్‌ను వాడుకుంటున్నారు. ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వహిచటం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతిపక్షం లేదా ఇతర నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. రాష్ట్భ్రావృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయటం లేదని ఆరోపించవచ్చు. అది వారి హక్కు. వారి ఆరోపణలకు జవాబివ్వటం మా బాధ్యత. రాష్ట్భ్రావృద్ధికి మేమేం చేశామో అది చెప్తాం. ప్రజాస్వామ్యంలో ఇలాగే జరగాలి. అయితే రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.
ప్రశ్న: మీరు చెప్పేవి వాస్తవాలే అయినప్పుడు ప్రజలకు తెలియజేయటం ముఖ్యం కాదా?
వెంకయ్య : రెండు తెలుగు రాష్ట్రాలకు సేవ చేయటం తెలుగువాడిగా నా కర్తవ్యం,బాధ్యత. ఎవరు ఎంత విమర్శించినా తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేయటం మానను. నేనేదో రాజకీయ లబ్ధి కోసం ఇది చేయటం లేదు. తెలుగువాడిగా తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాను. బిజెపికి అధ్యక్షుడిగా పనిచేశాను, పలు మంత్రి పదవులు నిర్వహించాను కాబట్టి పార్టీ, ప్రభుత్వంలోని వారు నేనేం చెప్పినా చేస్తారు, దీనిని తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నాను. కొందరు ప్రతిపక్ష నేతలు ప్రత్యేక హోదా అంశంపై బంద్‌కు పిలుపు ఇచ్చినా ప్రజలు రాలేదు. నేను ఏపిలోని ముఖ్యమైన పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న సహాయం గురించి వివరించటం వల్ల ప్రజలకు వాస్తవాలు ఏమిటనేది అర్థమైంది.

ప్రశ్న : కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందనటం నిజమేనా?
వెంకయ్య: ఇది పూర్తిగా తప్పుడు వాదన. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా తెచ్చేందుకు ప్రయత్నించటం పూర్తిగా అర్థరహితం. తమిళనాడులో జల్లికట్టుకు ఏపి ప్రత్యేక హోదాకు ఏం సంబంధం? తమిళనాడులో జల్లికట్టును బిజెపి నిషేధించిందనటం ఏమిటి? జల్లికట్టును నిషేధింపజేసేంది డిఎంకె, కాంగ్రెస్ పార్టీలైతే ప్రధాని మోదీ ఇది చేయించారని ఎలా ఆరోపిస్తారు?
ప్రశ్న : ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు
వెంకయ్య : దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది, త్వరలోనే చట్టబద్ధత లభిస్తుంది.
ప్రశ్న : ప్రత్యేక హోదా కోసం వై.ఎస్.ఆర్.సి.పి ఉద్యమిస్తే తప్పేమిటి?
వెంకయ్య : తప్పేమీ లేదు, అయితే మెయిన్‌స్ట్రీం పార్టీలు పవిత్ర గణతంత్ర దినోత్సవం రోజు నిరసనవ్రతం చేపట్టకూడదు. దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదని వాదించే నక్సలైట్లు మాత్రమే గణతంత్ర దినోత్సవం లాంటి పవిత్ర దినాల్లో గొడవలు చేస్తారు. ఇదే విధంగా విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం ధర్నా చేపట్టట్టం అంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా లేవని చూపించేందుకు ప్రయత్నించటమే అవుతుంది. జల్లికట్టు అదుపు తప్పి సంఘవ్యతిరేక శక్తుల చేతిలోకి పోయినట్లు ఇక్కడ జరిగితే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి దారులు తిరిగి వెళ్లిపోరా? ప్రత్యేక హోదా వేరు, రాయితీలు వేరు. ఏపిలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన రాయితీలను కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఏపికి ఇచ్చిన రాయితీల గురించి ఎక్కువ మాట్లాడితే ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవద్దు, అసత్య ప్రచారం చేయవద్దు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.