జాతీయ వార్తలు

కళ తప్పిన శశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 11: తమిళనాడు సిఎం కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న వికె శశి‘కళ’ తప్పింది. ఆమె ఆకాంక్షకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. తిరుగుబాటు బావుటా ఎగరేసిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడం, నిన్న మొన్నటిదాకా తనకు విధేయులుగా ఉండిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరొక్కరుగా చేజారిపోతుండడంతో ఆమె ఆందోళన మరింత ఎక్కువైంది. శనివారం ఉదయం అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు విశ్రాంతి తీసుకుంటున్న గోల్డెన్ బే రిసార్ట్‌కు పోలీసులు వెళ్లి ఆరాలు తీయటం, అక్కడ పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు రావటంతో శశికళ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చేందుకు అనుమతివ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. వీలయినంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటుకు తనకు అవకాశమివ్వాలని కోరారు. ప్రమాణ స్వీకారం ఆలస్యం అయ్యే కొద్దీ సహనం సన్నగిల్లిపోతుందంటూ పరోక్ష హెచ్చరిక కూడా చేశారు. సాయంత్రం 35కు పైగా ఎస్‌యువి వాహనాలతో భారీ కాన్వాయ్‌తో తన ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్‌కు తరలివెళ్లటం ఒకరకమైన ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. మరోవైపు జయలలిత ఆదాయపు మించి ఆస్తులున్న కేసు సుప్రీం కోర్టులో సోమవారం లిస్ట్ కాలేదు. దీంతో గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఏం చేస్తారన్నదానిపై దేశం దృష్టి ఉంది. శనివారం ఉదయం నుంచి పన్నీర్ సెల్వం బలం గంటగంటకు పెరిగి పోతోంది. శనివారం ఉదయం రాష్ట్ర మంత్రి కె.పాండ్య రాజన్, ఇద్దరు ఎంపీలు పిఆర్ సుందరమ్, కె.అశోక్‌కుమార్ పన్నీర్ సెల్వం నివాసానికి వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించగా, సాయంత్రం పార్టీ సీనియర్ నాయకుడు, ఎంజి రామచంద్రన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన సి పొన్నయ్యన్, మరో మాజీ మంత్రి ఎంఎం రాజేంద్ర కుమార్, ఇద్దరు ఎంపిలు వి సత్యభామ, వనరోజా పన్నీర్ సెల్వంకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఉదయం నుంచే అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్స్‌కి పోలీసులు వచ్చి వారు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారా? లేక బలవంతంగా వచ్చారా అన్న దానిపై ఆరా తీశారు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాపై పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిసార్ట్‌లో ఉన్న 94మంది ఎమ్మెల్యేలలో సగం మంది తాము స్వచ్ఛందంగా అక్కడికి వచ్చినట్లు లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ వార్తలు బయటకు పొక్కటంతో కలవరం చెందిన శశికళ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను సిఎం ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కోర్టు కేసులు ప్రతిబంధకం అయ్యే పక్షంలో ముందుగా విధేయుడైన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించాక తాను సిఎం పగ్గాలు చేపట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం మధుసూదనన్‌ను పార్టీనుంచి బహిష్కరించిన తర్వాత అన్నాడిఎంకె ప్రిసీడియం అధ్యక్షుడిగా నియమించిన సెంగొట్టియన్ పేరు ఈ సందర్భంగా వినిపించింది. ఇంకోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సత్వరమే నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తనను ఆహ్వానించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు ఒక లేఖ కూడా రాశారు. అవసరమైతే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలనందరినీ రాజ్‌భవన్‌కు తీసుకువచ్చి పరేడ్ కూడా చేయిస్తానని కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే గవర్నర్‌నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమెలో ఆందోళన, అసహనం పెరిగి పోయాయి.
దీంతో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఊహించని రీతిలో భారీ కాన్వాయ్‌తో తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను ఉంచిన గోల్డెన్ బే రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. గంటసేపు ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ పార్టీని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని, అందరూ కలిసికట్టుగా ఉండాలని భావోద్వేగంతో మాట్లాడారు. శశికళ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం వారితో కలిసి గవర్నర్‌ను కలవడానికి రావచ్చన్న వార్తల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, శశికళ మాత్రం రిసార్ట్ నుంచి నేరుగా పోయెస్ గార్డెన్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శశికళ విలేఖరులతో మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయాన్ని తాత్సారం చేయడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తమ పార్టీని చీల్చేందుకే జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆదివారం నుంచి వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని ఆమె అన్నారు.
గవర్నర్‌తో స్వామి భేటీ
ఈ పరిణామాల మధ్యలోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు, సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళనే ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
లిస్ట్ కాని జయ కేసు
కాగా శశికళకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్న జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసు సోమవారం సుప్రీం కోర్టులో లిస్ట్ కాలేదు. శశికళ నిందితురాలిగా ఉన్న ఈ కేసు తీర్పు సోమవారం వస్తుందని అంతా ఆశిస్తూ వచ్చారు. కానీ ఈ వారం విచారణకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి చర్య తీసుకుంటారన్నది మరింత ఆసక్తిగా మారింది.