జాతీయ వార్తలు

యుపికి దత్తపుత్రులు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 17: ఉత్తరప్రదేశ్‌కి దత్తపుత్రుడిలా సేవలు అందిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో మంది పుత్రులున్న ఉత్తరప్రదేశ్‌కు నిజంగా బయటి నాయకులు అవసరమా? అని ప్రియాంక ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం ఆమె తన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వారణాసి తనను దత్తత తీసుకుందని, కనుక వారణాసికి తాను బిడ్డ లాంటి వాడినని, వారణాసిని అభివృద్ధి చేస్తానని మోదీ గతంలో కూడా చెప్పారు. కానీ బయటి నాయకులను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉత్తరప్రదేశ్‌కు ఉందా?’ అని కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రియాంక ప్రశ్నించారు. ‘మోదీజీ.. బయటి నాయకులను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉత్తరప్రదేశ్‌కు ఉందా?, ఇక్కడ యువకులు లేరా?, మీకంటే ముందు నుంచే ఇక్కడ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి ఇద్దరు యువకులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ను వారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కనుక మీ లాంటి బయటి నాయకులను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉత్తరప్రదేశ్‌కు లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి యువకుడూ నాయకుడిగా మారగలడు. ప్రతి యువకుడూ ఉత్తరప్రదేశ్ కోసం కృషిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తించగలరు. రాహుల్, అఖిలేష్‌ల ఆకాంక్ష కూడా ఇదే. అని ప్రియాంకా గాంధీ పేర్కొంటూ, కాం గ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కూటమిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌కు దత్తపుత్రుడినంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంబంధ బాంధవ్యాలనేవి ప్రేమాభిమానాలతోనే పెరుగుతాయని, అంతే తప్ప మాటలతో అవి వృద్ధి చెందవని ఆయన పేర్కొన్నారు. ‘ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతంతో సంబంధాలు పెట్టుకుంటున్న మోదీ వారణాసికి వెళ్లి గంగా నదిని తన తల్లిగా, తనను వారణాసి పుత్రుడిగా చెప్పుకున్నారు. వారణాసి రూపురేఖలు మారుస్తానని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వాగ్ధానాలన్నీ శుష్క వాగ్ధానాలుగానే మిగిలి పోయాయి’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

చిత్రం..రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక