జాతీయ వార్తలు

మహిళా కోటాతోనే వివక్షకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: లింగ వివక్ష రూపుమాపాలంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ఒక్కటే మార్గమని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ, పంచాయితీ రాజ్ సంస్థల్లో మహిళలకు కోటా కల్పించడంతో లింగ వివక్ష తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ప్రపంచం మొత్తంమీద 110 దేశాలుకు పైగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాయని, లింగ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 11 దేశాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలు మహిళా కోటా పెంచాయని పేర్కొంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత ప్రధానాంశాలుగా ‘లీవ్ నో వన్ బిహైండ్’ పేరిట ఐక్యరాజ్య సమితి ఓ అధ్యయన నివేదికను బహిర్గతపర్చింది. నివేదికను మంగళవారం ఢిల్లీలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం 1993నాటికి స్థానిక సంస్థల్లో 5 శాతంగావున్న మహిళా రిజర్వేషన్, 2005 నాటికి 40శాతానికి చేరిందని, చట్టబద్ధమైన 33 శాతంకంటే ఇది ఎక్కువని నివేదికలో పొందుపర్చినట్టు మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఈ నివేదిక మహిళా శక్తిని తేటతెల్లం చేస్తూనే, చాలాకాలంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లోవున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రాధాన్యతను గుర్తు చేస్తోందన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్రం ఎన్నో విధాలుగా కృషి చేస్తోందని, బేటి బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ముద్ర, స్టాండప్ ఇండియా పథకాలను ప్రస్తావించారు. ‘మహిళల ఆరోగ్యం, బాలికా విద్య.. ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని నిలుపుకోవడం మన ముందున్న కర్తవ్యం’ అని అన్నారు. ‘ఇలాంటి అంశాలను ఉద్యమంగా తీసుకున్నపుడు ఫలితాలు వేగంగా అందుతాయని, తరువాత క్రమంగా దిగజారిపోతాయని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. మహిళా సాధికారతలో భద్రతకూడా ముఖ్యభూమిక పోషిస్తుందని, మహిళా భద్రతపై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిర్భయ కేసును ప్రస్తావిస్తూ, నేరస్తులను శిక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘సమర్థ వ్యాపార దక్షత మహిళలకు ఉన్నా, వారి శక్తిని న్యాయ వివాదాలు నిర్వీర్యం చేస్తున్న విషయాన్ని ఐరాస తన నివేదికలో పొందుపర్చిందన్నారు. ముఖ్యంగా వివాహితలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళ స్థానం మరింత బలోపేతం కావడానికి నివేదికలోని సిఫార్సులు, నిర్ణయాత్మక అభిప్రాయాలు దోహదపడగలవని ఐరాస ఆకాంక్షించింది.

చిత్రం..ఐక్యరాజ్య సమితి నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు