జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ‘గోరక్షకుల’ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 22: జమ్మూ, కాశ్మీర్‌లోని రేసి జిల్లాలో గోరక్షకులుగా చెప్పుకొంటున్న కొంతమంది జరిపిన దాడిలో తొమ్మిదేళ్ల బాలికసహా ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. తల్వారా ఏరియా సమీపంలో సంచార జాతికి చెందిన వీరంతా తమ పశువులతో వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో గోరక్షకుల గుంపు ఐరన్ రాడ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా కొట్టారు. దాడి చేసిన వారు తమ మేకలు, గొర్రెలు, ఆవులన్నిటినీ తీసుకెళ్లారని బాధితులు చెప్తున్నారు. తొమ్మిదేళ్ల సమ్మితోపాటుగా తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, దాడి చేసిన వారిపై చర్య తీసుకుంటామని పోలీసులు చెప్పారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా ఉధంపూర్ డిఐజిని కోరినట్లు, దాడి చేసిన గూండాలపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని జమ్మూ, కాశ్మీర్ పోలీసు చీఫ్ ఎస్‌పి వైద్ చెప్పారు. కాగా, దాడి చేసినవారిలో ఐదుగురిని గుర్తించామని, అయితే ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్టు చేయలేదని రేసిలోని పోలీసులు చెప్పారు. దాడి చేసినవారు తమను దారుణంగా చావబాదారని, తమ పిల్లల్లో పదేళ్ల బాలుడు ఒకరు కనిపించడం లేదని, అతను బతికే ఉన్నాడో, చనిపోయాడో కూడా తెలియదని, చివరికి వృద్ధులను కూడా దారుణంగా కొట్టారని బాధితుల్లో ఒకరైన నదీమ్ బేగమ్ వాపోయింది.