జాతీయ వార్తలు

చిక్కుల్లో పీసీ, లాలూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ న్యూఢిల్లీ, మే 16: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఇటు సిబిఐ, అటు ఆదాయం పన్ను అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో దాడులు, సోదాలు నిర్వహించారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల అనుమతి వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై చిదంబరం, కార్తి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగితే.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర బినామీ పేర్లతో భూ లావాదేవీలు జరిగాయన్న అభియోగాలపై లాలూ ఇళ్లు, ఆస్తులపై సోదాలు దాడులు నిర్వహించారు. ఈ రెండు వ్యవహారాల్లో పలువురు వ్యాపార వేత్తలపైనా ఐటి, సిబిఐ అధికారులు దృష్టి పెట్టారు. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణల నేపథ్యంలో చిదంబరం ఇల్లు, కార్యాలయాలపై జరిగిన ఐటి దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న పిదంబరం ఇంటితో సహా ముంబై, ఢిల్లీ, గుర్‌గ్రామ్‌లలో సోదాలు నిర్వహించారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులు పొందటానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్ ఇవ్వటంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై సోమవారం చెన్నైలో కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఐఎన్‌ఎక్స్ మీడియాను ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు డైరెక్టర్‌లుగా నడుపుతున్నారు. ఇందులో చిదంబరం కొడుకు కార్తి కూడా ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. కన్న కూతురు హత్య కేసులో ఇంద్రాణి, పీటర్‌లు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియాతో పాటు కార్తి కంపెనీ అయిన చెస్ మేనేజిమెంట్ సర్వీసెస్, పద్మా విశ్వనాథన్ డైరెక్టర్‌గా ఉన్న అడ్వాంటేజి స్ట్రాటెజిక్ కన్సల్సిటంగ్ లిమిటెడ్‌లపై కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి మార్గంలో లబ్ధి పొందటం, నేరపూరిత ప్రవర్తన తదితర అభియోగాలను వీరిపై నమోదు చేశారు.
సిబిఐని పావులా వాడుకుంటున్నారు
ప్రభుత్వం సిబిఐని పావులా వాడుకుంటోందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. సిబి ఐ, ఇతర ఏజెన్సీలు తన కుమారుడిని టార్గెట్ చేశాయని ఆయన అన్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌ఐపిబి వందలాది క్లియరెన్సులు ఇచ్చిందని ప్రభుత్వం మాత్రం తన గొంతును, తాను రాతల్ని అడ్డుకునేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. విపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, కాలమిస్టులు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా, ఏవైనా తమకు వ్యతిరేకంగా గళం విప్పితే చాలు వారిని అణచేసేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆయన చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వం ఎంతగా అడ్డుకోవాలని చూసినా నేను రాస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా.’’ అని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌ఐపిబికి చెందిన అయిదుగురు కార్యదర్శులు కానీ, అధికారులలో ఏ ఒక్కరిపైనా ఎలాంటి ఆరోపణ లేదని, చివరకు తనపైనా ఎలాంటి ఆరోపణ లేదని చిదంబరం స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడుల అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చిన ప్రతీ కేసు కూడా చట్ట పరిధిలో జరిగిందని భారత ప్రభుత్వానికి చెందిన అయిదుగురు సెక్రటరీలతో కూడిన ఎఫ్‌ఐపిబి సిఫార్సుల మేరకే జరిగిందని చిదంబరం వెల్లడించారు. చిదంబరం కుమారుడు కార్తి తన తండ్రి పలుకుబడిని వాడుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయంతో ఐఎన్‌ఎక్స్ మీడియాకు అనుమతులను పొందారని సిబిఐ ఆరోపించింది.
లాలూకు మళ్లీ కష్టాలు
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించి ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు మరింతగా ఇరుకున పడ్డారు. అసలే దాణా కుంభకోణాన్ని తిరగదోడాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ తాజా ఆరోపణలు వెలుగు చూడటం లాలూకు రాజకీయంగా మరింత విఘాతకరంగా భావిస్తున్నారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి 22 చోట్ల ఆదాయం పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్, రెవారీతో పాటు అనేక చోట్ల మంగళవారం ఉదయం నుంచీ దాడులు, సోదాలు జరిగాయి. ఆర్‌జెడి ఎంపీ పిసి గుప్తా కుమారుడు, ఇతర వ్యాపార వేత్తలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అలాగే మరో పది అధికారిక ప్రాంగణాలపై కూడా సర్వేలు నిర్వహించామన్నారు. వీరందరిపైనా వెయ్యి కోట్ల బినామీ భూ లావాదేవీల పాటు పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. ఈ దాడుల్లో దాదాపు వంద మంది అధికారులు పాల్గొన్నారు.
ఎవరికీ భయపడను:లాలూ
ఇలాంటి దాడులకు భయపడేది లేదని లాలూ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. బిజెపిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఫాసిస్టు శక్తులపై తన పోరాటం ఆగదని అన్నారు. లాలూ ప్రసాద్ గొంతు నొక్కే ధైర్యం బిజెపికి లేదని, ఒక వేళ అదే జరిగితే కోట్లాని మంది లాలూలు ముందుకొస్తారని అన్నారు.

చిత్రాలు....సిబిఐ సోదాలపై మీడియాతో మాట్లాడుతున్న చిదంబరం.
*లాలూ ఇంటి వద్ద ఐటీ దాడుల సమాచారం కోసం గుమిగూడిన మీడియా