జాతీయ వార్తలు

ఆయన ఓ తెలివైన వ్యాపారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్, జూన్ 10: జాతిపిత మహాత్మాగాంధీనుద్దేశించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గాంధీజీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను అమిత్‌షాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో శుక్రవారం సాయంత్రం ఎంపిక చేసిన పురప్రముఖుల సమావేశంలో మాట్లాడిన సందర్భంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ చాలా ‘తెలివైన వ్యాపారి’ అని అంటూ గాంధీజీ కులాన్ని పరోక్షంగా ప్రస్తావించడం ఈ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఏవో సిద్దాంతాలపై ఏర్పడిన పార్టీ కాదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కేవలం స్వాతంత్య్ర సాధనకోసం ఏర్పడిన ఓ సంస్థ మాత్రమేనని కూడా ఆయన అన్నారు. ‘ఓ బ్రిటిష్ వ్యక్తి ఒక క్లబ్‌గా దాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంకోసం ఆ తర్వాత దాన్ని ఓ సంస్థగా మార్చారు. అందులో అన్ని రకాల సిద్ధాంతాలు, భావాలుండే వారు ఉన్నారు’ అని కూడా ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవు. కేవలం స్వాతంత్య్ర సాధనకోసమే దాన్ని ఏర్పాటు చేశారు. అందుకే గాంధీజీ ఎంతో ముందుచూపుతో ఆలోచించి స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని స్పష్టంగా చెప్పారు.
ఆయన ఒక తెలివైన వ్యాపారి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఆ సలహా ఇచ్చారు. అయితే గాంధీజీ ఆ పని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు కొంతమంది ఆ పని పూర్తి చేస్తున్నారు’ అంటూ అమిత్ షా పరోక్షంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎద్దేవా చేశారు. ‘ఆనువంశిక పాలన కొనసాగుతున్న పార్టీలు కొన్ని ఉన్నాయి. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత చేపడతారని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే నా తర్వాత బిజెపి అధ్యక్షుడు ఎవరవుతారో ఎవరికీ తెలియదు’ అని కూడా ఆయన అన్నారు.
కాగా, గాంధీజీనుద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తీవ్రంగా స్పందించింది. జాతిపిత గాంధీజీని అవమానించే విధంగా మాట్లాడినందుకు అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. కులతత్వంపై పోరాడే బదులు బిజెపి జాతిపితకు సైతం కులాన్ని అంటగడుతోందని కూడా ఆయన దుయ్యబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని, జాతి పితను అవమానించినందుకు అమిత్ షా, బిజెపి, ప్రదాని నరేంద్ర మోదీ దేశానికి, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, ప్రతి పౌరుడికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. కాగా, ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు గొప్ప నేతల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వారిని గౌరవించాలని, సున్నితమైన భాషను ఉపయోగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.