జాతీయ వార్తలు

నిజం నోరు నొక్కుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితులను చితకబాదడం, మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేయడం, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లను బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడ్డంద్వారా నిజం గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పుడు అధికార బలమే నిజాన్ని శాసిస్తోందని, నిజం మాట్లాడడానికి యత్నించే, దానికి అండగా నిలవాలనుకునే వారిని పక్కకు నెట్టేస్తున్నారని, అయితే నిజం ఏమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. తాము చెప్పాలనుకున్న దాన్ని చెప్పనీయడం లేదని చాలామంది జర్నలిస్టులు తనతో చెప్పారని ఆయన అన్నారు. ఇటీవల రైతుల ఆందోళనల సందర్భంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వెళ్లడానికి తనను అనుమతించకపోవడాన్ని, సరిహద్దుల్లోనే ఆపేయడాన్ని ఆయన గుర్తుచేస్తూ మనం ఇప్పుడు ఇలాంటి భారత దేశంలో నివసిస్తున్నామని అన్నారు. ‘నిజం ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఆ విషయం చెప్పడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు’ అని సోమవారం ఇక్కడ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక ప్రచురించిన 70 ఏళ్ల భారతదేశ స్వాతంత్య్ర స్మారక సంచికను ఆవిష్కరిస్తూ రాహుల్ గాంధీ అన్నారు. ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీతో కలిసి ఆయన ఈ స్మారక సంచికను ఆవిష్కరించారు.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను లక్నోలో స్థాపించగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ఆ పత్రిక మూతపడింది. అయితే ఇప్పుడు ఆ పత్రికను తిరిగి ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్మారక సంచికను సోమవారం లాంఛనంగా ఆవిష్కరించగా, ఈ నెల 20న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కృతమవుతుంది. మల్టీ మీడియా వారపత్రికగా హిందీ, ఉర్దూ ఎడిషన్లను త్వరలోనే ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతోందని నేషనల్ హెరాల్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ చెప్పారు. ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ నెల చివరినుంచి పూర్తిస్థాయిలో పని చేస్తుందని కూడా ఆయన చెప్పారు.
ఆర్మీ చీఫ్‌పై వ్యాఖ్యలు తప్పు
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను వీధిగూండాతో పోలుస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఆర్మీ చీఫ్‌పై ఒక కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యల గురించి మీడియాలో కొందరు తన దగ్గర ప్రస్తావించారని, ఆ వ్యాఖ్యలు చాలా తప్పని కర్నాటక పిసిసి సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. దేశంకోసం పని చేసే ఆర్మీపైన, ఆర్మీ చీఫ్‌పై ఏ రాజకీయ నాయకుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కాగా, ఆర్మీ చీఫ్‌పై సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్రస్థాయిలో మండిపడుతూ, ఆయనను కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించాలని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఆర్మీ చీఫ్‌పై చేసిన వ్యాఖ్యలకు సందీప్ దీక్షిత్ క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం మాత్రం పూర్తిగా చల్లారలేదు.

చిత్రం.. బెంగళూరులో సోమవారం ‘నేషనల్ హెరాల్డ్’ స్వాతంత్య్ర స్మారక సంచికను ఆవిష్కరిస్తున్న రాహుల్