జాతీయ వార్తలు

ఎన్‌డిఆర్‌ఎఫ్ పనితీరు మరింత మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: విపత్కర సమయాల్లో ప్రజలకు సాయమందించే ఎన్‌డిఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది తమ పనితీరును మరింతగా పెరుగుపర్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యవసర ఫోన్ కాల్స్‌కు మూడు రెట్లు వేగంతో స్పందించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ అత్యవసర ఫోన్ కాల్స్‌కు స్పందించేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం ఈ సమయం 5 నుంచి 6 సెకన్లకు తగ్గిపోయింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ పనితీరుకు సంబంధించి పిటిఐ వార్తా సంస్థకు అందిన సరికొత్త ప్రణాళికా పత్రాన్ని (బ్లూప్రింట్‌ను) బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. ఏదైనా విపత్తు, లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు అత్యంత కీలకమైనదిగా పరిగణించే ‘గోల్డెన్ అవర్’ (మొదటి గంట సమయం) లోపలే ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, సహాయ సామగ్రి ఘటనా స్థలానికి చేరుకుని తీరాలని ఈ పత్రంలో నిర్ధేశించారు. భూకంపాలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటం లాంటి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి సహాయ కార్యక్రమాలను చేపట్టాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇటీవల తన పాత విధి నిర్వహణా ప్రణాళికకు మార్పులు, చేర్పులు చేసుకుని ఈ కొత్త ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు ఇప్పటికే దీనిని అమలులో పెట్టింది. విపత్తుకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత తొలి సహాయ బృందం ఘటనా స్థలానికి చేరే సమయాన్ని సగానికి తగ్గించుకుని తొలి సహాయ బృందం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి బయలుదేరి తీరాలని కొత్త ప్రణాళికలో నిర్దేశించుకున్నారు.

శాంతి, సోదరభావం పెంపొందాలి
*మోదీ ఈద్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ, జూన్ 26: ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు పండగ సందేశాన్ని ట్వీట్ చేశారు. రంజాన్ సమాజంలో శాంతి, సోదరభావాన్ని తీసుకురావాలని మోదీ ఆకాంక్షించారు. వైవిద్యంతో కూడిన భారత్‌లో ఈద్ పండుగ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. ‘రంజాన్ మాసం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇప్పుడు ఈద్ సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించాలి. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం నాడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా‘ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఎన్‌ఇపి తుది ముసాయిదా
రూపకల్పనకు కొత్త కమిటీ
*సారథిగా ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్
న్యూఢిల్లీ, జూన్ 26: జాతీయ విద్యా విధాన (ఎన్‌ఇపి) తుది ముసాయిదాను రూపొందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ కె.కస్తూరి రంగన్ సారథ్యం వహించనున్నారు. ఈ కమిటీలో ఆయనపాటు ప్రముఖ విద్యావేత్త వసుధా కామత్ (ముంబయిలోని ఎస్‌ఎన్‌డిఓ యూనివర్శిటీ వైస్-చాన్సలర్), రిటైర్డ్ ఉన్నతాధికారి కెజె.ఆల్ఫోన్స్, ప్రొఫెసర్ మంజుల్ భార్గవ (ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ గణితశాస్త్ర అధ్యాపకుడు), రామ్ శంకర్ కురీల్ (మహులోని బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైనె్సస్ వైస్-చాన్సలర్), టివి.కట్టమణి (అమర్‌కంటక్‌లోని ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉప కులపతి), కెఎం.త్రిపాఠి (ఉత్తరప్రదేశ్ హైస్కూల్, ఇంటర్మీడియెట్ పరీక్షల బోర్డు చైర్‌పర్సన్), గౌహతి విశ్వవిద్యాలయంలో పర్షియన్ అధ్యాపకునిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ మజర్ ఆసిఫ్, ఎంకె.శ్రీ్ధర్ (సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడు, కర్నాటక ఇన్నోవేషన్ కౌన్సిల్ మరియు కర్నాటక నాలెడ్జ్ కమిషన్ మెంబర్ సెక్రటరీ) సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తక్షణమే తన పనిని ప్రారంభిస్తుందని మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
భారత్ భూభాగంలోకి
చొచ్చుకొచ్చిన చైనా బలగాలు
*సైనో-ఇండియా సరిహద్దు వద్ద ఉద్రిక్తత * నిలువరించిన భారత బలగాలు
ఢిల్లీ, జూన్ 26: చైనా బలగాలు మరోసారి భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. సిక్కిం సెక్టార్‌లోని సైనో- ఇండియా సరిహద్దు వద్ద చైనా బలగాలు చొరబాటుకు యత్నించడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైనా బలగాలను నిలువరించేందుకు తీవ్రంగా యత్నించిన భారత సైనికులపై దాడిచేస్తూ బలవంతంగా చొచ్చుకువచ్చాయి. రెండు బంకర్లను కూడా చైనా బలగాలు ధ్వంసం చేశాయి. వీరి ధాటిని తట్టుకునేందుకు భారత సైనికులు ఒక దశలో మానవ హారంలా గోడలా నిలబడ్డారు. వాస్తవాధీన రేఖ నుంచి మరింత ముందుకు రాకుండా అడ్డుకోగలిగారు. చైనా సైనికుల దుందుడుకు చర్యలను, అక్కడ నెలకొన్న పరిస్థితిని భారత సైనికులు కొందరు వీడియోలో చిత్రీకరించారు. డోకాలా ప్రాంతంలోని లాల్‌టెన్ ప్రాంతంలోని రెండు బంకర్లను ధ్వంసం చేశారు. సిక్కింలోని డోకాలా వద్ద గత పదిరోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోందని, మానస సరోవర్ యాత్రికులను కూడా చైనా బలగాలు అడ్డుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితం ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్ సైనిక అధికారులు ఫ్లాగ్ మీటింగ్‌ను నిర్వహించారు. నాటినుంచి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.