జాతీయ వార్తలు

నేడే నవశకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: స్వతంత్య్ర భారత చరిత్రలో మరో చారిత్రక అధ్యాయానికి మరి కొన్ని గంటల్లో నాందీ ప్రస్తావన జరుగబోతోంది. రాష్ట్రానికో రేటుతో..పన్నుమీద పన్ను చందంగా మారిన సంక్లిష్ట పరోక్ష పన్నుల వ్యవస్థ స్థానే ‘ఒకే దేశం ఒకే పన్ను’ నినాదంతో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి రానుంది. నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ నేటి అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఈ సరికొత్త చారిత్రక వ్యవస్థ ఆవిర్భావ శంఖారావం చేయబోతోంది. పరోక్ష పన్నుల వ్యవస్థను సంస్కరించేందుకు 1986 మార్చిలో మొదలైన ప్రయత్నం అనేక మలుపులు తిరిగి జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)గా అమలుకాబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎడతెరపి లేనిరీతిలో రాజకీయ పార్టీలు, ఆర్థిక నిపుణులు, వ్యాపార, వాణిజ్యవేత్తల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి రావడం, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించడంతో జిఎస్‌టికి మార్గం సుగమమైంది. ఈ చారిత్రక సందర్భాన్ని అంతే ఘనంగా ఎన్‌డిఏ సర్కార్ నిర్వహించబోతోంది. ఇప్పటి వరకూ రెండుసార్లు మాత్రమే అర్ధరాత్రి వేళ పార్లమెంట్ సంయుక్త సమావేశాలు జరిగాయి. మొదటిసారి క్విట్ ఇండియా 50వ వార్షికోత్సవం సందర్భంగా 1992లో..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండోసారి పార్లమెంట్ సంయుక్తంగా అర్ధరాత్రి సమావేశమైంది. అంటే ఈ రెండు కూడా గతానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలను నెమరువేసుకోవడానికి జరిగినవే..కానీ ఈసారి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు స్వాగతం పలికేందుకే ఈ సమావేశం జరుగడం అన్నది జిఎస్‌టి ప్రాధాన్యతను మరింత పెంచింది. కచ్చితంగా నేటి అర్ధరాత్రి ఈ మార్పు శంఖారావం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు గంట పాటు జరిగే ఈ సమావేశంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు. ఈ సందర్భంగా జిఎస్‌టిపై రెండు లఘు చిత్రాల్ని కూడా ప్రదర్శిస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రులు జిఎస్‌టి అధికారులు సహా మొత్తం 600మంది ఈ చారిక్రత ఘట్టాన్ని వీక్షించే అవకావం ఉంది. జిఎస్‌టి వచ్చేసింది అన్న సంకేతానికి అద్దం పడుతూ ఓ గంటను మోగిస్తారు. గత యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీయే మొదట జిఎస్‌టి బిల్లును తీసుకొచ్చారన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఈ పరోక్ష పన్నుల వ్యవస్థకు ఓ స్పష్టమైన రూపాన్ని ఇచ్చేందుకు జిఎస్‌టి మండలి ఇప్పటి వరకూ మొత్తం 17సార్లు సమావేశమైంది. మొదట విజ్ఞాన్ భవన్‌లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ ఇది చారిత్రక సందర్భం కాబట్టి అంతే చారిత్రక ప్రాధాన్యత కలిగిన పార్లమెంట్ సెంట్రల్ హాలే ఇందుకు సరైన వేదిక అని ప్రభుత్వం భావించి తన తొలి నిర్ణయాన్ని మార్చుకుంది. 5, 12, 18, 28 శాతాలుగా నాలుగు శ్లాబుల్లో అమలు అయ్యే ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ అమలు అయితే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి వేగం పెరుగుతుందని, అత్యంత అనువైన వ్యాపార కేంద్రంగా భారత్ ఆవిర్భవించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బహిష్కరణ భావ్యం కాదు: జైట్లీ
జిఎస్‌టి ఆవిర్భావం కోసం నేటి అర్థరాత్రి జరుగుతున్న పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించవద్దని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యర్థించారు. జిఎస్‌టి అన్నది కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని వర్గాలతో జరిపిన చర్చల ఫలితంగానే ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఇప్పటి వరకూ ఈ సంయుక్త నిర్ణయాల్లో పాలుపంచుకున్న ప్రతిపక్షాలు చివరి క్షణంలో తప్పించుకుపోవడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. జిఎస్‌టి మండలిలో కేంద్ర ప్రతినిధులే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులూ ఉన్నారన్న విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. నిబంధనలను ఏర్పరచడం మొదలుకుని అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయ ప్రాతిపదికగానే తీసుకోవడం జరిగిందని జైట్లీ తెలిపారు.