జాతీయ వార్తలు

వచ్చేసింది.. ఒకే పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక సంస్కరణల చరిత్రలో మరో సువర్ణ శకం ఆవిష్కృతమైంది. సమాఖ్య ఫెడరలిజానికి తిరుగులేని చుక్కానిగా నిలుస్తూ..కేంద్ర, రాష్ట్రాల మధ్య సరికొత్త అవగాహనకు అద్దం పడుతూ చారిత్రక ఘట్టంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఆవిర్భవించింది. ఎన్నో అరుదైన ఘట్టాలకు తలమానిక వ్యవస్థగా నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాలు ఇందుకు వేదిక అయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు (కొన్ని మినహా) చెందిన నేతలు, అధికారులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా వందలాది మంది హాజరై ఈ చారిత్రక శంఖారావం చేశారు. జిఎస్‌టి అమలుకు సంకేతంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు జేగంటలు మోగాయి. రాష్టప్రతి ప్రణబ్, ప్రధాని మోదీలు జేగంట మోగించడం ద్వారా ఈ ఘట్టానికి నాంది ప్రస్తావన చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది. బాణాసంచా పేలుస్తూ జనం జిఎస్‌టికి స్వాగతం పలికారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు పార్లమెంట్ సెంట్రల్ హాలు సమావేశాన్ని బహిష్కరించినప్పటికీ జెడియు, ఎన్‌సిపి, బిజెడి, సమాజ్‌వాది పార్టీ, జెడిఎస్ నేతలు హాజరయ్యారు.
*
న్యూఢిల్లీ, జూన్ 30: స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని ఏవిధంగా సర్దార్ పటేల్ పటిష్టమైన సమైక్యతా వ్యవస్థగా తీర్చిదిద్దారో అదే తరహాలో చారిత్రక వస్తుసేవల పన్ను వ్యవస్థ దేశాన్ని సంఘటితం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కొత్త వ్యవస్థ ఆవిర్భావంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను అనే గందరగోళం తొలగిపోతుందని, గాంధీనగర్ నుంచి ఈటానగర్ వరకు, కాశ్మీర్‌లోని లే నుంచి లక్షద్వీప్ వరకు ‘ఒకే దేశం ఒకే పన్ను’ అనే స్థిరమైన, బలమైన వ్యవస్థ వేళ్లూనుకుంటుందని స్పష్టం చేశారు. జిఎస్‌టి అన్నది కేవలం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక, పన్ను సంస్కరణల వ్యవస్థ కాదని, ప్రతి ఒక్కరి సమీకృత కృషి ఫలితంగానే ఇది ఆవిర్భవించిందని మోదీ స్పష్టం చేశారు. ఇది భారతదేశ సహకార సమాఖ్య స్ఫూర్తికి తిరుగులేని నిదర్శనమని పేర్కొన్న ఆయన ఈ వ్యవస్థ ఆవిర్భావం వెనుక ఎందరో మేధావుల కృషి ఉందని అంకితభావంతో సాగిన వారి పట్టుదల ఉందని మోదీ తెలిపారు. వారందరి కృషి ఫలితంగానే చారిత్రక పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఈ శుభసందర్భంగా ప్రతి ఒక్కరూ సమావేశమయ్యారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారతదేశం సరికొత్త నవోదయం దిశగా తొలి అడుగును బలంగా వేయబోతోందని హర్షధ్వానాల మధ్య మోదీ తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు మహోన్నతమైన చరిత్ర ఉందని పేర్కొన్న ఆయన, 1947 ఆగస్టు 14 నాటి స్వాతంత్య్ర ఆవిర్భావ ఘటనకు ఈ వేదికే సాక్షీభూతంగా నిలిచిందని తెలిపారు. ఎన్నో దశాబ్దాల తర్వాత అంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన జిఎస్‌టి సువర్ణ శకానికి ఇదే ఆరంభ వేదిక అయిందని మోదీ తెలిపారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యామని జిఎస్‌టి వంటి ఓ చారిత్రక సంస్కరణకు ఇదే సముచిత వేదిక అని భావించామని మోదీ గుర్తుచేశారు. జిఎస్‌టితో భారతదేశం సరికొత్త ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించినట్లయిందని అన్నారు. జాతి నిర్మాణానికి, దేశ నిర్మాణానికి ఈ వ్యవస్థ బలమైన పునాది అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇంతకుముందు మాట్లాడిన జైట్లీ జిఎస్‌టి ఆవిర్భావంతో నవభారతం ఆవిష్కృతమవుతుందని అన్నిచోట్లా ఒకే రకమైన పన్ను అమలవుతుందని స్పష్టం చేశారు. ఈ సరికొత్త వ్యవస్థ వల్ల స్థూలజాతీయోత్పత్తి వృద్ధి రేటు పెరగడమే కాకుండా పన్నుల ఎగవేత ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు. భారతదేశానికి సంబంధించినంత వరకు దీన్నొక సరికొత్త పయనంగా అభివర్ణించారు. జిఎస్‌టిలో భాగంగా అన్ని రకాల ఇతర పన్నులను తొలగించి ఒకే పన్నును అమలులోకి తెచ్చామన్నారు. ఏ వర్గంపైనా అనవసరమైన పన్నుల భారం ఇక ఉండదని తెలిపారు. నెలల తరబడి జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు ముక్తకంఠంతో ఈ సరికొత్త వ్యవస్థను స్వాగతించాయని, దీన్నిబట్టి చూస్తే సంకుచిత రాజకీయాలకు అతీతంగా అవసరమైన సందర్భంలో భారతావని సమాఖ్య, సమైక్య గళాన్ని వినిపిస్తుందన్న విషయం రుజువైందన్నారు. ఈ వ్యవస్థను అమలుచేయడం ద్వారా ఇటు కేంద్రం గానీ, అటు రాష్ట్రాలుగానీ తమ ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితి ఉండదని తెలిపారు. మొత్తం జాతికే ఇదో అద్భుతమైన విజయంగా జైట్లీ అభివర్ణించారు. ఉమ్మడి అభివృద్ధి కోసం, దేశ పురోభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాలు సమష్టిగా పనిచేయడానికి జిఎస్‌టి దోహదం చేస్తుందన్నారు. ఈ సరికొత్త పయనంలో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని, ఆర్థికంగా ఎంతగానో విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
భారతదేశ ప్రజాస్వామ్య పరిణతికి, విజ్ఞతకు జిఎస్‌టి ఓ అరుదైన తార్కాణమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జిఎస్‌టితో భారతదేశం ఇతర దేశాల పోటీని తట్టుకునే విధంగా ఎగుమతులను చేయగలుగుతుందని, అంతేకాకుండా దేశీయ పరిశ్రమలకు ఇదో బలమైన వేదిక అవుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలో జిఎస్‌టి ఆవిర్భావమన్నది ఓ తలమానికమైన శకంగా ప్రణబ్ అభివర్ణించారు.

చిత్రం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్న రాష్టప్రతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ