జాతీయ వార్తలు

ఇక రాందేవ్ ‘సెక్యూరిటీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్, జూలై 13: ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ఇప్పుడు కొత్తగా కాసులు కురిపించే సెక్యూరిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రాందేవ్ ఈ నెల 10న పరాక్రమ్ సురక్షా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్తగా సెక్యూరిటీ సంస్థను ప్రారంభించినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. రాందేవ్ సైతం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.‘ఈ రోజు పరాక్రమ్ సెక్యూరిటీని ప్రారంభించాం. అది దేశంలో 25-50 వేల మంది యువకులకు ఉపాధి కల్పించడంతో పాటుగా త్వరలోనే దేశంలోనే ప్రముఖ సెక్యూరిటీ కంపెనీల్లో ఒకటిగా అవుతుంది’ అని రాందేవ్ తన ట్వీట్‌లో తెలిపారు. అంతర్జాతీయంగా యోగా గురువుగా పేరు తెచ్చుకున్న బాబా రాందేవ్ ఇప్పుడు తన ఎఫ్‌ఎంసిజి, ఆయుర్వేద సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాలని అనుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. యువకులను ఆత్మరక్షణతో పాటుగా దేశ రక్షణకు సిద్ధంగా తయారు చేయడమే తమ లక్ష్యమని, ఇందుకోసమే తాము పరాక్రమ్‌ను ప్రారంభించామని రాందేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా రిక్రూట్ చేసుకున్న యువకులకు శిక్షణ ఇవ్వడం కోసం విశ్రాంత ఆర్మీ, పోలీసు అధికారుల సేవలను ఉపయోగించుకుంటున్న రాందేవ్ ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త సంస్థ ద్వారా గుర్తింపు సాధించాలని అనుకుంటున్నారు. బాబా రాందేవ్ కొత్తగా ప్రారంభించిన సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా పని చేయడం కోసం యువకులకు హరిద్వార్‌లోని పతంజలి కాంప్లెక్స్‌లో శిక్షణ ఇస్తారు. రాందేవ్ ఆయుర్వేద, ఎఫ్‌ఎంసిజి సామ్రాజ్యం 2016లో రూ. 1100 కోట్ల విలువకు చేరుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పతంజలి సంస్థ సిఈఓ ఆచార్య బాలకృష్ణ భారత దేశంలోని అత్యంత సంపన్నుల్లో 25వ స్థానంలో నిలిచారు కూడా.