జాతీయ వార్తలు

అహ్మద్ పటేల్ నెగ్గేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 7: గుజరాత్‌లో మంగళవారం జరగనున్న రాజ్యసభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రెండు సీట్లకు పోటీ చేస్తుండగా మూడో సీటుకూ పోటీ పెట్టి కాంగ్రెస్ విజయావకాశాలపై బిజెపి నీలినీడలు కమ్మేటట్లు చేసింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను బరిలోకి దింపటం ద్వారా క్రాస్ ఓటింగ్‌కు అన్ని అవకాశాలను తెరిచిపెట్టింది. 182 మంది ఎమ్మెల్యేలున్న గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ బలం 57కాగా వారిలో ఆరుగురు రాజీనామా చేయటంతో 51కి పడిపోయింది. మరోవైపు సీనియర్ నేత శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్‌కు రాజీనామా చేయటం, దాదాపు ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ఫిరాయించినా పటేల్ విజయానికి పెద్దగా సమస్య వచ్చేది కాదు. కానీ, మిగిలిన 51 మందిలో పదిమందిని అమిత్ షా బృందం ప్రభావితం చేసే పనిలో పడటంతో పటేల్ శిబిరం బెంబేలెత్తింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్స్‌కు తరలించేసిన సంగతి తెలిసిందే. ఈ 44 మంది ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం గుజరాత్‌కు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. అహ్మదాబాద్‌కు సమీపంలోని ఆనంద్ పట్టణంలోని మరో రిసార్ట్స్‌లో మకాం వేశారు. వీరందరికీ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక సీనియర్ నాయకుడిని భద్రతా ఏర్పాట్లకు పర్యవేక్షకుడిగా నియమించారు. బౌన్సర్లను కూడా నియమించారు. అహ్మద్ పటేల్ గెలవాలంటే కనీసంగా 45మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో ఉన్నది 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీనికితోడు ఎన్నికల సంఘం నామినేషన్ పత్రంలో నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)ను కూడా ఉంచటంతో కాంగ్రెస్ మరింత ఆందోళనగా ఉంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న 44 మంది ఎమ్మెల్యేలకు తోడుగా మరో ఓటు పటేల్‌కు అవసరం. ఇక ఒకరిద్దరు నోటాకు ఓటేసినా పటేల్ విజయం అనుమానమే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, గుజరాత్ పరివర్తన్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతును కాంగ్రెస్ సంపాదించుకుంది. అహ్మద్ పటేల్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం 176మంది ఎమ్మెల్యేలున్న గుజరాత్ అసెంబ్లీలో ఒక్కో అభ్యర్థి సభలో నాలుగో వంతు ఎమ్మెల్యేల ఓట్లను గెలుచుకోవలసి ఉంటుంది. ఆ ప్రకారం 45 ఓట్లు వస్తేనే పటేల్ విజయం తథ్యమవుతుంది. తన శాసన సభ్యులను ఓటు వేసేంతవరకూ కాపాడుకోగలిగితేనే పటేల్ గెలుపు సాధ్యపడుతుంది. ఎవరైనా కాంగ్రెస్ సభ్యులు చివరి నిమిషంలో మనసు మార్చుకున్నా, నోటాను ఎంచుకున్నా పటేల్ గెలుపు కష్టమైపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ గుజరాత్‌లో మోహరించింది. అహ్మద్ పటేల్ ఇప్పటికే ఆనంద్ రిసార్ట్స్‌కు వెళ్లి ఓటును ఎలా వినియోగించాలో ఎమ్మెల్యేలకు వివరించారు. మరోవైపు మూడో అభ్యర్థి బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్ కూడా గెలుస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం.. బెంగళూరులో మకాం వేసిన 44 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించేందుకు అహ్మదాబాద్ ఎయర్ పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు భరత్ సిన్హ్ సోలంకి, అర్జున్ మోధ్‌వాడియా, అహ్మద్ పటేల్