జాతీయ వార్తలు

మతతత్వ శక్తులపై ఉమ్మడిగా పోరాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీపై సంఘటిత పోరాటానికి పిలుపునిస్తూ డజనుకు పైగా ప్రతిపక్ష పార్టీలు గురువారం ఒకే వేదికపైకి వచ్చాయి. జెడి (యు) తిరుగుబాటు నాయకుడు శరద్ యాదవ్ ‘సంఝి విరాసత్ బచావో (మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం) పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అయింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీ, ఎన్‌సిపి, ఆర్‌జెపి, నేషనల్ కాన్ఫరెన్స్, జెడి(ఎస్), ఆర్‌ఎల్‌డి పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నాయకుడు డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.
కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాట్లాడిన నేతలందరు కూడా విచ్ఛిన్నకర, మతతత్వ శక్తులపై సంఘటిత పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎందరో హిందూ ముస్లిం నేతలు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని సీతారాం ఏచూరి అంటూ, అయితే ఇప్పుడు భారతీయ సంస్కృతి, వారసత్వానికి ముప్పు ఎదురయిందని అన్నారు. దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. ఈ పోరాటానికి శరద్ యాదవే నాయకత్వం వహించాలని సమావేశంలో ప్రసంగించిన వక్తలందరూ కోరారు. 2019లో జరిగే ఎన్నికల్లో ఈ విచ్ఛిన్నకర శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని శరద్ యాదవ్‌ను కోరారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను రాజ్యాంగేతర శక్తిగా సిపిఐ నేత రాజా అభివర్ణిస్తూ, ప్రతి విషయంలోను అది ప్రభుత్వాన్ని వెనకనుంచి నడిపిస్తోందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, గుజరాత్‌నుంచి ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం శరద్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి హాజరైన
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం నేత సీతారాం ఏచూరి