జాతీయ వార్తలు

ధర్నా చౌక్ ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం ధర్నాచౌక్ పరిరక్షణ సమితి నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ధర్నా చౌక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పరిరక్షణ సమితి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిరసనలో పాల్గొన్న నేతలు సిఎం కెసిఆర్‌ది నియంతృత్వ ధోరణి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కును అడ్డుకోవడం సిఎంకు తగదని హితవు పలికారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ హైదరాబాద్ ధర్నాచౌక్‌ను ఉద్యమాల ద్వారా సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తోన్న కెసిఆర్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మరిచినట్టున్నారని అన్నారు. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కెసిఆర్‌కు ఇవ్వాల్సింది అదర్శ రైతు అవార్డు కాదని, తెలంగాణ హిట్లర్ అని మండిపడ్డారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిరసనలు తెలిపే హక్కును అడ్డుకోవడం నిరంకుశత్వమేనన్నారు. తెలంగాణలో సాగుతోన్న ఇసుక దందా, నిరుద్యోగ, రైతు సమస్యలపై విపక్షాలు గళం విప్పకుండా సిఎం అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ ఆర్‌సి కుంతియా మాట్లాడుతూ కెసిఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఇలాంటి నిరసనలకు ఏఐసిసి ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు తదితరులు మాట్లాడారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ధర్నాచౌక్ పరిరక్షణ సమితి ఒక లేఖను సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకుడు డి రాజా, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు పాల్కొని సంఘీభావం తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను తరలించవద్దంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో మాట్లాడుతున్న ప్రజా సంఘాల నేత కోదండరామ్. వేదికపై అఖిలపక్ష నేతలు