జాతీయ వార్తలు

నేపాల్ మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: చిరకాల మిత్ర దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని నేపాల్ గురువారం మన దేశానికి హామీ ఇచ్చింది. కాగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, నేపాల్‌లో భూకంపం అనంతర పునర్నిర్మాణ కార్యకలాపాల్లో సహకారం సహా ఎనిమిది ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. మన దేశంలో నాలుగు రోజుల పర్యటనకోసం వచ్చిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో విస్తృతస్థాయి చర్చల అనంతరం ప్రధాని మోదీ ఆయనతో కలిసి సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, నేపాల్, భారత్‌ల మధ్య తెరిచి ఉన్న సరిహద్దులను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఇరు దేశాల భద్రతా దళాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని అన్నారు. ‘మన భాగస్వామ్యంలో రక్షణ సంబంధాలు, సహకారం కీలక అంశం, మన రక్షణ ప్రయోజనాలు సైతం ఒకదానిపై మరోటి ఆధారపడి ఉన్నాయి’ అని మోదీ అన్నారు. ఈ విషయంలో అవసరమైన మద్దతు, సహాయం, సహకారం అందిస్తామని దేవుబా హామీ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ చెప్పినట్లుగా మా సరిహద్దులు తెరిచి ఉంటాయి.. అయితే చిరకాల మిత్రదేశమైన భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని, మా వైపునుంచి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు లభిస్తాయని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ఆయన చెప్పారు. కాగా, కొత్త రాజ్యాంగం అమలులో కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమేనని, అన్ని వర్గాల ప్రజలు, జాతుల అభిప్రాయాలతో కూడిన ఒక రాజ్యాంగం వాస్తవ రూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని దేవుబా వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేసే సమయంలో నేపాల్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొంటుందన్న నమ్మకాన్ని మోదీ కూడా వ్యక్తం చేశారు. మాధేసీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తూ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని అధికార కూటమికూడగట్టలేక పోవడంతో ఈ నెల 21న ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయలేకపోయింది.
రెండు దేశాల సరిహద్దులగుండా నిర్మించిన కతాయియా-కౌశా, రక్సౌల్ పర్వానీపూర్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ విద్యుత్ లైన్ల ప్రారంభంతో నేపాల్‌కు ఇప్పుడు లభిస్తున్న 350 మెగావాట్లకు అదనంగా మరో వంద మెగావాట్ల విద్యుత్ లభిస్తుందని మోదీ చెప్పారు. మెరుగైన కనెక్టివిటీ ద్వారా రామాయణ, బుద్ధిస్ట్ టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడానికి కూడా రెండు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని చెప్పారు. వరదల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు చర్చల్లో ప్రధానంగా చోటుచేసుకొన్నాయి. వరదల నిరోధానికి సంబంధించి నేపాల్, భారత్ ఏజన్సీల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సహకారం ఉండాలని, పరస్పర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని మోదీ కోరారు. ఉత్తరాఖండ్ వైపు నిర్మించే పంచేశ్వర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)త్వరలోనే ఖరారవుతుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేయగా, వరదల నిరోధానికి, వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని దేవుబా అన్నారు. అరుణ్-3 సాగునీటి ప్రాజెక్టుకోసం భూసేకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని దేవుబా తనకు చెప్పారని, ఈ ప్రాజెక్టు భూమిపూజకు తనను ఆహ్వానించారని మోదీ చెప్పారు.

చిత్రం.. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లను ప్రారంభిస్తున్న నేపాల్, భారత ప్రధానులు దేవుబా, నరేంద్ర మోదీ